విద్వద్గద్వాలలో వికసించిన బాలగేయ చంద్రకిరణాలు

విద్వద్గద్వాలలో వికసించిన బాలగేయ చంద్రకిరణాలుగద్వాలది తెలంగాణ సాహిత్యచరిత్రలోనే కాదు తెలుగు సాహిత్య చరిత్రలో కుతూబ్‌ మినారంత ఎత్తైన పేరు… గోల్కొండ కోటంత విశాలమైన తేరు. ‘అటు గద్వాలిటు చెన్నపట్టణం’ అంటూ మహా కవులు తమ చరిత్రలో కీర్తించిన ఊరు. అటువంటి ‘విద్వద్గద్వాల’ నుండి బాల సాహిత్యంలో కొత్త కిరణాలు వెలువరిస్తున్న గజల్‌ కవయిత్రి. ఉద్యమకారిణి, వివిధ సామాజిక మహిళా సంస్థలతో కలిసి పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, బాల సాహితీవేత్త గద్వాల కిరణ్‌ కుమారి. నిజానికి కవయిత్రి కిరణ్‌ కుమారి ఇంటిపేరు కూచూరి కిరణ్‌ కుమారి. తన ఊరిపేరునే కవి పేరుగా మలుచుకుని ‘గద్వాల కిరణ్‌ కుమారి’ అయ్యింది.
మార్చి 18, 1964న గద్వాలలో జన్మించింది కిరణ్‌ కుమారి. వీరి అమ్మా నాన్నలు శ్రీమతి పైపాటి మహంతమ్మ – శ్రీ సాంబశివయ్యలు. ఎం.ఎ., ఎంఫిల్‌., బి.ఇడి., చేసి ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న వీరు పిహిచ్‌.డి పరిశోధన చేస్తున్నారు. ‘హృదయం పలికించే మధుర గేయమే గజల్‌/ తీరని వలపుకైన గుండె గాయమే గజల్‌’ అంటూ హృద్యంగా గజల్‌ రాసినా, ‘ఇప్పటికి మా ఊరును కలగంటాను నేను/ ఎప్పటికీ బాల్యంతో కలిసుంటాను నేను/ … నేటికి నాకు బలం స్నేహితులే కిరణా/ స్నేహం కోసం మళ్లి పుడుతుంటాను నేను’ అంటూ బాల్యస్మృతుల్ని గజళ్లలో నెమరేసినా అది తనదైన విధంగా రాస్తుంది కిరణ్‌ కుమారి. తన తెలుగు గజళ్ళు, రుబాయిలను ‘గజల్‌ కిరణాలు’ పేరుతో వెలువరించిన సంపుటంగా తెచ్చిన కిరణ్‌ కుమారి వివిధ వేదికలపైన తన కవిత్వాన్ని, గజళ్లను వినిపించింది. కవయిత్రిగా హైదరాబాద్‌ జిల్లా స్థాయి మహాత్మా బసవేశ్వర సాహిత్య పురస్కారం, రాష్ట్రస్థాయి శ్రీ రామదాస్‌ మహారాజ్‌ స్మారక సాహితీ పురస్కారం, డా.సినారె సాహితీ పురస్కారాలతో పాటు వివిధ సంస్థల సత్కారాలు, గౌరవాలు అందుకున్నారు.
హృదయాలను హత్తుకునే గజళ్ళను రాసిన గద్వాల కిరణ్‌ కుమార్‌ బాలల మనసులను ఆకట్టుకునే బాల గేయాలను కూడా రాశారు. వాటిని తాను ప్రేమించే తెలుగు పిల్లలకు కానుకగా ‘చంద్రకిరణాలు’ గా ప్రచురించి అందించారు. లయాత్మకత, అభివ్యక్తి, వస్తువు వంటి అన్ని గుణాలతో అలరారే ఈ చంద్రకిరణాలు పిల్లలనే కాదు పెద్దలను ఓలలాడిస్తాయి… సేదతీరుస్తాయి. తన గజళ్లలో… కవిత్వంలో నాస్టాల్జియాను చూపించిన కవయిత్రి బాల గేయాల్లో దానికి చక్కని గేయరూపం కల్పిస్తారు. ‘అల్లరి బాల్యం/ అందాల బాల్యం / ఆటలు ఎన్నో / ఆడే బాల్యం/ పాటలు పాడుతు/ పెరిగే బాల్యం/ ఊయల చూసి/ మురిసే బాల్యం/ వానలొ విడిచే/ పడవల బాల్యం/ అమ్మ చెప్పే/ ముచ్చట్ల బాల్యం/ నానమ్మ కథలు/ నచ్చేటి బాల్యం/ చెట్లను ఎక్కి/ ఊగేటి బాల్యం’ అంటూ చివరగా ‘అందరికీ ఇష్టం / బడిలోని బాల్యం’ అంటూ ముక్తాయింపు నిస్తుంది… అందంగా.. అందరికీ బాగా నచ్చే విధంగా.
కిరణ్‌ కుమారి గేయాల్లో మన బాల్యం… మన పిల్లల బాల్యం.. తాతలు, అమ్మల వయస్సువారికి వారి మనవలు మనవరాళ్ళ బాల్యం చక్కగా కనిపిస్తుంది. ‘అందాల మా పాప/ అద్దంలా మెరిసింది/ ముద్దగా నవ్వింది/ చేతుల్లో ఆడింది’, ‘చిన్నారి నవ్వు/ విరిసిన పువ్వు/ ముసిముసి నవ్వు/ మురిపించె నవ్వు’ వంటివి అందుకు చక్కని ఉదాహరణగా నిలిచే గేయాలు.
ఇంకా.. చిన్నారి పిల్లల కోసం రాసిన ‘జెండా పండుగ/ నాకిష్టం/ జేజేలు పలుకుట/ నాకిష్టం/ జాతీయ గీతం/ కాకిష్టం/ జైహింద్‌ నేతాజీ/ నాకిష్టం’ మరో చోట ‘అమ్మ ఒడి నాకిష్టం/ నాన్న ముద్దు నాకిష్టం’ అంటూనే ‘నా పేరు అంటే/ నా కిష్టం’ అంటూ రాస్తుంది. బాలల మనసుల్లోకి చూస్తే తప్ప ఇటువంటివి రాయడం సాధ్యంకాదు మరి. ‘భక్ష్యాల పండుగ/ ఉగాది పండుగ/ పువ్వుల పండుగ/ బతుకమ్మ పండుగ/ ..ఆషాడానికి/ బోనాల పండుగ/ మాకెంతో ఇష్టం/ హోళీ పండుగ’ అంటూ తాను పుట్టి పురిగిన తెలంగాణ నేల పండుగలను కీర్తిస్తూనే గ్రామీణ జీవన వైవిధ్యాన్ని, అందులోని మాధుర్యాన్ని ‘జాతర’ అంనే మరో గేయంలో అలతి అలతి పదాలతో అక్షర చిత్రంలా చూపిస్తుంది కవయిత్రి. ‘..తియ్యటి బెత్తాసులు/ అమ్మేటి జాతర/ ఊపిరి బుడగలు/ ఎగిరేటి జాతర/ రంగుల రాట్నం/ తిరిగేటి జాతర/ పీపీ బూరల/ ఊదేటి జాతర/ గలగల గాజుల/ మోగేటి జాతర’ తన ఊరి సరదాల జాతర గురించి కవయిత్రి చెప్పినా ఇది అందరికీ… అన్ని ఊర్ల జాతర్లకు వర్తిస్తుంది. లయతో పాటు అంత్య ప్రాసలు కరణ్‌ గేయాల్లో అంతటా కనిపిస్తాయి… ‘అబద్దాలు చెప్పవద్దు/ అల్లరికి వుంది హద్దు’, ‘తెల్లని బల్లి/ తెలివైన బల్లి/ గోడన పాకే/ వయ్యారి బల్లి’ వంటివి చూడొచ్చు. ఇంకా ‘సోమవారం వచ్చింది/ చక్కగ బడికి పొమ్మంది/ మంగళవారం వచ్చింది/ మంచి పనులు నేర్పింది/ ..శనివారం వచ్చింది/ ఆటల కోసం రమ్మంది/ ఆదివారం వచ్చింది/ మాయిని మాకు యిచ్చింది’ వంటి చక్కని పాటల వెన్నెల గజల్‌ గద్వాల కిరణ్‌ కుమారి చంద్రకిరణాల వెన్నెల్లో ఉన్నాయి. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548