అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్: బాజిరెడ్డి గోవర్ధన్ 

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఆబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని చుయించిందని, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటి అమలు చేయటం లేదన్డినారు. సెప్టెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదన్నారు. ఆగస్టు 15 తర్వాత రుణమాఫీ చేస్తామని రైతులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన సన్న వడ్లకు మాత్రమే రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పటం సిగ్గు చేటని, రైతులు పండించిన సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. వారి బూటకపు మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని, ఇప్పుడు ప్రజలే బాధపడుతున్నారన్నారు. రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రజలను, రైతులను ఆదుకునేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ప్రజలకు రైతులకు అండగా ఉండి వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉండటం లేదని, బోరు మోటార్లు కాలిపోతున్నాయని విమర్శించారు.
ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని సిఎం చెబుతున్నాడని, అప్పటిలోగా అన్ని రకాల ఎన్నికలు పూర్తవుతాయన్నారు. అనంతరం ఖజానాలో డబ్బులు లేవని మరోసారి రైతులను మోసం చేసే అవకాశముందన్నారు. తాను ఎంపీగా గెలిస్తే ఇంకా బాగుంటుందని, గెలిచిన, ఓడిన ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇప్పటికే బకాయిలున్న 14 వందల కోట్లను చెల్లించటంతో పాటు సంస్థకు ఇవ్వాల్సిన వెయ్యి కోట్ల గ్రాంటును వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని, ఎవరిపైనైనా తప్పుడు కేసులు బనాయిస్తే తానే పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించి అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఇందల్వాయి ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, మొచ్చ శ్రీనివాస్, చింతల గంగాదాస్, శ్రీనివాస్, మధుకర్రావు, నాయకులు కుంచాల రాజు, నల్ల హన్మంత్రెడ్డి, శక్కరికొండ కృష్ణ, చింత మహేష్, పద్మారావు, ఒడ్డెం నర్సయ్య, కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, మోహమ్మద్ యూసఫ్, పాశంకుమార్, గంగాదాస్, నల్లవెల్లి సాయిలు, కిషన్రెడ్డి, చిరంజీవి, అంజయ్య, లింగం, శ్రీనివాస్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.