బహుజన సుక్కను

మా నాయిన నాగలి పట్టి
తొలి పొద్దు పాట పాడుతుంటే
మాయమ్మ ఇత్తనమేస్తూ..,
మలి పొద్దు రాగమందుకుంటే
సెమట సుక్కల ఉమ్మనీరును తాగి
విముక్తి ఎలుగునై పుట్టినోన్ని !

పుట్టుకకు ముందే
అమ్మ కడుపుల ఉండి
ఆకలి పాఠాన్ని చదువుకున్నోన్ని !
అవమానాల గాయాల్ని రుచి చూసినోన్ని !!

నేను పుట్టినెంబడే,
బతుకు పోరును చూసి భయపడి
ఏడుపు పదమందుకుంటే…,
మాయమ్మ పట్టుకున్న దైయిర్నపు
కొడవలిని నాకిచ్చింది.
స్వేచ్ఛ తగులును తెంపి
కడుపు నింపుకొమ్మని భరోసానిచ్చింది

మా నాయిన
భూజాన మోస్తున్న సుత్తెను నాకిచ్చి
బువ్వ దొరికే బుద్ధులెన్నో చెప్పిండు.
దోపిడీ కొండల్ని పిండి చేసి
రొట్టెల్ని చేసుకొని తినమని,
శ్రమల సక్కని బాట చూపిండు.

మాయక్క
అంటు ముట్టు, మాయ కట్టుబాట్ల
మడుల సంగతేందో తెలుసుకొని సుక్కల ముగ్గై
అందరిని అల్లుకొమ్మని
ఇరికి పండ్ల మాట చెప్పింది.

మాయన్న
నడి ఊళ్యకు తోలుకపోయి
రావి చెట్టు కిందున్న అచ్చర దీపాలను చూపి
గన్ను లాంటి పెన్ను ఒకటి నాకిచ్చి పోయిండు.

ఇప్పుడు
నేను చేయాల్సిందల్లా ఒక్కటే….
కొడవలి కోతై, సుత్తె దరువై
అల్లుకున్న పెను చీకట్ల మీద అక్షర తూటాలు పెల్చుతూ…,
నీలి ఆకాశంలో
తూరుపు గుండెల మీద
బహుజన సుక్కని నిలబెట్టడమే!!
– చిక్కొండ్ర రవి, 9502378992