బాలికో రక్షతి రక్షితః

ధర్మోరక్షతి రక్షితః – ధర్మాన్ని మనం కాపాడుతే ధర్మం మనల్ని కాపాడుతుంది. మరి ధర్మం అంటే ఏమిటి? ధర్మం కేవలం సూక్తిముక్తావళి కాదు. ప్రవచన ప్రభోదాలు అంతకన్నా కాదు. ఆచరించేది, పాటించేది. మానవాళి ఏం ఆచరించాలి?
అహింసా పరమో ధర్మహః. అన్నాడు బుద్ధుడు. సమాజంలో హింసలేకుండా చేయాలి. నీవెలా సుఖశాంతులతో వర్థిల్లుతున్నావో అలానే ఎదుటివారు కూడా ఉండాలని ఆలోచించడం, వ్యవహరించడం, ఆచరించడం, పాటించడం, ఏమైనా కావచ్చు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులూ నీలాగే హాయిగా జీవించేలా నడుచుకోవడం, బాధితులకు సహకరించడం, ఆ సహకారంలో ఆనందం, తృప్తి పొందడం, ధర్మాచరణలో భాగమే అని చెప్పాడు. ఇతరుల హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరించడం, బాధపెట్టేలా నడుచుకోవడం, హింసారూపాల్లో భాగమే అని ఐక్యరాజ్యసమితి ఏనాడో పేర్కొన్నది. మానవ హక్కుల ఉల్లంఘన మానవ ధర్మ ఉల్లంఘనే అనే రీతిలో విశదీకరించింది. పూర్వం కాళిదాసుని కూడా భోజరాజు ఇలానే అడిగాడట. ధర్మం అంటే ఏమిటని? రెండే రెండు ముక్కల్లో సమాధానమిచ్చాడు కాళిదాసు. మహాకవి కదా. ‘పరోపకారం పుణ్యం పరపీడనం పాపం’ అని తేల్చి చెప్పాడు.
ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఏలికలకు ఎంత బాధ్యత ఉన్నదో ఎరుగంది కాదు. అయినా వక్రదృష్టితో, స్వార్థ దృష్టితో పాలన చేయడం వలన బాధితులకు ఉపశమనం లభించడం లేదు సరికదా వారి ఆక్రందనలు, ఆర్తనాదాలు అన్నీ అరణ్యరోదనగానే మిగులుతున్నాయి.
ఆ తరువాత ఇటీవల కాలంలో ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదం పార్కులు, పర్యావరణ కార్యాలయాల గోడల మీద కనిపిస్తున్నది. నిజమే. వృక్షాలను మనం కాపాడితే వృక్షాలు మనల్ని కాపాడుతాయి. వృక్షాలకు స్థూల రూపం అరణ్యం. అంటే అరణ్యాలను పరిరక్షిస్తేనే మనకు సరైన పర్యావరణం, వర్షాలు, నీరు, ప్రాణవాయువు, ఫలసంపద, జీవన సమతుల్యత అన్నీ సక్రమంగా, సహజంగా సమృద్ధిగా లభిస్తాయని వేరుగా చెప్పక్కర్లేదు. అందుకే అటవీ సంపదను యధేచ్ఛగా నిర్మూలించకుండా, గనులు, ఖనిజాలు వంటి సహజ వనరుల కోసం ధ్వంసం చేయకుండా బాధ్యతగా పెంపొందించుకోవాలి, విస్తరించుకోవాలి. వనసంరక్షణ, సామాజిక అటవీ పెంపుదల పథకం మొదలైనవి అన్నీ కార్యాలయాల కాగితాలకు, పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా అందరికీ ముఖ్యంగా అటవేతర ప్రజలు తమదైనందిన జీవితంలో ఆచరించేలా పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలి. లేకుంటే తమ్ముడు తమ్ముడే – పేకాట పేకాటే అన్న చందంగా పరిస్థితి విషమించుతుంది. ఇప్పుడు దాదాపు అలానే ఉన్నది మరి. మణిపూర్‌లో మానవ వనరులకన్నా సహజ వనరులకు ప్రాధాన్యత నివ్వడం చూస్తున్నాముగా.
ఇక ఇప్పుడు మూడవ నినాదం బాలికో రక్షతి రక్షితిః’ – బాలికలను మనం కాపాడుకుంటే బాలిక మనల్ని కాపాడుతుంది. బాలిక స్వేచ్ఛగా (భయం లేకుండా) ఆరోగ్యంగా, హాయిగా ఎదగాలి. అలా ఆరోగ్యంగా ఎదిగిన బాలికే తర్వాత యువతిగా, తల్లిగా మారి ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తుంది. మనదేశంలో అందరికన్నా ఎక్కువగా ఉల్లంఘనకు గురవుతున్నది బాలికా హక్కులే. జీవించే హక్కు, రక్షణపొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, గుర్తింపు – గౌరవం పొందే హక్కు ప్రతి బాలికకూ ఉన్నదే. బాలల హక్కులన్నీ బాలికల హక్కులే. మరి ప్రతి బాలిక వీటిని అనుభవించగలుగుతున్నదా… అంటే తొంభైశాతం అనుభవించడం లేదనే సమాధానం వస్తుంది. ఎంతెంత అణచివేత, ఎంతెంత వివక్ష, ఎన్నెన్ని వేధింపులు, చిత్రహింసలు, అత్యాచారాలు, అపహరణలు, హత్యలు కళ్ళముందు తారట్లాడుతున్నాయి. వర్ణించనలవి కాకున్నవి. క్షణక్షణానికి పర్వతంలా పెరిగిపోతున్న ఈ ఘోర అధర్మాన్ని మనం నివారించలేమా? బాలికను వేరేలా చూసే పాప పంకిలాన్ని అరికట్టలేమా? నిత్యం కీర్తించే మన భరతమాత పసిహృదయం పట్ల మనకు ఎందుకు అంత కండకావరం? పసి భారతమాతను పరిరక్షించుకోలేని మన చదువుల అభివృద్ధి చట్టుబండలుకావా? మన పాలన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? మరి ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంకు మన భారతమాత తల్లివంటిదని చెప్పుకుంటున్నామే? ఇందులో ఏమాత్రమైనా సత్యం ధర్మం ఉన్నదా? కావాలంటే ఈ లెక్కలు చూడండి…
2019-21 ఈ రెండేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు పదమూడు లక్షల మంది బాలికలు, స్త్రీలు అదృశ్యమైనట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఈ సంఖ్య ఇప్పటికే ఇంకా పెరిగే ఉంటుంది. ఈ పాపం ఎవరిది? మానవ అక్రమ రవాణాకు అంతేలేకుండా పోతున్నది. సంతలో పశువులను అమ్మినట్టు బాలికలను, స్త్రీలను ఈ విధంగా నోరూ వాయీ కట్టేసి అమానుషంగా క్రయ విక్రయాలు చీకటి బజారుల్లో జరపడం ఎంత ఘోరం? ఎంత వికృతం? మనం ఆధునిక సమాజంలో జీవిస్తున్నామా? మధ్యయుగాల్లో జీవిస్తున్నామా? అనే ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. ఇలాంటి మానవ (బానిస) వ్యాపారానికి తావేలేదని మన భారత రాజ్యాంగం 23వ అధికరణం నిర్దేశిస్తున్నది కూడా. అయినా బాలికలతో, స్త్రీలతో వెట్టిచాకిరీ, వ్యభిచారం, భిక్షాటన, అవయువ చౌర్యం.. బూతు చిత్రాలు ఒకటేమిటి… ఈ ఘోరకలి నానాటికి ఇలా విస్పోటనం అవుతున్నది. ఈ సంఖ్య రెండుకోట్లకు పైగా ఉంటుందని అంచనా. నోబుల్‌ పురస్కార గ్రహీత కైలాస్‌ సత్యర్థి ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో జరిగిన సర్వేలో వెల్లడైన ఈ విషయాలతో సభ్యసమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మానవ క్రౌర్యం, దాష్టికం బాలికల పట్ల ఇంత పాషాణంగా ఎందుకు మారుతున్నది? నివారించే మార్గమే లేదా? అనే ఆవేదన సర్వత్రా వెల్లడవుతున్నది. ఉన్మాదులు మాత్రం ఇది మామూలే… అన్నంతగా జడత్వానికి లోనవుతున్నారు. దుర్మార్గానికి వంతపాడటమే ఈ ప్రాప్తకాలజ్ఞత.
కొండా కోనల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు సైతం, వారి పేదరికాన్ని, క్షుద్బాధను అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భౌతికంగానో, అంతర్జాలంగానో వలవిసరడం, ఆకర్షణీయమైన ఉపాధులను వారికీ, వారి తల్లిదండ్రులకు ఎరగా చూపడం, తర్వాత వారిని మాఫియా మూకలకు అప్పజెప్పడం, మత్తుపదార్థాలకు అలవాటు చేయడం, హార్మొన్ల ఇంజక్షన్‌లతో లేతవయసులోనే వ్యభిచార కూపాల్లోకి నెట్టడం, చిత్రహింసలు పెట్టడం సాధారణ కృత్యమైపోయింది. మత్తుమాదక ద్రవ్యాల మాదిరి బాలిక కూడా అక్రమ రవాణా సరుకుగా మారడం విషాదాల్లో కెల్లా విషాదం. దీనికి విరుగుడు ఈ దుర్మార్గాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించాలన్న చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం, పాలకులకు ప్రథమంగా ఉండాలి. రెండవది పాఠశాలల్లో, బయటా లైంగిక వేధింపులు, చిత్రహింసలు, వివక్ష, అక్రమ రవాణా పట్ల అప్రమత్తత కలిగే విధంగా పాఠ్యాంశాలు, ప్రచారం ముమ్మరంగా సాగాలి. లేకుంటే బాలికో రక్షితి రక్షతిః కూడా మిగిలిన వాటి మాదిరి నినాద ప్రవచనంగానే మిగిలిపోతుంది. అశృనయనాల బాలికా భారతి అనునిత్యం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. మన భారతమాతకు విముక్తిలేదన్న సత్యం ప్రపంచానికి వెల్లడవుతూనే ఉంటుంది.
కె. శాంతారావు
9959745723