బాల సాహిత్య వికాసోద్యమంలో ‘బాల’బోయిన

తెలుగు నేల మీద ఇవాళ్ళ తెలుగు బాల సాహిత్యం, బాలల తెలుగు సాహిత్య వికాసం కొరకు తెలుగు పంతుళ్ళే కాకుండా ఇతర భాషల్ని బోధిస్తున్నవారు, సాంఘిక, సామాన్య, గణిత శాస్త్రాల్ని బోధిస్తున్న టీచర్లు అనేకమంది మనకు కనిపిస్తారు. ఈ శీర్షిక ద్వారా కూడా అలాంటి తెలుగేతర భాషా బోధకులును, ఇతర సబ్జక్టుల టీచర్లను పరిచయం చేసుకున్నాం. ఆ కోవలోనే మనం పరిచయం చేసుకుంటున్న హిందీ ఉపాధ్యాయిని బాలబోయిన రమాదేవి. వృత్తిరీత్యా హిందీ భాషోపాధ్యాయిని అయిన రమాదేవి పిల్లల సాహిత్య, సామాజిక, మానసిక వికాసం దిశగా అత్యంత ప్రేమగా పనిచేస్తున్నారు. బాలబోయిన రమాదేవి సెప్టెంబర్‌ 7, 1979 న ఖిలా వరంగల్‌ తూర్పు కోటలో పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి బాలబోయిన యశోద – శ్రీ సమ్మయ్య.
కవయిత్రి, రచయిత్రి, ఉపాధ్యాయిని, బాల సాహిత్యవికాస కార్యకర్త, విద్యార్థుల మనోవికాసం, విజ్ఞానం కోసం నిరంతరం పనిచేస్తున్న రమాదేవి కథలు, కవితలు, గేయాలు, గజళ్ళు, నవల, వ్యాసాలు రాశారు. పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలన్న తపనతో ‘సాంత్వన ఫౌండేషన్‌’ ప్రారంభించి పనిచేస్తున్నారు. తన పేరుతో తాను పుట్టిన నేల ‘వరంగల్‌’ను తన పేరుతో పెట్టుకున్నారు రమాదేవి, తఖల్లుస్‌ లాగా… మకుటం లాగా. ‘ప్రాణం వాసన’ వీరి కవితా సంపుటి. ‘మీలిత’ పేరుతో నవల రాశారు. బాల వికాస కార్యకర్తగా పిల్లలతో టోరీ రేడియో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా హిందీ, తెలుగుల్లో పిల్లలతో కార్యక్రమాలు చేయించారు. తన బడి పిల్లల కవితలను ‘బాలకవులు బంగారు కొండలు’ పేరుతో, కథల సంపుటిని ‘బాల కథకులు బంగారు కొండలు’గా ప్రచురించారు. కేవలం వైజ్ఞానిక, మానసిక వికాసంతోనే కాదు, శారీరక వికాసం కూడా బాలలకు కావాలన్నది రమాదేవి సంకల్పం. అందుకోసం పిల్లలకు కండ్ల పరీక్షలు, ఇతర వైద్య పరీక్షల శిబిరాలను ఈమె నిర్వహింప చేశారు. విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్ళిన జ్ఞాపకాలను రచనలుగా రాయించి ఉన్నతాధికారులకు సమర్పించారు. తాను విద్యార్థినిగా వున్నప్పుడు నాటకాల్లో నటించి మెప్పుపొందిన రమాదేవి ఆటపాటలు, రంగస్థలం వంటి వాటిలో తన బడి పిల్లలకు తర్ఫీదునిచ్చి ప్రోత్సహిస్తున్నారు. వృత్తిరీత్యా అందుకున్న ప్రశంసలతో పాటు వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల గౌరవ సత్కారాలనూ అందుకున్నారు ఈ వరంగల్‌ బతుకమ్మ.
బాల సాహితీవేత్తగా కథలు, గేయాలు, నాటికలు రాసిన రమాదేవి, వాటిని వివిధ పత్రికల్లో ప్రచురించారు. బాలల కోసం నాటికలు రాయడంలో ఈమె సిద్ధహస్తురాలు. ‘నదీమతల్లిని కాపాడుకుందాం’, ‘పచ్చనిచెట్లు ప్రగతికి మెట్లు’, ‘ఓంఫట్‌ స్వాహా’ రమాదేవి బాలల కోసం కూర్చిన నాటకాలు. ఇవన్నీ ఆకాశవాణిలో ప్రసారం కావడం విశేషం. ‘నదీమతల్లిని కాపాడు కుందాం’ నాటికను విద్యార్థులు ప్రదర్శించి జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని, జోనల్‌లో ద్వితీయ బహుమతిని అందుకుంది. నదులను కలుషితం చేయడం, పశువులను కడగడం, ఆ నీటిని అలాగే ప్రజలు తాగడం వంటి అనేక విషయాల గురించి, ఆ నీటి ద్వారా వచ్చే అంటువ్యాధుల గురించి, వాటిని మందుల ద్వారా నయం చేసుకోకుండా మూఢనమ్మకాలతో మరింత పెద్దగా చేసుకుని ఎలా ఇబ్బందులకు గురవుతున్నారో, వాటి పరిష్కారాలేమిటో ఇందులో చెబుతారు రచయిత్రి. మరో నాటిక ‘పచ్చనిమెట్లు ప్రగతికి మెట్లు’లో ఒక ఎద్దు, ఒక పక్షి, ఇద్దరు రైతుల మధ్య సంభాషణ. చెట్టు లేకపోతే పశుపక్షాదులకే కాక మనుష్యులకు ఎంత నష్టమో ఈ నాటికలో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత్రి. ఈ కోవలోనే పిల్లల కోసం రాసిన నాటిక ‘ఓం హాం ఫట్‌’. ఈ నాటికలో మంత్రాలు, చేతబడులు, దేవుండ్లు, అంజనాలు, పూజలు వంటి వాటిని గురించి రాస్తూ, వాటికి సునిశిత హాస్యాన్ని, వ్యంగ్యాన్ని కూర్చారు ఈమె.
రమాదేవి రాసిన కథలు ఇటు తెలంగాణ భాషలోనూ, పుస్తకభాషలోనూ ఉండడం విశేషం. ముఖ్యంగా ‘నానమ్మ సందుగ’ బాలల కథ చక్కని తెలంగాణ భాషలో సాగింది. పంతొమ్మిది వందల ఎనభైకి ముందు పుట్టినవాళ్ళకు ఇటువంటి నానమ్మ, అమ్మమ్మలు, వాళ్ళ సందుగలు అందులో దాచుకుని మనకు ఇచ్చిన పైసలు, చిరుతిండ్ల గురించి బాగా తెలుసు. దానిని రచయిత్రి అద్భుతంగా చెప్పారు. ‘అమ్మమ్మ గారిల్లు’ మూలాలను పరిచయం చేసే కథ. ఇది నేటి పెద్దలకు ఒక జ్ఞాపకాల తేనెతుట్టె, పిల్లలకు గొప్ప స్ఫూర్తివంతమైన కథ కూడా. మనం ‘బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి’ అంటూ పద్యాన్ని చదువుకున్నాం. ఐకమత్యాన్ని చెబుతూ గడ్డిపోచతో పేనిన తాడు కథను చెప్పుకుంటాం. అదేవిధంగా ‘ఒక్క చీపురు పుల్లే’ కథలో ఒక్కటే కదా అని రోజుకో చీపురుపుల్ల పోతూ వుంటే మనకెందుకులే ఆని అనుకోవడం వల్ల చివరకు అన్ని పుల్లలు పోయి చీపురెలా బోడవోయిందో చెప్పేకథ ఇది. నిజానికి ఇది సాధారణంగా అనిపించినా పిల్లలకు చక్కని అవగాహనతోపాటు స్ఫూర్తిని కలిగిస్తుంది. ఇంకా ‘శల్యమైత్రి’ వంటి మరికొన్ని మంచి చైతన్య, స్ఫూర్తివంతమైన రచనలు ఈమె రచనల్లో ఉన్నాయి. ఓరుగల్లు నేలమీద కొత్త కోణంలో బాలల కోసం చక్కని రచనల నారుపోస్తున్న బాలబోయిన రమాదేవికి అభినందనలు. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548