
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి అన్నారు. ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌దేనని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాశం యాకయ్య, మడిపెద్ది ఐలయ్య, పాశం బుచ్చి రాములు, సోమ వీరన్న, తాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.