– లడక్‌కు రాష్ట్ర హోదా ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్
– వేలాదిమందితో భారీ ప్రదర్శనలు
లడఖ్ : జమ్ముకాశ్మీర్‌లోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరోషెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్, కార్గిల్ జిల్లాల్లో శనివారం వేలాదిమంది ఆందోళనకారులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఆ రెండు జిల్లాల్లోనూ సంపూర్ణంగా బంద్ నిర్వహించా రు. జమ్ముకాశ్మీర్‌కు ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో తలెత్తిన మార్పులను వ్యతిరేకిస్తూ లేహ్ అపెక్స్‌్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కెడిఎ) పిలుపు మేరకు బంద్ నిర్వహించారు. జమ్ము కాశ్మీర్ నుంచి వేరుచేసిన తర్వాత లడఖ్ ప్రజలకు ప్రత్యేక హక్కులు
చేస్తూ సాగుతున్న ఆందోళనలకు ఈ రెండు గ్రూపులు నాయకత్వం వహిస్తున్నాయి. చట్టసభ లేకుండా 2019లో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లడఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడంతోపాటు గిరిజన హోదా కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, , కార్గిల్ జిల్లాలకు చెరొక పార్లమెంట్ సీటు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శనివారం లేఖ్, కార్గిల్ జిల్లాల్లో సంపూర్ణంగా బంద్ జరిగింది. వ్యాపార కార్యకలాపాలన్నీ స్తంభించాయి.
డిమాండ్లను అంగీకరించండి : నేతల పిలుపు
లేహలోని సెంగె నామ్‌గ్యాల్ స్క్వేర్ నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకూ సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ మార్చ్ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో నేతలు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రదర్శకుల నినాదాలు హోరెత్తాయి. మెగసెసె అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ ప్రసంగిస్తూ, లడఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో కలుపుతామని కేంద్ర మంత్రులు హామీలిచ్చారని, ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2020 లేహ్ హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా దాని గురించి మాట్లాడితే వేధిస్తున్నారన్నారు. మైనింగ్ పరిశ్రమ ద్వారా లడక్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను సాధించేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అత్యంత చలిగా వున్నా లెక్క చేయకుండా అన్ని వయసులు, గ్రూపులకు చెందిన వారు ‘లేహ్ చలో’ ప్రదర్శనలో పాల్గొన్నారు. 2019 తరువాత నిర్వహించిన అతి పెద్ద భారీ బహిరంగ సభగా స్థానికులు తెలిపారు.
కార్గిల్ సభలో మాజీ మంత్రి చెరింగ్ డోర్జరు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవించాలని డిమాండ్ చేశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించిందని, భారీ ఎత్తున ప్రజలు సభకు తరలివచ్చారని, ఇప్పటికైనా కేంద్రం దిగి రావాలని అన్నారు. లడఖ్ బిజెపి చీఫ్ పదవికి 2020లో రాజీనామా చేసిన డోర్జరు కేంద్రం తీరును తీవ్రంగా నిరసించారు.