రజాకార్లు, నైజాం నవాబు టేకుమట్ల రహదారి నుండి మచిలీపట్నం వెళ్లే సందర్భంలో టేకుమట్ల బ్రిడ్జిని కూలగొట్టి ఆ రజాకారులను మచిలీపట్నం పోకుండా అడ్డుకున్న వారిలో గోపయ్య ముఖ్యుడు. ఆ సందర్భంలోనే రజాకార్లలో ఒకరిని చంపి ఆ తలను బందరులో వేసివచ్చాడు. అందుకే ఆయన్ను సినపంగి గోపయ్యకు బదులు బందరు గోపయ్య అనే పేరొచ్చింది. ఆయుధాలు విడిచిన తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య బందరు కాలువ పూడిక తీయడానికి పిలుపునిస్తే ఆ పిలుపునందుకుని ఆ కాలువ పనిలో పనిచేశాడు ఈ రెండు సందర్భాలు కూడా ఆయన్నిప ఇంటి పేరుని బందరుగా మార్చాయి. ఇప్పటికీ ఈ గ్రామంలో చినపెంగి వారికంటే బందరు అంటే చాలామందికి తెలుసు.
నిజాం పాలనలో తెలంగాణ ప్రజల బాధలు అన్నీఇన్నీ కావు. దొరలు, పటేండ్లు, పట్వారి, మునుసుబు, పోలీసులు సాగించిన దురాగతాలతో అనేక హింసలకు గురయ్యారు. అరాచకం ఎంత పెరిగితే ఉద్యమం కూడా అంతే వేగంగా ముందుకొస్తుంది. దానికి సజీవ సాక్ష్యం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భూమి, భుక్తి, విముక్తి కోసం నిజాంపై సాగించిన ఈ పోరాటం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది. ఈ పోరాటంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన ఈ మహత్తర పోరాటంలో ఎంతోమంది కీలకపాత్ర పోషించారు. అందులో తుపాకి ఎక్కుపెట్టి ముందున్న వ్యక్తి కామ్రేడ్ చినపంగి గోపయ్య ఒకరు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పెన్‌పహడ్ మండలానికి చెందిన ఆయన పోరాటాన్ని స్మరించనివారు లేరు. ఆయన చిన్నతనంలో స్వగ్రామం చేదేళ్లలోని తిరుపతమ్మ గుడిపక్కన ఉన్న తుంబై దగ్గర బ్రిటిష్ వాళ్లు బల వంతంగా టీకాలు వేయిస్తున్న సందర్భంలో వారిని ఎదిరించి వాళ్ల బూటుకాళ్లతో దెబ్బలు తిన్న వ్యక్తి గోపయ్య. అదే సందర్భంలో దొంగల బోను మునగాల మండలం గణపవరం దగ్గర ప్రస్తుతం ఎల్ 37 లిఫ్టు ఉన్న ప్రదేశంలో ఆ దొంగల బోను(అది ఒక అండమాన్ జైలు లాంటిది). ఆ బ్రిటిష్ వాళ్లకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తీసుకువెళ్లి ఆ దొంగల బోనులో వేసి చిత్రహింసలకు గురిచేసేవారు. వెలుజెండా గ్రామానికి చెందిన మేదరమెట్ల సీతారామయ్య అప్పటికే నాయకుడు. సాయుధ పోరాటం బలపడుతున్న తరుణంలో దళంలో పనిచేయడానికి చుట్టు పక్కల గ్రామాల్లో వెతుకుతుండా చేదేళ్లలో గోపయ్యను గుర్తించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నలను, ఇద్దరు తమ్ములను ఒప్పించి చిలుకూరు దగ్గర జరిగిన ఆంధ్ర మహాసభకు తీసుకెళ్లారు. ఆయన ధైర్య సాహసాలు, ఊరిలో బ్రిటీష్‌వారిపై తిరుగుబాటు ఆయనకు పేరు తీసుకొచ్చింది. దీంతో ఆంధ్రమహాసభ అటునుంచి అటే తుపాకి సాధన, కర్రసాము కోసం శిక్షణ ఇప్పించడానికి తీసుకెళ్లగా అందులో ఆరితేరాడు గోపయ్య.
రజాకార్లు, దొరలు, భూస్వాములు, పెత్తందారులు సాగిస్తున్న అరాచకాలు ఎదుర్కొనుటకు దళం ఎక్కడికి పిలిపిస్తే అక్కడికి వెళ్లేవాడు. తుపాకితో ఆయన దాదాపు వంద మంది రజాకారులను కాల్చి చంపినట్టు గ్రామస్తులు చెబుతుండేవారు. అనేక గ్రామాల రక్షణ కోసం బయటికి వెళ్లి చింతలపాలెం, మల్లారెడ్డి గూడెం, నల్లబండగూడెం, వెలిదండ, కోనాయిగూడెం,రంగాపురం,గీతవారి గూడెం, అడ్డూరు, తమ్మారం, చెట్ల ముకుందాపురం, గాజుల మల్కాపురం ఈ గ్రామాలకు రక్షణ దళాలుగా పని చేసిన వ్యక్తి గోపయ్య. మల్లారెడ్డిగూడెంలో రజాకార్లకు -రక్షణ దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్న సమయంలో వారినుంచి గోపయ్య, ఆయనతో పాటు మరో కార్యకర్త తప్పించుకుని ఆ గ్రామం నడిబొడ్డున ఉన్న శాతబావిలో ముండ్లకంపలు, పొదల్లోకి వెళ్లగా, ఇది గమనించిన రజాకార్లు ఆ ముండ్లకంపలపైన కిరోసిన్ పోసి మంట పెట్టి వెళ్లిపోయారు. ఆ మంటలను తట్టుకోవడానికి నీళ్లలోకి దిగి వారికివారే రక్షించుకన్నారు. లేకపోతే ఆ మంటలు కాలిసిపోయేవారు. కీత వారి గూడెం దగ్గర ఒకే దారిన పద్దెనిమిది గుర్రాల మీద వస్తున్న రజాకార్లని ఒకే బాట మీదకు రప్పించి ఆ బాటలో పెద్దపెద్ద గొయ్యిలు తీసి ఆ గొయ్యిల్లో గుర్రాలతో పాటు రజాకారులు పడగా వారిని కాల్చిచంపిన ఘనత గోపయ్యది. రజాకార్లు, నైజాం నవాబు టేకుమట్ల రహదారి నుండి మచిలీపట్నం వెళ్లే సందర్భంలో టేకుమట్ల బ్రిడ్జిని కూలగొట్టి ఆ రజాకారులను మచిలీపట్నం పోకుండా అడ్డుకున్న వారిలో గోపయ్య ముఖ్యుడు. ఆ సందర్భంలోనే రజాకార్లలో ఒకరిని చంపి ఆ తలను బందరులో వేసివచ్చాడు. అందుకే ఆయన్ను సినపంగి గోపయ్యకు బదులు బందరు గోపయ్య అనే పేరొచ్చింది. ఆయుధాలు విడిచిన తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య బందరు కాలువ పూడిక తీయడానికి పిలుపునిస్తే ఆ పిలుపునందుకుని ఆ కాలువ పనిలో పనిచేశాడు ఈ రెండు సందర్భాలు కూడా ఆయన్నిప ఇంటి పేరుని బందరుగా మార్చాయి. ఇప్పటికీ ఈ గ్రామంలో చినపెంగి వారికంటే బందరు అంటే చాలామందికి తెలుసు.
సిరిసిల్ల దగ్గర ధర్మపురంలో భూస్వామి అయిన దొరసాని ఆ గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలను ఇబ్బందులకు పెడుతుండగా దళం పిలిపిస్తే గౌను మట్టయ్య, చిన్నపని గోపయ్య ఇద్దరు ఆ బాధ్యత తీసుకొని అక్కడికి వెళ్లారు. ఆమె ఉండే కోట గదిపై మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించి ఆ గదిలోకి దూరారు. ఆ గదిలో మొత్తం నాలుగు దిక్కులలో నాలుగు పెద్ద కుక్కలు ఉండేవి ఆ కుక్కలు అరుపులకు ప్రజలు భయ పడేవారు ఆ దొరసానిని అంతం చేయాలంటే ముందు ఆ కుక్కలను చంపాలి, లేకపోతే మనం ఆ దొరసాని ఏమి చేయలేమని ఒక రాత్రి గదిలో చొరబడి ఆ నాలుగు కుక్కలను చంపి దళానికి సిగల్ ఇస్తే దళం మొత్తం వచ్చి ఆ కోటను కూల్చింది. సినపంగి గోపయ్యకు ఐదుగురు సంతానం. నలుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఇంతపెద్ద కుటుంబంతో ఉన్న సంసారాన్ని నెట్టుకురావడానికి గోపయ్య చాలా ఇబ్బందులు పడ్డాడు. ఓ వైపు పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు వారిని పోషించుకున్నాడు.
ఆయనకున్న నాలుగెకరాల భూమిని, ఇల్లును దొరలు ధ్వంసం చేయగా బెదరలేదు గోపయ్య. ఆయనతో పాటు తన పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు ఇద్దరు కూడా జైలు జీవితం అనుభవించారు. తనకున్న నాలుగు ఎకరాల భూముల్లో రెండెకరాలు, పది తులాల బంగారం, 20 తులాల వెండిని తనపై, కుటుంబంపై అక్రమంగా మోపబడిన కేసుల కోసం అమ్ముకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాహసగాథలు ఎన్నో ఉన్నాయి. నేటికీ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన కుటుంబం, వారు పడిన బాధలు, చేసిన తిరుగుబాట్లు, రజాకార్లను ముప్పుతిప్పుపెట్టిన ఘటనల గురించి చెప్పుకుంటూనే ఉంటారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆయనకు విప్లవ జేజేలు
– చిన్నపంగి నరసయ్య