ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్‌

ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్‌– ఆయన స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనొచ్చు
– లిక్కర్‌ కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని షరతు
– ఆరు నెలల తరువాత తీహార్‌ జైలు నుంచి బయటకు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఇదే కేసులో ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తీహార్‌ జైలుకు తరలించిన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ట్రయల్‌ కోర్టు ఇచ్చిన షరతులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఎంపీ సంజయ్ సింగ్‌ రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చని, లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొంది. అలాగే ఈడీ అరెస్ట్‌, రిమాండ్‌కు సంబంధించి సంజయ్ సింగ్‌ దాఖలు చేసిన రెండో పిటిషన్‌ను కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో సహ నిందితుడు (అప్రూవర్‌గా మారిన) దినేశ్‌ అరోరా, ఎంపీ సంజరు సింగ్‌కు రూ. 2 కోట్లు ఇచ్చినట్టు ఈడీకి స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్‌ ఆధారంగా గతేడాది అక్టోబర్‌ 4న ఎంపీ సంజయ్ సింగ్‌ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ తరువాత ఆయనను అరెస్ట్‌ చేసింది. అనంతరం ఈడీ కస్టడీ ముగిసిన తరువాత జ్యుడీషియల్‌ రిమాండ్‌లో భాగంగా సంజరు సింగ్‌ను తీహార్‌ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తన అరెస్ట్‌, రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ, బెయిల్‌ పిటిషన్‌పై రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సంజయ్ దాఖలు చేసిన పిటిషన్లను గతేడాది డిసెంబర్‌ 22న ట్రయల్‌ కోర్టు, ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఢిల్లీ హైకోర్టులు తిరస్కరించగా … సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్త, జస్టిస్‌ ప్రసన్న బి వరలేలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈడీ తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు, సంజయ్ సింగ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీలు వాదనలు వినిపించారు.
ఈడీది ప్రతీకార చర్య: సింఘ్వీ
లిక్కర్‌ స్కాంలో సంజరు సింగ్‌పై ఈడీ చేస్తోన్న ఆరోపణలు మొత్తం అప్రూవర్‌గా మారిన దినేశ్‌ అరోరా స్టేట్మెంట్‌తో ముడిపడి ఉన్నాయని సింఘ్వీ కోర్టుకు నివేదించారు. అరోరా ముందు ఇచ్చిన 9 వాంగ్మూలాలలో సంజయ్ సింగ్‌ పేరు లేదని, తరువాత ఆయన పేరు చేర్చినట్లు చెప్పారు. అనంతరం ఈడి ‘నో అబ్జక్షన్‌’ స్టేట్మెంట్‌తో అప్రూవర్‌గా మారిన దినేశ్‌ అరోరాకు బెయిల్‌ వచ్చిందని వాదించారు. అయితే సెక్షన్‌ 50 ప్రకారం అరోరా స్టేట్మెంట్‌ పై తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ సంజయ్ సింగ్‌ అరెస్ట్‌ జరిగిన రోజు నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ తరువాత, ఈడీ ప్రతీకార చర్యను ప్రారంభించిందని ఆరోపించారు. ఆ వెంటనే దర్యాప్తు ఏజెన్సీ అధికారులు సంజయ్ సింగ్‌ నివాసానికి వెళ్లారని వివరించారు.
సంజయ్ సింగ్‌ అరెస్ట్‌ ఆవశ్యకత, ఆధారాలు లేని ఆరోరా స్టేట్మెంట్స్‌, సింగ్‌కు సంబంధంలేని అంశాలను ప్రస్తావించారు. అందువల్ల న్యాయాన్ని అపహాస్యం చేసే ఈ విధానాలను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ అంశాలతో ఏకీభవించిన ధర్మాసనం, సంజరు సింగ్‌ నుంచి ఎలాంటి డబ్బు రికవరీ కానందున తదుపరి కస్టడీ అవసరమా? లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎఎస్జీ ఎస్వీ రాజును ధర్మాసనం కోరింది. ఎలాంటి సూచనలు లేకుంటే మెరిట్‌ పై వాదనలు కొనసాగించాలని స్పష్టం చేసింది. లంచ్‌ బ్రేక్‌ తరువాత ఎస్వీ రాజు ఈడీ అభిప్రాయాలను కోర్టుకు నివేదించారు. ఈడీ కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని తెలిపారు. పీఎంఎల్‌ ఏ సెక్షన్‌ 45 ప్రకారం… మెరిట్స్‌ సంజరు సింగ్‌కు అనుకూలంగా ఉంటే బెయిల్‌ ఇవ్వవచ్చని కోర్టుకు నివేదించారు. అయితే నిందితుడు నేరానికి పాల్పడలేదని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని, బెయిల్‌ పై ఉన్న సమయంలో నిందితుడు ఎలాంటి నేరం చేసే అవకాశం లేదని కోర్టు సంతప్తి చెందితేనే, పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం నిందితుడిని కోర్టు విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని జస్టిస్‌ ఖన్నా స్పష్టం చేశారు.
ఈరోజు కోసం ఎదురుచూపు : సంజయ్ సింగ్‌ తల్లి రాధికా సింగ్‌
మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత సంజయ్ సింగ్‌కు బెయిల్‌ మంజూరు కావడంపై ఆయన తల్లి రాధికా సింగ్‌ స్పందించారు. కోర్టు నిర్ణయంతో తాము సంతోషంగా ఉన్నామని, దీని కోసం తాము ఎప్పటినుంచో వేచి చూస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, తన కుమారుడు అమాయకుడని, ఆయనను అరెస్ట్‌ చేయకూడదని, అయినా తనకు బెయిల్‌ రావడంతో తాము సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇక సంజరు సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఆప్‌ స్వాగతించింది. సత్యం గెలిచిందని ఆప్‌ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామని, ఈ కేసు మొత్తం బూటకమని, బీజేపీ కార్యాలయంలో ఈ కేసుపై కట్టుకథ అల్లారని ఆమె విమర్శించారు. మరో 500 సార్లు దాడులు చేసినా ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేరని స్పష్టం చేశారు. విచారణలో డబ్బు పట్టుబడనప్పుడు ఆయనను ఎందుకు కస్టడీలో ఉంచాలని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిందని ప్రియాంక కక్కర్‌ పేర్కొన్నారు.