పిల్లల కోసం కథలు, కవితలు, గేయాలు, నవలలు, నాటికలతోపాటు వివిధ ప్రక్రియలు, రూపాల్లో ఇప్పుడు రచనలు విరివిగా వస్తున్నాయి. ఈ కోవలోనే తొంభయ్యవ దశకంలో ఒక ఉద్యమంలా పిల్లల కోసం వందల వైజ్ఞానిక వ్యాసాలు రాయడంతో పాటు అనువాదాలు, రచనలు చేసినవారిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రచయిత, పాత్రికేయులు, అనువాదకులుగా మనకు తెలిసిన దోర్బల బాలశేఖర శర్మ. జూన్ 6, 1961న మెదక్ జిల్లా రామాయంపేటలో పుట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి దోర్భల ఆహాల్య – శ్రీ డి.జి. కృష్ణమూర్తి. వృత్తిరీత్యా జర్నలిస్ట్‌గా ఈనాడు, ఉదయం, వార్త, నమస్తే తెలంగాణ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. వందలాది వ్యాసాలు రాసిన బాల శేఖరశర్మ పాపులర్ సైన్స్ రచయితగా, బాలల సైన్స్ రచయితగా ప్రసిద్ధులు.
సాహిత్యకార్యక్రమాల పట్ల ఆసక్తితో తాను ప్రధాన కార్యదర్శిగా బాలశేఖరశర్మ 1982లో రమ్య భారతి సాహిత్య సంస్థను ప్రారంభించి రామాయంపేటలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిచారు. తరువాత శ్రీవాణి కల్చరల్ అసోసియేషన్ పేరుతో మరో సంస్థను ఏర్పరిచి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంస్థ పక్షాన శంకరాభరణం శంకరశాస్త్రిని బాలశేఖర శర్మ సత్కరించడం విశేషం. రచయితగా 1981లో వీరి తొలి రచన అచ్చయ్యింది. తిరునగరి వేదాంతసూరి ప్రోత్సాహంతో వార్తలో పిల్లల కోసం చాలాకాలం పాటు సైన్స్ సంబంధిత మౌలిక విషయాలను రచనలుగా అందించారు. ఇవి పిల్లలనే కాదు పెద్దలను కూడా విశేషంగా ఆకర్షించాయి. నాకు బాల శేఖరశర్మ తొలి పరిచయం ఈ సైన్స్ వ్యాసాలతోనే కలిగింది. ముఖ్యంగా జనరంజక విజ్ఞాన రచనల విషయంలో వీరిది పెద్దచేయి. నాకు తెలిసి 1986 నుండి ఇప్పటివరకు నిరంతరంగా వైజ్ఞానిక శీర్షికలు ఆపకుండా నిర్వహిస్తున్నారు బాలశేఖరశర్మ. ‘వింతలోకం, రౌండ్ ది వరల్డ్, జగమేమాయ, సైన్స్ లోకం, దృష్టి, పరిశోధన, కొత్త లోకం, వారేవ్వా, శాస్త్ర, సైన్స్ రహస్యాలు వంటివి బాలశేఖరశర్మ నిర్వహించిన, నిర్వహిస్తున్న పలుశీర్షికలు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఉత్తమ పత్రికా సంపాదకుల పురస్కారం, శృతిలయ ఆర్ట్స్ అకాడమి-సీల్ వెల్ కార్పొరేషన్, వివిధ సహృదయ ఫౌండేషన్ పురస్కారం మొదలు మరికొన్ని పురస్కారాలు వీరు అందుకున్నారు. ఆకాశవాణిలో సమకాలీన సైన్స్ అంశాలపై పలు ప్రత్యేక ప్రసంగాలు చేశారు. వివిధ పత్రికల ప్రతినిధిగా భారతదేశంలో జరిగిన అనేక వైజ్ఞానిక, పర్యావరణ సదస్సులు, కార్యక్రమాల్లో పాల్గొన్న వీరు వైజ్ఞానిక రచనారంగంలో చేసిన కృషికి విజ్ఞాశాస్త్ర రచయితగా 2019లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘నాగసూరి గౌరమ్మ-సంజీవయ్య కీర్తి పురస్కారం’ అందుకున్నారు.
బుడ్డిగ సుబ్బరాయన్ నేతృత్వంలో జరిగిన అనేక కార్యశాలలు, రచనాశాలల్లో పాల్గొన్న దోర్భల ‘తెలుసుకుందాం’ పేరుతో ఆంధ్ర మహిళాసభ- ఢిల్లీ లోని స్టెర్లింగ్ సంస్థల కోసం అనువదించారు. బాలల కోసం వచ్చిన వీరి విజ్ఞానశాస్త్రం, ఇతర పుస్తకాల్లో ‘భూమి, చంద్రుడు, గ్రహాలు- ఉపగ్రహాలు, సూర్యుడు, నక్షత్ర వీధులు, జీర్ణ వ్యవస్థ, అస్థి పంజర వ్యవస్థ, శ్వాసక్రియ వ్యవస్థ, నదులు, సరస్సుల రక్షణ, జన్యుకణాలు, క్రోమోజోములు, కండరాలు, సముద్ర సంరక్షణ, అడవుల పరిరక్షణ, గాలి శుభ్రత’ వంటివి పేర్కొనవచ్చు. బాల శేఖరశర్మ రచయితగానే కాక బాలల కోసం పలు పుస్తకాలను అనువాదం చేశారు. వాటిలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం చేసిన విమలేంద్ర చక్రవర్తి రచన ‘హరితవనం స్నేహితులు’, కమలేశ్ మహేంద్ర రచన ‘చున్మున్‌కు స్వేచ్చ’ వంటివి ఉన్నాయి. ఇవేకాక పిల్లల పెంపకంపై సీరియల్ కూడా రాశారు. ఇటీవల పిల్లల కోసం తెచ్చిన మరో తాజా పుస్తకం ‘బాల విజ్ఞానం : అజ్ఞానం మటుమాయం’. ఆయనే చెప్పినట్టు ఈ పుస్తకం మరింత సరళంగా సైన్స్ విశేషాల రచన. ఇందులో వీరు ‘జీవరాశి అంటే?’ మొదలుకుని ‘నీరు స్థితి మార్పులు’ వరకు ముప్పై ఆరు సైన్స్ వ్యాసాలు పొందుపరిచారు. ఇవన్నీ బాలల కోసం రాసిన వ్యాసాలు. మొగ్గలో సీరియల్‌గా వచ్చాయి. తొలి నుండి పిల్లల కోసం విజ్ఞానశాస్రాన్ని అత్యంత సరళంగా అందించడమే యజ్ఞంగా పెట్టుకున్న వీరు ‘జీవశక్తికి మూలం’, ‘మట్టి తినే సూక్షజీవులు’, ‘మొక్కల జీవకణాలు’, ‘బ్యాక్టీరియా అంటే’, ‘రక్త సరఫరా’, ‘జీవనరుచికి జిహ్వశక్తి’ వంటి వ్యాసాలున్నాయి. ఇవి కేవలం సైన్స్ పరిచయ వ్యాసాలు కాదు. బాలబాలికలకు అవగాహనతో పాటు, ఆలోచన రేకెత్తించే అక్షరబీజాలు. ఈ పుస్తకం చదివినవాళ్ళకు ‘నేను విజ్ఞానినే అని గర్వంగా చెప్పుకోగల అర్హత వస్తుంది’ అని వేదాంత సూరి చెప్పింది అక్షరసత్యం. ‘జీవరాశి ఎలా పుట్టింది’ వ్యాసంలో ‘భూగోళం స్థిరకక్ష్యలోకి వచ్చి నాల్గువందల యేండ్లయ్యింది’ వంటి విషయాలు చదివితే నోరువెళ్ళబెట్టకుండా ఉండలేం. ఈ కోవలోనే ఇతర అన్ని వ్యాసాలు ఇందులో చూడవచ్చు. బాలల కోసం మూడుదశాబ్దాలుగా నిబద్ధతతో వ్యాస యజ్ఞం చేస్తున్న ఈ ‘వైజ్ఞానిక వ్యాసయాజికి’ అభినందనలు.
– డా|| పత్తిపాక మోహన్
9966229548