బీఆర్‌ఎస్‌కు బంధుల గోల…

Bandula Gola for BRS...– దళిత, బీసీ, మైనారిటీ బంధుపై బీఆర్‌ఎస్‌ లీడర్ల గోస
– ఊర్లల్ల సమాధానం చెప్పలేకపోతున్నం
– ఇప్పటి మ్యానిఫెస్టోలో వాటిని చేర్చితే బావుండేదంటూ ఆవేదన
– హుజూరాబాద్‌ కోసం ముందే కూసిన ‘దళితబంధు’ కోయిల
బీవీఎన్‌ పద్మరాజు
‘ఆ చుట్టుకునేదేదో కాలుకో.. చేతికో చుట్టుకుంటే.. ఎట్టో గట్ట ఇడిపించుకుంటోళ్లం. అవిప్పుడు ఏకంగా మెడకే చుట్టుకుంటున్నరు.. ఊపిరాడక చస్తున్నాం…’ ఇదీ క్షేత్రస్థాయిలోని బీఆర్‌ఎస్‌ లీడర్ల గోస. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బందులోకి నెట్టేస్తుండటమే వారి గోసకు కారణం. ఈ ఎన్నికల్లో ఓట్లు గుమ్మరిస్తాయనుకున్న ఆయా పథకాలు తమకు ఫలితాలను తెచ్చిపెట్టకపోగా.. ప్రతిబంధకాలుగా మారుతున్నాయంటున్నారు క్షేత్రస్థాయిలోని లీడర్లు. సీఎం కేసీఆర్‌ గత రెండు వారాల నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి సభలు, సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తున్నారు. ఆ క్రమంలో ఆ మీటింగులకు ప్రజలు భారీగానే వస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ, జన సమీకరణ సమయంలో అనేక తలనొప్పులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా దళిత బంధు పథకం అమలైన గ్రామాల్లో లబ్దిదారులు పది మందో, పదిహేను మందో ఉంటే… లబ్దిపొందని వారు వందల్లో ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బీసీ, మైనారిటీ బంధు పథకాల పరిస్థితీ అదే. వాటికోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. ఇప్పుడు జన సమీకరణ కోసం నియోజకవర్గ నేతలు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు… ఈ బాధితులందరూ వారిని నిలేస్తున్నారు. ‘మీ వాళ్లకు, మీకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే స్కీములను ఇచ్చారు. మాకేమైనా ఇచ్చారా..? పోనీ ఎప్పటిలోగా ఇస్తారో చెప్పండి…’ అంటూ ప్రశ్నిస్తుండటంతో నాయకులకు నోట మాట రావటం లేదు. ఇదే విషయాన్ని పలువురు లీడర్లు బీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు వినికిడి. ‘పోయినసారి నిరుద్యోగ భృతి లాగా ఈసారి దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలను ఎన్నికల ప్రణాళికలో చేరిస్తే బాగుండేది. ప్రజలకు కొత్త పథకాలపై కొంచెం ఆశలుండేవి.. మనకు రాజకీయ ప్రయోజనం కలిగేది…కానీ వాటిని ముందే ప్రకటించాం. ఆయా స్కీముల అమల్లో జరిగిన లోపాలు, లొసుగులు, వైఫల్యాలతో ఎలక్షన్లలో మన పరిస్థితి రివర్స్‌ అవుతోంది…’ అని పలు జిల్లాలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్‌ వద్ద వాపోయినట్టు సమాచారం.
వాస్తవానికి దళిత బంధు పథకాన్ని ప్రస్తుత శాసనసభ ఎన్నికల కోసమే కేసీఆర్‌ రూపొందించారని సమాచారం. దాన్ని ఇప్పటి మ్యానిఫెస్టోలో కూడా పొందుపరచాలని ఆయన భావించారు. కానీ అనుకోకుండా మధ్యలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రావటంతో సీఎం వ్యూహం మార్చారు. ఆ ఎన్నిక తమ పార్టీకి ప్రతిష్టాత్మకం కావటం, అందునా హుజూరాబాద్‌లో ఎస్సీల ఓట్లు క్రియాశీలకంగా మారటంతో ఇప్పటి కోసం దాచిన ‘దళిత బంధు’ అస్త్రాన్ని కేసీఆర్‌ అప్పుడే వదిలారు.
తద్వారా ఈటల రాజేందర్‌ను ఓడించొచ్చని భావించి, అందులో విఫలమయ్యారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును విస్తరిస్తున్నామంటూ ప్రకటించారు. అదే పరంపరలో బీసీ, మైనారిటీ బంధు పథకాలను ప్రవేశపెట్టారు. అయితే అవి ప్రచారంలో అధికార పార్టీకి లబ్ది చేకూర్చడం మాటేమోగానీ ప్రశ్నలై నిలదీస్తున్నాయి.