– ఎప్పటికీ తరగని జ్ఞాన నిధి
– విద్యతోనే ఉన్నత జీవితం
– ప్రయోజకుడిని చేస్తోంది అక్షరం
– బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి
– అందుబాటులోకి యూనిఫామ్స్
– కొనసాగుతున్న పుస్తకాల పంపిణీ
– జోరుగా ‘బడిబాట’ కార్యక్రమం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ బడి అమ్మ ఒడి లాంటిది. అది ఎప్పటికీ తర గని జ్ఞాన నిధి. అ, ఆ.. లతో మొదలు పెట్టి.. జీవితాన్నే నేర్పి స్తుంది. పలకపై అక్షరాలు దిద్దించి.. భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. విలువలతో కూడిన విద్యను నేర్పి.. మన్నల్నీ ప్రయోజకులను చేస్తుంది. లాలిస్తుంది.. ఆడిస్తుంది.. తన ఒడిలో ‘పాఠాల’ జోల పాడుతుంది. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉందంటే అది విద్యతోనే సాధ్యం. ఆ విద్యకు పునాది వేసేది మన బడినే.. అందుకే అందరం చదవాలి.. దేశ అభ్యున్నతికి మన జ్ఞానాన్ని అందించాలి. ఎడ్యూకేషన్ స్పెషల్ సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం.
ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పాఠశాలల ప్రారంభానికి ముందే ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతులకు కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్స్, టెక్స్‌బుక్స్ అందించాలని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు వేసింది. పాఠశాలల పున:ప్రారంభం సమయానికి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సబంధిత అధికారులకు ఇటీవల ప్రభుత్వం అదే శాలు జారీ చేసింది. ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రయివేటుకు దీటుగా.. విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించాలన్న లక్ష్యంతో టెక్ట్స్‌బుక్స్ విషయంలో ఏలాంటి జాప్యం చేయకుండా సకాలంలో విద్యార్థులకు అందిస్తోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 2,472 ఉన్నాయి. ఇందులో విద్యార్థులు 2 లక్షల 33 వేల 525 మంది విద్యార్థులు చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 1338 ప్రభుత్వ పాఠశాలలో లక్ష 47 వేల 642 మంది విద్యార్థులు ఉండగా, వికారాబాద్ జిల్లాలో 1,134 ప్రభుత్వ పాఠశాలలో 85,883 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైమరీ పాఠశాలలు 728 ఉండగా, అప్పర్ ప్రైమరి పాఠశాలలు 224 ఉన్నాయి. హైస్కూల్స్ 182 ఉన్నాయి. ఈ ఏడాది పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులు 15 వేల మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 85,883 మంది విద్యార్థులు ఉన్నారు.
గతంలో తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా విద్యార్థులకు బుక్స్ అందని పరిస్థితి ఉండేది. దాన్ని అధిగమించేందుకు ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం విద్యార్థులకు సకాలంలో బుక్స్ అందేలా చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది రూ. 8 కోట్ల 86 లక్షల ఖర్చుతో లక్ష 47 వేల 642 మంది విద్యా ర్థులకు యూనిఫామ్ అందించనున్నారు. రూ. 5 కోట్ల 90 లక్షలతో 13లక్షల 44 వేల 80 పాఠ్య పుస్తకాలను లక్ష 47 వేల 642 మంది విద్యార్థులకు అందించేందుకు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. నోటు బుక్స్ 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ కూడా అందించనున్నారు. వికారాబాద్ జిల్లాలో 85,883 మంది విద్యార్థులకు స్కూల్ ప్రారంభం రోజు యూనిఫాం అందించేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాకు యూనిఫామ్స్ అందినట్టు జిల్లా విద్యాధికారి తెలిపారు. మండల కేంద్రాలకు డిస్ట్రిబ్యుషన్ కూడా జరిగింది. యూనిఫామ్స్ కొరత లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. యూనిఫామ్స్ విషయంలో జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు.. గ్రామీణ అభివృద్ధి శాఖతో సంప్రదింపులు చేస్తూ సకాలంలో అందించాలని వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 57750 టెక్ట్స్ బుక్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. 6 నుంచి 12 వ తరగతి వరకు ఇచ్చే నోట్ బుక్స్ 4 లక్షల 60 వేల 482 అందుబాటులో ఉన్నాయి. పదోవ తరగతి అభ్యాసన బుక్స్ 15 వేలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెప్పారు.