– పిల్లల ప్రపంచంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం
– వేలాదిగా తరలొచ్చిన చిన్నారులు
– ఆకట్టుకున్న కోలాట, జానపద నృత్య ప్రదర్శనలు
– ఆటపాటలతో అబ్బురపరిచిన విద్యార్థులు
– వైజ్ఞానిక ప్రదర్శనలో దేనికదే సాటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం పిల్లల ప్రపంచంగా మారింది. ఇరుకుగదులు..బట్టీ చదువులకు కాస్త విరామమిచ్చి స్వేచ్ఛా ప్రపంచంలో వేలాది మంది పిల్లలు విహరించారు. తమను చదువు అనే చట్రంలో బంధించకుండా స్వేచ్ఛనిస్తే..సృజనాత్మకతను ప్రోత్సహిస్తే బాలమేధావులుగా మరోప్రపంచాన్ని సృష్టిస్తామన్న ధీమాను చాటిచెప్పారు. వెయ్యి హోల్టుల బల్బు వెలిగిన మాదిరిగా తమ చైతన్యరూపాన్ని ముఖకవళికల్లో చూపెట్టారు. అందర్నీ ఆకట్టుకునేలా..ఆలోచింపజేసేలా ప్రదర్శనలిచ్చి ఔరా అనిపించారు. బాలోత్సవం ఆధ్వర్యంలో మూడో పిల్లల జాతర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఎస్వీకేలో ప్రారంభమైంది. అది పిల్లల సృజనాత్మక కార్యక్రమాలకు వేదికైంది.
స్వేచ్ఛా జీవులై…సృజనశీలురై
పిల్లలంతా తమలో దాగి ఉన్న శక్తిసామర్ధ్యాలను బాలోత్సవం వేదిక సాక్షిగా ప్రదర్శించారు. ‘చదువుల చట్రంలో బాల్యాన్ని బంధించకండి. ఇరుకుగదులు..బట్టీ చదువులకు పరిమితం చేయకండి. స్వేచ్ఛనివ్వండి. ఆడనివ్వండి. పాడనివ్వండి. ఆలోచించనివ్వండి. సృజనాత్మకతను ప్రోత్సహించండి. మరోప్రపంచంలో విహరించనివ్వండి’ అన్నట్టుగా పిల్లలు తమ ప్రదర్శనలు ద్వారా ఆలోచింపజేశారు. బంకమట్టితో ఇండ్లు, చేదబాయి, పొయ్యి వద్ద వంటచేస్తున్న అమ్మ, పొలం పనిచేసే రైతన్న బొమ్మలు చేసి ఔరా అనిపించారు. చెత్తకాగితాలు, పనికి రాని ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర వ్యర్థాలతో పిల్లలు పలు వస్తువులను తయారు చేశారు. దీపావళి సందర్భంగా కాల్చిపారేసిన భూ చక్రాల వ్యర్థాలతో ఓ అమ్మాయి తయారు చేసిన మోటార్ సైకిల్ బొమ్మ ఔరా అనిపించింది. ఐస్‌క్రీమ్ తినేసి పారేసిన పుల్లలతో ఓ అమ్మాయి గోడగడియారాన్ని అద్భుతంగా తయారు చేసింది. కొబ్బరుపీచుతో తయారు చేసిన పక్షిగూడు కూడా ఆకట్టుకున్నది.
శాస్త్రీయ భావజాలానికి నిలువుటద్ధం సైన్స్‌ఫేర్
చిన్నపిల్లలు తయారు చేసిన పరికరాలతో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్ శాస్త్రీయ భావజాలానికి నిలువుటద్ధంగా నిలిచింది. చదువులంటే చాందస్తం కాదు..శాస్త్రీయ విజ్ఞానమని పిల్లలు తమ విజ్ఞాన ప్రదర్శనలతో నిరూపించారు. వర్షపు నీటిని నిల్వచేసుకుని ఇంటి అవసరాలకు, ఫిల్టర్ చేసి తాగేందుకు వాడుకునేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రకృతి సంపదను ఎలా వాడుకోవాలనే ఆవశ్యకతను నొక్కిచెప్పింది. వాడిపారేసిన సిరంజీలు, సైలెన్ బాటిళ్ల పైపులతో విద్యార్థులు తయారు చేసిన జేసీబీ ఆకట్టుకున్నది. బయోడైవర్సిటీ పెంపొందించేలా కట్టిన ఇల్లు బొమ్మ పలువుర్ని ఆలోచింపజేసింది. ఇస్రో ద్వారా రాకెట్లను పైకి పంపే ప్రక్రియను చూపే ప్రదర్శన బాగుంది. ఇలా ఒక్కటేంటి అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ప్రదర్శనా దేనికదే ప్రత్యేకతను సాధించుకున్నది. నీటి కాలుష్యం ఏవిధంగా పెరుగుతున్నది? పర్యావరణాన్ని ఏవిధంగా కాపాడుకోవాలి? అనే అంశంపైనా విజ్ఞాన ప్రదర్శన చేశారు.
సందడే సందడి..
పిల్లల ఉరుకులు.. పరుగులు… ముచ్చట్లు..కేరింతలు…ఈలలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ‘కులం వద్దు. మతం వద్దు. మానవత్వమే ముద్దు’ అంటూ చిన్నారులు తమ ప్రదర్శనల్లో వ్యక్తపర్చారు. మొబైల్‌ఫోన్ మనుషుల జీవితాలను ఆగం చేస్తున్న తీరు కండ్లకు కట్టేలా నాటకాన్ని చిన్నారులు ప్రదర్శించారు. పర్యావరణాన్ని చేజేతులా ఎలా ధ్వంసం చేస్తున్నాం? ఎలా పరిరక్షించుకోవాలి? అనే అంశంపై చిన్నారి నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. పిల్లల పెంపకంలో ఆడ, మగ వివక్ష చూపొద్దని కోరుతూ ప్రదర్శించిన నాటిక తెలియకకుండానే తల్లిదండ్రులు చూపుతున్న వివక్షను ఎత్తిచూపింది. మనదేశంలో ఓవైపు ధనవంతుల పిల్లలు చదువుకుంటూ జీవితాన్ని ఎలా ఎంజారు చేస్తున్నారు? అదే సమయంలో పేదల పిల్లలు చదువులకు దూరమై సమాజంలో ఎలా చీత్కారాలకు గురవుతున్నారనే అంశంపై చిన్నారి ప్రదర్శించిన నృత్యప్రదర్శన ఆకట్టుకున్నది.విద్యార్థులకు షార్ట్‌ఫిలిమ్స్ చూపెట్టి దాని నుంచి గ్రహించిన సారాన్ని పేపర్ ప్రజెంటేషన్ చేశారు. బతుకమ్మ, జానపద కళారూపాల ప్రదర్శనలతో ఎస్వీకే బయట సందడి వాతావరణం నెలకొంది. సుందరయ్యపార్కులో పిల్లలు దాండియా నృత్య ప్రదర్శనలు చేశారు. అందరూ అబ్బురపోయేలా శాస్త్రీయ, జానపద నృత్యప్రదర్శనలు ఇచ్చారు. రాణిరుద్రమదేవి, భగత్‌సింగ్, అల్లూరిసీతారామరాజు, ఇలా విచిత్ర వేషధారణలతో వచ్చిన విద్యార్థులు ఏకపాత్రాభినయ పాత్రతో పంచ్ డైలాగ్‌లను విసిరారు.