– ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ దాసరి హరిచందన ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటి తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించినట్టు ఆమె పేర్కొన్నారు. సాచెట్స్, పౌచెస్, కంటేనర్స్ తదితర ఏ రూపాల్లో ప్యాక్ చేసినవైనా సరే… వీటిపై ఏడాది కాలంపాటు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
పటిష్టంగా అమలు చేయాలి : ప్రజారోగ్య పరిరక్షణ ఉద్యమకారులు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి పొగాకు వాడకం ప్రధాన కారణం కావడంతో దానిపై నిషేధం విధించాలని చాలా కాలం నుంచి ఆరోగ్యరంగ నిపుణులు, సామాజికవేత్తలు కోరుతున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ కేసుల్లో ఓరల్ కేసులు గుట్కా, పాన్ మసాల ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువగా ఉంటున్నాయి. వీటి వినియోగం వల్ల ఆయా వ్యక్తులు అనారోగ్యంపాలు కావడం, జీవితాన్ని కోల్పోవడమే కాకుండా కుటుంబాలపై ఆర్థికభారం పెరుగుతున్నది. ఒకవైపు చికిత్సకయ్యే ఖర్చు, మరోవైపు పని చేసే శక్తిని కోల్పోవడం, తద్వారా కుటంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ప్రజారోగ్య పరిరక్షణ ఉద్యమకారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిషేధం విధించగానే సరిపోదనీ, దాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.
దేశానికే ఆదర్శం : మాచన రఘునందన్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న మాచన రఘునందన్ ధన్యవాదాలు తెలిపారు. గత 20 ఏండ్లుగా పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమలాంటి వారికి నిషేధం అమల్లో ఉంటే, మరింత ఎక్కువ మందిని ఆ వ్యసనం నుంచి బయటపడేసే వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.