‘డాకు మహారాజ్‌’గా బాలకృష్ణ

'డాకు మహారాజ్‌'గా బాలకృష్ణనందమూరి బాలకష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109వ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి ‘డాకు మహారాజ్‌’ అనే శక్తివంతమైన టైటిల్‌ను పెట్టారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో టీజర్‌ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్‌.తమన్‌ హాజరయ్యారు.
‘ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది’ అంటూ ‘డాకు మహారాజ్‌’గా బాలకష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపిస్తుంది. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. తమన్‌ నేపథ్య సంగీతం టీజర్‌ని మరోస్థాయికి తీసుకెళ్లిందని యూనిట్‌ తెలిపింది.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, ‘బాలయ్య సష్టిస్తున్న రికార్డులను దష్టిలో పెట్టుకుని, కేవలం మాస్‌లోనే కాకుండా అన్ని వర్గాలలో ఆయనకు ఉన్న ఆదరణను దష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాను’ అని అన్నారు. ‘టీజర్‌లో మీరు చూసింది చాలా చిన్నది. సినిమాలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. థియేటర్లలో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలైన పండుగలా ఉంటుంది’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ, ‘బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. బాలయ్యతో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఏదైతే కోరుకుంటుందో, దానికి తగ్గట్టుగా సంగీతం అందించాను.ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.