అరటికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలున్నాయి. ఇందులో అధికంగా వున్న విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎముకల బలానికి ఎంతో తోడ్పడతాయి. అలాగే కీళ్ల నొప్పులనూ నివారిస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. అలాగే ఇందులో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ అరటికాయతో చేసుకునే వివిధ రకాల రెసిపీలు ఈ వారం మీకోసం…
బజ్జీలు
కావలసిన పదార్థాలు: అరటికాయలు 2, శెనగపిండి రెండు కప్పులు, బియ్యం పిండి కొద్దిగా, పసుపు – చిటికెడు, ఉప్పు – రుచికి తగినంత, కారం – రెండు స్పూన్లు, జీలకర్ర కొద్దిగా, నూనె – డీప్ ప్రైకి సరిపడా. నూనెలో వేయించిన పల్లీలు – కొద్దిగా. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు.
తయారీ విధానం: ముందుగా అరటికాయలను కడిగి పైనున్న తొక్కను సన్నగా తీసుకోవాలి. పూర్తిగా అరటికాయ లోపలిభాగం తెల్లగా కనబడేదాకా తీయక్కర్లేదు. ఇప్పుడు వాటిని అడ్డంగా లేదా నిలువుగా సన్నం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యంపిండి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలిపాక రెండు చెంచాలు వేడి చేసిన నూనె వేసుకొని మరోసారి కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కొద్దిగా పలుచగా కలుపుకోవాలి. ఈ పిండిలోనే తరిగిపెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆన్‌చేసుకొని కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక్కో అరటికాయ ముక్కకు పిండి అంటుకునే విధంగా తీసి నూనెలో వేసుకోవాలి.
మీడియం మంట మీద వాటిని వేయించుకుని రంగు మారగానే బయటకు తీసుకోవాలి. పెద్ద మంట మీద వేయిస్తే లోపల అరటికాయ వేగదని గుర్తుంచుకోండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
చాట్ లాగా సర్వ్ చేయాలి అనుకుంటే.. ఈ బజ్జీ మధ్యలో గాటు పెట్టాలి. అందులో వేయించిన పల్లీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కారం చల్లుకుని సర్వ్ చేయొచ్చు. దీంతో రుచి మరింత పెరుగుతుంది. శనగపిండితో పాటు బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీ కరకరలాడుతుంది. అలాగే పిండి కలిపేటప్పుడు వేడి నూనె వేయడం వల్ల బజ్జీలు నూనె ఎక్కువగా పీల్చుకోవు. అలాగే అరటికాయ ముక్కల్ని మరీ మందంగా కట్ చేసుకోకండి. సన్నగా ఉంటే తొందరగా ఉడికిపోతాయి. బజ్జీ తింటున్నప్పుడు పచ్చిదనం రుచి తెలీదు.
బోండాలు
కావలసిన పదార్థాలు: అరటికాయలు – రెండు, ఉల్లిపాయలు – రెండు, మైదా – మూడు స్పూన్లు, పసుపు – పావు స్పూను, కారం – రెండు స్పూన్లు, గరం మసాలా – ఒక స్పూను, బ్రెడ్ పౌడర్ – 25 గ్రా., సన్నగా తరిగిన కొత్తిమీర – పావు కప్పు, ఉప్పు – అవసరమైనంత, నూనె వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ముందుగా అరటికాయలను రెండు ముక్కలుగా కట్ చేసి ఆవిరి మీద ఉడికించాలి. ఉడికిన అరటికాయల తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసుకొని, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో బ్రెడ్ పౌడర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పిండిలా చేసుకోవాలి. మరోవైపు మైదా పిండిని కూడా నీళ్లతో కలిపి మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బంతులను బ్రెడ్ పౌడర్‌లో ముంచి, నూనెలో వేయించాలి. బోండాలు నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండుసార్లు వేయించాలి, ఇలా వేయించిన బోండాలను గిన్నెలోకి తీసుకోవాలి. అరటికాయ బోండాలు రెడీ. వీటిని టొమాటో చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
మసాలా వేపుడు
కావలసినవి పదార్థాలు : అరటికాయలు: రెండు, పసుపు: అరస్పూను, నూనె: పావు కప్పు, ఆవాలు: ఒక స్పూను, మినపప్పు: ఒక స్పూను, కరివేపాకు రెబ్బలు – రెండు, ఉప్పు- తగినంత, ఉల్లిపాయ – ఒకటి, మసాలాకోసం : కొబ్బరి తురుము- పావుకప్పు, దనియాలు – రెండు టేబుల్ స్పూన్లు. మిరియాలు – ఒకటిన్నర స్పూను, జీలకర్ర – ఒక స్పూను, ఎండుమిర్చి – నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు.
తయారీ విధానం : అరటికాయల చెక్కు తీసి ముక్కల్లా కోసి నీళ్లల్లో వేసుకోవాలి. మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగాకా ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి కూడా వేగాయనుకున్నాక అరటికాయ ముక్కల్ని వేసి బాగా కలిపి పావుకప్పు నీళ్లు, ముందుగా చేసుకున్న మసాలా, తగినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. అరటికాయముక్కలు ఉడికి నీళ్లన్నీ ఆవిరైపోయాక మిగిలిన నూనె వేసి బాగా వేయించుకుని తీసుకోవాలి.
అరటికాయ ఉల్లికారం
కావలసిన పదార్థాలు : ఆరటికాయలు – రెండు, పసుపు – కొద్దిగా, ఉప్పు- కొద్దిగా, ఉల్లిపాయ తరుగు, అల్లం ముద్ద – ఒక స్పూను, ఆవాలు – ఒక స్పూను, నూనె – నాలుగు స్పూన్లు, పచ్చిమిర్చి – 4, 5, కొత్తిమీర – కొద్దిగా, పచ్చి శెనగపప్పు – ఒక స్పూను, జీలకర్ర – ఒక స్పూను, కరివేపాకు – రెండు రెబ్బలు, మినపప్పు – ఒక స్పూను, నిమ్మరసం – కొద్దిగా, పసుపు – అర స్పూను, ఎండుమిర్చి – నాలుగు.
తయారీ విధానం: మందుగా అరటి కాయలను చిన్నగా కట్ చేసి ఓ చిన్న బౌల్‌లో వేసి ఉప్పు, పసుపు వేసి 80 శాతం ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత అరటి ముక్కల పొట్లును తీసి ముద్దగా చేసుకోవాలి. ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిలను గ్రైడ్ చేసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆ పోపులో ఉల్లి ముద్ద, ఉప్పు, పసుపు, కరివేపాకును వేసి దోరగా వేయించాలి. అవివేగాక అరటి కాయ మిశ్రమాన్ని వేసి 8 నుంచి 9 నిమిషాల పాటు వేపుకోవాలి. నూనె పైకి వచ్చాక అందులో కొత్తిమీరను, మసాల, నిమ్మరసం వేసి దింపుకోవాలి. అంతే ఆరటికాయ ఉల్లికారం రెడీ..
కోఫ్తా కరీ
కావలసిన పదార్థాలు : అరటికాయలు- రెండు, పనీర్ తురుము – అరకప్పు, ఉల్లిపాయ – ఒకటి, శనగపిండి -ఒక స్పూను, అల్లం- పచ్చిమిర్చి ముద్ద – ఒక స్పూను, దనియాలపొడి – అర స్పూను, కొత్తిమీర – ఒక కట్ట, నూనె – వేయించేందుకు సరిపడా, దాల్చినచెక్క – చిన్న ముక్క, యాలకులు – రెండు, ఉల్లిపాయ -ఒకటి, టమాటో – ఒకటి, పసువు – పావు స్పూను, కారం – ఒక స్పూను, జీలకర్ర పొడి – ఒక స్పూను, గరంమసాలా – పావు స్పూను, జీడిపప్పు – పది (పావుగంటముందు నానబెట్టుకుని తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి), క్రీమ్: రెండు స్పూన్లు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం : అరటికాయల్ని ఉడికించుకుని చెక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పనీర్ తురుము, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, దనియాలపొడి, కొత్తిమీర, శనగపిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో బాండీ స్టౌమీద పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి దాల్చినచెక్క యాలుకలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక పసుపు, జీలకర్రపొడి, దనియాలపొడి, కారం, తగినంత ఉప్పు, టొమాటో ముద్ద వేయాలి. అది కూడా ఉడికాక జీడిపప్పు ముద్ద వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. అన్నీ ఉడికి దగ్గరకు అవుతున్నప్పుడు ముందుగా చేసుకున్న అరటి ఉండలు, క్రీమ్ వేసి బాగా కలిపి దింపేయాలి.