నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన యాదాటి సునీల్‌యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో బెయిలు మంజూరు చేసింది. రూ.25 వేలు వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులను సీబీఐ కోర్టుకు సమర్పించాలని సునీల్‌యాదవ్ ను ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోగా పులివెందుల పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదనీ, విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. పాస్‌పోర్టును స్వాధీనం చేయాలని కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదంది. సీబీఐ కోర్టులో ఈ కేసు సత్వర విచారణ ప్రక్రియకు సహకరించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినా, విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నా బెయిలు రద్దుకు పిటిషన్ దాఖలు చేయడానికి సీబీఐకి అనుమతించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన యాదాటి సునీల్‌యాదవ్ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం తీర్పు వెలువరించారు. విచారణ ప్రక్రియను సునీల్‌యాదవ్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని సీబీఐతోపాటు సునీతారెడ్డిల ప్రధాన ఆరోపణ అని పేర్కొన్నారు. అయితే దీనికి విరుద్ధంగా ఎలాంటి పిటిషన్‌ను కింది కోర్టులో దాఖలు చేయలేదనీ, సీబీఐ విచారణకు హాజరయ్యాననీ, దీన్నిబట్టి చూస్తే విచారణ జాప్యానికి కారణం సునీల్‌యాదవ్ అంటూ సీబీఐ నెపం వేస్తోందన్నారు. ఈ కేసులో సునీల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా అయిదుగురు కీలక సాక్షులున్నారనీ, వారి సాక్ష్యాలు నమోదు చేసేదాకా బెయిలు మంజూరు చేయరాదని సీబీఐ అభ్యర్థించిందన్నారు. అయితే మొత్తం 300 మంది సాక్షులుండగా సీబీఐ పేర్కొన్న అయిదుగురు సాక్షుల్లో 218 సాక్షి వాంగ్మూలం నమోదు చేయడానికి చాలా సమయం పడుతుందన్నారు. సాక్షులను బెదిరిస్తారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ అనీ, అలా జరిగితే బెయిలు రద్దు కోరవచ్చనీ, అంతేగానీ ఈ కారణంగా నిర్బంధంలో ఉంచడం సరికాదంటూ షరతులతో బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.