వెదురువనం మరలా పుష్పిస్తుంది

Bamboo blossoms againఅనుభవించే ఆకలి దప్పులకన్నా
ఆశ్రయమిచ్చే అడవి తల్లి నీడే మిన్నంటూ
తలపోసే ఆదివాసీ సమూహాలను
తమ సొంత పౌరులని తలవక!
అభివృద్ధి సాకుతో విధ్వంసక విధానాలతో
చెట్టుకొకటి పుట్టకొకటిగా చెల్లాచెదురు చేస్తున్నారు
నిలువనీడలేకుండా నిరాశ్రయులను గావిస్తూ
నిధి నిక్షేపాలను నిలువునా దోచేస్తున్నారు
ఇదేమని ప్రశ్నించిన పాపానికి రక్తపుటేరులు పారిస్తున్నారు!
ఆశ్రమ వాతావరణం నెలకొన్న తపోవనాల్లో అరాచకం సృష్టిస్తున్నారు
కనీస మానవహక్కులను కాలరాస్తున్నారు!
కూలిన గోడలతో కునారిల్లుతున్న దండితారణ్యం
కుమిలి కుమిలి శోకిస్తోంది
మధురగానాలకు పులకించే బృందావనం
నెత్తుటి గాయాలతో కుమిలి కుమిలి రోదిస్తోంది
పుల్లలు పుల్లలుగా విరువబడ్డ పూర్వ వేణువు!
కంటికి మింటికి ధారగా కన్నీటితో జ్వలిస్తోంది
బెదురులేని వెదురువనం మరలా పుష్పించడానికి
కాలమెంతో పట్టదని సహనంతో నిరీక్షిస్తోంది!
ఢంకామోత వినే క్షణం దగ్గర్లోనే ఉందని
మాయాజూదం మరిక మానుమని పాచికల్ని మరిమరి హెచ్చరిస్తోంది!!
– కరిపె రాజ్‌కుమార్‌, 8125144729