బాల గేయ విద్యా రసవేదం తెలిసిన ‘ఎల కోయిల పాట’

'Ela Koila Song' known in Bal Gaya Vidya Rasavedaఓ పిల్లలూ! మీకు తెలుసా…! ఇవ్వాళ్ల మనం కరీంనగర్‌ జిల్లాగా పిలుచుకుంటున్న ప్రాంతానికి వందల యేండ్ల క్రితం సబ్భిమండలం అని పేరు. అయితే కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా 1905లో నిజాం ఫర్మానాతో ఏర్పడింది. దీనికి ముందు కరీంనగర్‌ జిల్లా కేంద్రం ఎలగందుల. ఇక్కడి కోట మసీదు (దో మినార్‌) గోల్కొండ కోటలాగే కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇవ్వాళ్ళ మనం మాట్లాడుకోబోయే బాల సాహితీవేత్త ఈ ఖిల్లా ఎలగందులలో పుట్టి పెరిగిన కవి. ఆయన పేరు తుమ్మూరి రాంమోహన్‌ రావు. వీరు కవి, రచయిత, చిత్రకారుడు, వక్త, వ్యాఖ్యాత, రంగ్థల, టీవీ, సినీ నటులు. సీనీ గేయ రచయిత కూడా. తుమ్మూరి 23 మార్చి, 1953న శ్రీరామ నవమి రోజున పుట్టారు. తుమ్మూరి తల్లితండ్రులు శ్రీమతి సూర్యాబాయి-శ్రీ తుమ్మూరి పద్మనాభశర్మ. శ్రీశర్మ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. తెలుగు, ఉర్దూ, సంస్కృతాలు చదివారు. కవి, పండితులు, పద్య కావ్య రచనతో పాటు ‘సైరే ఎల్గందల్‌’ ఉర్దూ పుస్తకాన్ని తెలుగు చేశారు.

ఎలగందుల, కరీంనగర్‌లలో విద్యాభ్యాసం చేసిన తుమ్మూరి ఉద్యోగిగా ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ లోని ‘సర్సిల్క్‌ మిల్లు, సిర్పూర్‌ పేపర్‌ మిల్లుల్లో పనిచేశారు. తరువాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. కాగజ్‌నగర్‌ అచ్చంగా భారతదేశానికి రిప్లికా. ఇక్కడ తెలుగు, తమిళ, బెంగాలి, హిందీ, ఉర్దూ ఇలా అనేక భాషల సాహిత్య సంస్థలు ఉన్నాయి. తొంభయ్యవ దశకం వరకు అన్ని భాషా కార్యాక్రమాలకు ఇది గొప్ప ఉనికిగా నిలిచింది. తెలుగు కార్యక్రమాల కోసం కోటగిరి నారాయణగౌడు నేతృత్వంలో తుమ్మూరి, ఇతరులు ‘తెలుగు సాహితీ సదస్సు’ను ప్రారంభించారు.
వచనం, గేయం, బాలగీతం, గజల్‌, నానీలతో పాటు తెలుగు పద్యాన్ని అత్యంత ప్రౌఢంగా రాస్తున్న తుమ్మూరి తొలి ప్రచురణ ‘గొంతెత్తిన కోయిల’ గేయ సంపుటి. ఇందులో బాల గేయాలు ఉండడం విశేషం. తరువాత తనకు తానుగా ఏర్పరుచుకున్న నియమాలతో త్రిపదులుగా ‘మువ్వలు’ రాశారు. ‘పెన్‌గంగ’, ‘నేనెక్కడో తప్పిపోయిన’, ‘కొన్ని నవ్వుల్ని ఏరుకుందాం’, ‘శార్వరిలో కోయిల’ ‘ఎల కోయిల పాట’ వీరి వచన కవితా సంపుటాలు. ‘మెహఫిల్లో కోయిల’ గజల్‌ సంపుటి. వచనాన్ని అద్భుతంతా రాసే తుమ్మూరి తన రచనల్లో తాను పుట్టిన ఎలగందుల నుండి పనిచేసిన కాగజ్‌ నగర్‌ వరకు ప్రతిదీ నిక్షిప్తం చేశారు. వీరి వచనం ఇంత ందంగా రావడం డా.సదాశివ ఆశీర్వాదమే మరి. ఇంకా ‘డా.ముసుకు మధుసూధన్‌ రెడ్ది’, ‘నిండు మనిషి’ పేర జీవిత చరిత్రలు రాశారు. ఇవేగాక ‘సర్సిల్కు సరిగమలు, కొండ అద్దమందు వ్యాసాలు, ఉద్యోగ పర్వం, అరిపిరాల ముచ్చట్లు, అమెరికా ముచ్చట్లు, నైమిశారణ్య యాత్ర, పావనగంగ, తుమ్మూరి నానీలు, ఆమనిలో కోయిలలు వంటి మరో ఇరవై ఆరు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో ఇందులోంచి ఆరు పుస్తకాలు వస్తున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథ పురస్కారం, డా.సామల సదాశివ సాహితీ పురస్కారం, వానమామలై వరదాచార్య పురస్కారం, పోతన విజ్ఞాన పీఠం పురస్కారంతో పాటు డా.తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి పురస్కారాలు అందుకున్నారు తుమ్మూరి.
గేయాన్ని అత్యంత తీయగా, అందంగా, సొంపుగా, ఒడుపుగా రాయగలిగిన వారిలో తుమ్మూరి ఒకరు. అమెరికా తెలుగు పిల్లల కోసం వాచకాలు రాశారు. ‘చిన్నారి కోయిల’ వీరి బాల గేయ సంపుటి. కథలు ‘ఆనంద మందిరం’గా త్వరలో రానున్నాయి. ‘చక్కనైన కోడిపుంజు/ ఎక్కెనొక్క గుడిసెపై/ కొక్కొరకో కూతకూసి/ పల్లె మేలుకొలుపుటకై/ పగడాల కిరీటమే/ కోడిపుంజు నెత్తిపై/ రంగులీనే ఈకలతో/ అంగరఖా ఒంగిపై’ వంటి గీతాలు వీరి రచనకు నిదర్శనాలు. పిల్లలకు చక్కని అలవాట్లు, ఆహారపు విషయాలు చెప్పడానికి కూడా తుమ్మూరి గేయాన్నే తన ఆయుధంగా మలచుకుని, ఒకచోట- ‘కోహినూరు వజ్రమెంత/ కోడిగుడ్డు ముందు/ ఉడికిస్తే చాలు తింటె/ నోటికదే పసందు’ అంటారు. నిజం కదూ ‘సండే యా మండే, రోజ్‌ కావో అండే’. పిల్లల పత్రిక బాల చెలిమి గురించి కూడా చక్కని గేయం రాశారీయన. ‘బాలబాలికల నేస్తం/ బాలచెలిమి పుస్తకం’ అంటూ ‘చక్కిలి గింతల పత్రిక/ బాలల మానస పుత్రిక’ అంటారు. వేసవి శిబిరాల గురించి చెబుతూ అవి ‘వేసవి సెలవుల వేడుక/ ఇది బాలబాలికల వేదిక/… అభినయ కౌశల మాలిక’ అంటారు. గణపతి జననం గురించి మనం చదువుకున్నాం, విన్నాం. దనిని ‘గణానాంత్వా..’ గేయంగా రాశారు ఈయన. పిల్లల గురించి రాస్తూ .. ‘అమ్మా నాన్నల నవ్వులం/ వాడలోన చిరుదివ్వెలం/ పాఠశాలలో పువ్వులం/ ఎగిరే రేపటి గువ్వలం’ అని వాళ్ళ చిత్రాన్ని తన అక్షరాలతో గీస్తారు. ఇంకా.. ‘పలకా బలపం పడితే చాలు/ పంతులుగారిని మెప్పిస్తాం’ అంటారు. ‘దసరా పండుగ వచ్చింది/ రమ్మని ఊరికి పిలిచింది/ ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళను/ ఒక్కచోటికీ చేర్చింది’ అని పండుగ నేపథ్యాన్ని వర్ణించినట్టే, తాను అమెరికాలో పిల్లలను చూసిన విషయాన్ని ‘అమెరికాలో నివసించే/ తెలుగు పిల్లలం/ ఎంచక్కా మేమిక్కడ/ తెలుగు నేర్చుకుంటాం’ అంటూ అక్కడి పిల్లలు చేసే నాట్యాలు, ఇతర అన్ని విషయాల గురించి ఇక్కడి పిల్లలకు చెబుతారు. ఇద్దరు పిల్లల నేపథ్యంగా రెండు పాత్రలతో తుమ్మూరి రాసిన కథలు ‘ఆనంద మందిరం’గా సంపుటీకరించారు. ఇవి తేవాల్సిన అవసరముంది. తుమ్మూరి ఒక తరుణ బాలల గేయంలో ‘పెరుగుతున్న పిల్లలం/ వెలుగుతున్న దివ్వెలం’ అంటూ రాశారు. అంతేకాదట.. ఆ పెరుగుతున్న పిల్లలు కన్నవారికెపుడు కంటిపాపలట. పద్యాన్ని అత్యంత ప్రౌఢంగా రాసే తుమ్మూరి రాం మోహనరావు బాలల గేయాలను అంతే తీయగా రాశారు. పద్యవిద్యా పరుసవేదితో పాటు, గేయ విద్యా రసవేదం తెలిసిన శిల్పి తుమ్మూరి రాంమోహనరావు. జయహో! బాల సాహిత్యం.

– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548