దీపావళి రిలీజ్‌కి బలగం విజయం నమ్మకాన్నిచ్చింది

For Diwali release Strength is the victory of faithనిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్‌ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్‌ఏ వెంకట్‌ దర్శకత్వం వహించారు.
పూ రాము, కాళీ వెంకట్‌ ప్రధాన పాత్ర ధారులు. ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ‘స్రవంతి’ రవికిశోర్‌ సంభాషించారు.. ఆ విశేషాలు..

నేను చెన్నైలో ఉన్నప్పుడు కథలు వింటున్నా. నా స్నేహితుడు ఒకరు ‘ఓ కథ విన్నా. మీరూ వినండి’ అని పది నిమిషాలు చెప్పాడు. నాకు నచ్చింది. వెంటనే దర్శకుడు ఆర్‌ఏ వెంకట్‌ నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేశా. వేరే నిర్మాతతో చేద్దామని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఒకవేళ మార్పులు ఏమైనా ఉంటే చెప్పమని అడిగా. పదిహేను రోజుల తర్వాత నాకు ఫోన్‌ చేశారు. వేరే నిర్మాతకు ఏవో సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు స్క్రిప్ట్‌ అంతా రికార్డ్‌ చేసి పంపించమని అడిగా. బౌండ్‌ స్క్రిప్ట్‌ రికార్డ్‌ చేసి పంపించాడు. అది విని ఓకే చేశా.

సినిమా చూసిన కొందరు మిత్రులు ‘ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లేదా అవార్డులకు ఎందుకు పంపించకూడదు?’ అని అడిగారు. అప్పటికి థియేటర్లలో విడుదల చేద్దామా? ఓటీటీకి ఇద్దామా? అని ఆలోచిస్తున్నా. స్నేహితుల మాటలతో ఇండియా పనోరమాకు పంపించా. ఒక రోజు సినిమా సెలెక్ట్‌ అయ్యిందని ఫోన్‌ వచ్చింది. అదొక గొప్ప అనుభూతి. తర్వాత చెన్నై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి ఇస్తుంది. మనసుకు హత్తుకునే చిత్రమిది. తెలుగులో ‘దిల్‌’ రాజుతో పాటు మీడియా కూడా సినిమా చూసింది. బావుందని ప్రశంసించారంతా. చెన్నైలో సుమారు 200 మంది మీడియా మిత్రులకు షో వేశాం. స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. అంతకు ముందు గోవాలో కూడా అటువంటి స్పందన లభించింది.

దీపావళి పండక్కి బాణాసంచా వెలుగులు ఎంత ముఖ్యమో… పిండి వంటలు, కొత్త దుస్తులు కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా కూడా అంతే! ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ని కూడా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నా. డబ్బింగ్‌ సినిమాలను కూడా తెలుగుతో సమానంగా ఆదరిస్తున్నారు. తమిళంలో తీసినా సరే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్నాయి. ‘బలగం’ చూసిన తర్వాత తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నా.

రామ్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. రామ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు ఉంది. ముందు తన కమిట్మెంట్స్‌ ఏం ఉన్నాయో త్రివిక్రమ్‌ చూసుకోవాలి. రామ్‌ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్‌ బావుంటుందని అతను అనుకోవాలి.