– ఆసియా క్రీడల ట్రయల్స్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ
న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్‌లను ఆసియా క్రీడల నేషనల్ ట్రయల్స్ నుంచి మినహాయించారు. హౌంగ్జౌ క్రీడలకు పూనియా, వినేశ్ నేరుగా ఎంపికయ్యారని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అడ్‌హాక్ కమిటీ తెలిపింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ వారాంతంలో రెజ్లింగ్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఫ్రీ స్టయిల్, గ్రీకో రోమన్ విభాగాల్లో ఆరు వెయిట్ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. బిజెపి ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో చట్టపర చర్యలు తీసుకోవాలని కోరుతూ వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్ సహా ఆరుగురు ప్రధాన రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత ఆరుగురు రెజ్లర్లకు రెండు దశల్లో ట్రయల్స్ నిర్వహించాలని ప్రతిపాదించగా.. విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలకు మాత్రమే మినహాయింపు ఇస్తూ అడ్‌హాక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్‌కు మినహాయింపు దక్కలేదు. బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ పోటీపడే విభాగాల్లోనూ ట్రయల్స్ నిర్వహించి విజేతలను స్టాండ్‌బై రెజ్లర్లుగా ఉంచుతామని అడ్‌హాక్ కమిటీ తెలిపింది.