
ఉమ్మడి నల్లగొండ జిల్లా యూటీఎఫ్ పూర్వ మాజీ అధ్యక్షులు కామ్రేడ్ నల్లబెల్లి బలరాం సేవలు చిరస్మరణీయం అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రం యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో పేర్కొన్నారు. నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కామ్రేడ్ బలరాంతో గల ఉపాధ్యాయ ఉద్యమ అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఉపాధ్యాయ ఉద్యమ నేత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్వ అధ్యక్షులుగా పనిచేసిన నల్లబెల్లి బలరాం గారి మరణం విషాదకరమని వారి లేని లోటు ప్రజాతంత్ర అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటు అని మొదటినుండి యూ.టి.ఎఫ్ సంఘంలో సభ్యులుగా చేరి తుది శ్వాస వరకు క్రియాశీలక పాత్ర పోషిస్తూ సంఘ నిర్మాణంలో తనదైన శైలిలో అనేకమంది ఉపాధ్యాయులను ఉద్యమ కార్యకర్తలుగా తయారు చేశారని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బలరాం మొట్ట మొదలు ఉద్యోగ ఆరంభంలో నారాయణపురం మండలం అధ్యక్షుడిగా తర్వాత జిల్లా కార్యదర్శిగా జిల్లా అధ్యక్షులుగా జిల్లా గౌరవ అధ్యక్షులుగా అనేక బాధ్యతలు నిర్వర్తించి ఉపాధ్యాయులకు ఒక మోడల్ గా నిలిచి అనేక త్యాగాలు చేస్తూ సంఘ నిర్మాణములో ఎంతో కృషి చేశారని బలరాం సార్ తో నాకు మంచి అనుబంధం ఉండేదని వారి నాయకత్వంలో నేను అనేక ఉద్యమాలలో ప్రధాన కార్యదర్శిగా కలిసి పని చేశానని, యుటిఎఫ్ నాయకులుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పాఠశాలల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని, ఒక ఉద్యమ కెరటం పోరాటాల నక్షత్రం నేల రాలిందని, ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలో వారి ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతుందని, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు రాజులేని కృషి చేసిన చరిత్ర వారిదని ప్రధానంగా భువనగిరి డివిజన్లో ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారని అన్నారు.
