బహుజన దృవతార

బహుజన దృవతారమానవత్వానికి నిలువెత్తు నిదర్శనమై
మూఢనమ్మకాల ముసుగులో జీవిస్తున్న
అజ్ఞాన సమాజానికి జ్ఞానపరిమళాలనద్ది
తలదించుకొని నడిచే వాళ్లను
చైతన్యపు దారుల్లో నడిపి
ఆకాశమంతెత్తు తలెత్తుకు తిరిగే
గుండెధైర్యాన్నిచ్చిన జ్ఞానఖడ్గం!
అవమానాల్ని అనుభవాల కొలిమిలో
సరిసి అక్షరాయుధాల్ని
చేసుకొన్న అక్షరయోగి!
అసమానతల రూపురేఖల్ని
మార్చేసిన ఆధునిక సంస్కర్త!
సత్యశోధక సమాజ నిర్మాతవై
సత్యంకోసం జీవితాన్ని
త్యాగంచేసిన త్యాగధనుడా!
కష్టాలను కవచంగా ధరించి
చదువులతల్లి సావిత్రిభాయి ఫూలేకు
తొలిమహిళా పంతులమ్మగా
పునర్జన్మ నిచ్చిన మహాపురుషుడా!
కరుడుకట్టిన హంతకులను సైతం
ఆదర్శ అధ్యాపకులుగా
మల్చిన మహాద్భుతశిల్పి
భ్రూణహత్యలకు చరమగీతం పాడి
చరిత్రలో నిలిచిన నవచరిత్రకారుడా!
నీ పేరే ఒక ధైర్యం
నీ చల్లనిచూపే ఒకస్ఫూర్తి
బడుగుల బతుకుల నావకు దిక్చూచి
గమ్యం తెలియని ప్రయాణికులకు
దారిచూపే పొద్దుపొడుపు
మా చీకటి తాటాకు ఇండ్ల కంతల్లోంచి
కనిపించే ధవతార
నీవే మాకు ఆకాశమంత ఆశ
నీ త్యాగాలమార్గంలో నడుస్తామని
బహుజనులందరూ బాస చేస్తూ
అర్పించాలి అక్ష్రరనివాళి..
– డాక్టర్‌ బాణాల శ్రీనివాసరావు, 9440471423