శాంతియుతంగా బక్రీద్‌ జరుపుకోవాలి

– పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌
నవతెలంగాణ-ఖమ్మం
బక్రీద్‌ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ అన్నారు. ముస్లిం సోదరుల సామూహికంగా ప్రార్థనలు దష్టిలో ఉంచుకొని ఆదివారం నగరంలోని ఈద్గా ఇతర ప్రాంతాల్లోని గోళ్లగూడెం ఈద్గా ప్రాంతాన్ని, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రార్థన ప్రాంతాలను పోలీస్‌ కమిషనర్‌ సందర్శించారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌, భద్రతపై నిర్వహుకులతో పాటు అధికారులతో చర్చించారు. ప్రత్యేక ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగ కుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగ సందర్భంగా పార్కింగ్‌ ప్రాంతాలలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలని ట్రాఫిక్‌ పోలీసులకు సూచించారు. త్యాగాన్ని ప్రతీకగా ఈద్‌-అల్‌-అదా (బక్రీద్‌) పండగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే రెండవ అతి పెద్ద, ముఖ్యమైన పండుగ అని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన జిల్లాలో పండుగ పర్వదినాన శాంతియుత వాతావరణంలో పరస్పరం గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని సూచించారు. బక్రీద్‌ సందర్భంగా ఈద్గాలో ప్రార్థనకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మున్సిపల్‌ అధికారులతో కలిసి సౌకర్యాలు కల్పించిన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ముస్లిం మత పెద్దలతో పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసులు, సిఐలు రమేష్‌, మోహన్‌ బాబు, మత పెద్దలు షేక్‌ అబ్దుల్‌ రషీద్‌, షరీఫ్‌, ఇస్మాయిల్‌ సాబ్‌, అజీజ్‌ సాబ్‌, అఫ్జల్‌ సాబ్‌, నజీర్‌ సాబ్‌, మీరా సాబ్‌, ఫరీద్‌ ఖాద్రి, అబ్దుల్‌ రహ్మాన్‌, మౌలానా అజీజ్‌, తదితరులు పాల్గొన్నారు.