కవి, రచయిత, కార్యకర్త, నాటక రచయిత, సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో బాధ్యుడు సిద్ధిపేటకు చెందిన యువకవి గంగాపురం శ్రీనివాస్. గంగాపురం శ్రీనివాస్ సిద్ధిపేట జిల్లా పెద్ద చెప్యాలలో 2 జూన్, 1979న పుట్టాడు. శ్రీమతి గంగాపురం సుగుణ, శ్రీ ఆశయ్య తల్లితండ్రులు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన శ్రీనివాస్ ప్రవృత్తి రీత్యా సాహిత్య, సాంస్కృతిక కార్యకర్త. ఈయన కలం పేరు ‘గంగశ్రీ’. వచన కవిత్వం, పద్యం, గేయం, వ్యాసం, బాలల కధ… ఇలా అన్ని ప్రక్రియా రూపాల్లో రచనలు చేస్తున్న గంగాపురం పలు లఘు కవితా ప్రక్రియలను కూడా చేపట్టి, వాటిని సుసంపన్నం చేశాడు. యోగ శిక్షకునిగా, ఆన్లైన్ తరగతుల బోధకునిగా, బాల సంస్కార్ కార్యక్రమాల నిర్వాహకునిగా ప్రశంసలు అందుకున్న ఈయన దాసరి శాంతకుమారి సారధ్యంలో తెలంగాణలో విలక్షణ కార్యమ్రాలకు వేదికగా నిలిచిన ‘తెలంగాణ సాహిత్య కళా పీఠం’కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
‘భాగవతము రాసె బమ్మెర పోతన/ రామభద్రునాజ్ఞ రయముగాను/ వీరభధ్రవిజయ వీరుని చరితమ్ము/ తేనెలొలుకు భాష! తెలుగు’ అంటూ తన తొలి పద్యకృతి ‘తేనె లొలుకు భాష తెలుగు భాష’లో నుతించిన గంగాపురం శ్రీనివాస్ పద్యాన్ని అత్యంత సుందరంగా రాయగల కవి. ఇందులోనే ‘పుడమి పనులకిచ్చు పున్నమి వెన్నెల/ చందమామ లాంటి చల్లదనము/ చందమామ పిలువ జాబిల్లి పాటలు/ తేనెలొలుకు భాష తెలుగు భాష’ అంటూ రాస్తాడు. ఈ పద్యకృతి ఈయన తొలి కృతి కాగా, మలికృతి ‘పిడికెడు బువ్వ కోసం’ కవితా సంపుటి. వచనం, పద్యమే కాకుండా మణిపూసలు, మినీ కవితలు, హైకూలు, నాటికలు రాశాడు. రెండు నూర్లకు పైగా కవితలు, కథలు, బాల గేయాలు రాశాడు గంగాపురం. వీరి రచనలు దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. ఇరవైకి పైగా కవితలు వివిధ సంస్థలు నిర్వహించిన పలుపోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి. ఇరవైకి పైగా పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహించిన వీరు కవిగా మణిపూసల కవి భూషణ, మధుర కవి భూషణ, గాథా సృజన సంయామి మొదలగు పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయునిగా మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, సిద్ధిపేట జిల్లా ఉపాధ్యాయ పురస్కారం, సిద్ధిపేట జాతీయ సాహిత్య పరిషత్ ‘యువ సాహితీ పురస్కారం’, ఉదయ సాహితీ ‘కవితా భూషణ్’ పురస్కారం, మల్లినాథ సూరి పీఠం ‘కవిరత్న’ బిరుదులు అందుకున్నారు. బాల సాహిత్యలో ‘నారంశెట్టి బాల సాహిత్య పురస్కారం’ 2019లో అందుకున్నారు.
అచ్చయిన గంగాపురం బాల సాహిత్య రచన ‘బడి గంటలు’ బాలల గేయ సంపుటి. ఛందస్సు, గేయంపై మంచి పట్టున్న గంగాపురం శ్రీనివాస్ బడిగంటలు గేయ సంపుటిలో లయాత్మకమైన చక్కని గేయాలను పొందుపరిచాడు. ‘గణగణ గణగణ గంటలు మ్రోగగ/ బడియనె గుడిలో బాలల సందడి/ అక్షరార్చనకు శ్రీకారమ్ముగ/ చదువుల తల్లికి పూజలు జేసిరి’ అంటూ సాగుతాయి ఈయన గేయాలు. ఇంకా… ‘ఢమఢమ ఢమఢమ ఆటలు ఆడగ..’, ‘రరురరు రరు రాకెట్ లాగ/ దూసుకువెళ్తే గగన తలమ్మున/ విజయాలెన్నో బాలల కందగ…’ అంటూ బాలల గురించి రాస్తాడు. వృత్తి రీత్యా నిరంతరం పిల్లలను దగ్గరగా చూస్తున్న శ్రీనివాస్ వాళ్ళ తత్వ్తాన్ని, వ్యక్తిత్త్వాన్ని చక్కగా అవగాహన చేసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ ప్రశ్నించే విధానం, ప్రతిదాన్ని తరచి తరచి చూసే పిల్లల స్వభావం ఈయనకు బాగా తెలుసు. గేయాలు ఆ దిశగానే కూర్చాడు. ఒక గేయంలో.. ‘ఆవు ఆవు మాకెమిస్తావ్?/ కమ్మని పాలు పిల్లల కిస్తా/ ..’కోడి కోడి మాకెమిస్తావ్?/ బలమును పెంచె గుడ్డును ఇస్తా/ పలకా పలకా మాకేమిస్తావ్?/ చిట్టి చెల్లికి చదువులు ఇస్తా’ అని రాస్తాడు. అన్ని బాగున్నారు… అయితే చిట్టి పాపకు అని రాయొచ్చు, కాని చిట్టి చెల్లికి అని రాయడం ఈ గేయంలోని అసలైన మెరుపు. ప్రభుత్వం కూడా ‘బేటి పడావో’ అంటోంది కదా! తన గేయాల్లో పిల్లలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించడమేకాక వాళ్ళలో దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పలు గేయాలను ఇందులో గంగాపురం రాశాడు. వాటిలో ‘దేశ సేవ చేసెదం’ గేయంలో ‘చదువలెన్నో చదివెదం/ చందమామ చేరెదం/ కబుర్లెన్నో చెప్పెదం/ కలిసి మెలిసి ఉండెదం’ అంటూనే… ‘దేహము అర్పించెదం/ దేశ సేవ చేసెదం’ అంటూ వారికి బోధిస్తాడు. గంగాపురం తన సంపుటిలో బోధలు, బోధనలతోపాటు చక్కని గేయకథలను కూడా కూర్చాడు. వాటిలో మనకు తెలిసిన ‘కోతి – మొసలి’ కథ ఒకటి. ఇందులో కథను ఆయన రాసిన విధానం పిల్లలకు నచ్చేవిధంగా ఉండడమేకాక, ఆసక్తిని కలిగిస్తుంది కూడా. ‘అందమైన నది ఒడ్డున/ మేడిచెట్టు ఉండెను/.. కోతి గుండె కొరకు మొసలి/ కపట ప్రేమ జూపెను/ కోతికి విందిస్తమంటు/ మొసలిని పంపించెను’ అంటూ సరళంగా, లయతో సాగుతుందీ గేయకథ. బాలలపై ప్రేమ, బాలల పట్ల అభిమానంతో పాటు వాళ్ళ ఉన్నతి పట్ల తనదైన దృక్కోణం ఉన్న బాల గేయ రచయిత, బాల వికాస కార్యకర్త గంగాపురం శ్రీనివాస్. జయహౌ! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548