బెంగళూర్‌ కేంద్రంగా నగరానికి డ్రగ్స్‌ సరఫరా

– ఆరు నెలల్లో రూ.4కోట్ల లావాదేవీలు
– నిందితుల కోసం నెలరోజులు బెంగళూరులోనే పోలీసుల మకాం
– ముగ్గురు నైజీరియన్లతోపాటు కొనుగోలుదారుని అరెస్ట్‌
– కోటి విలువగల డ్రగ్స్‌, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ ముఠాతోపాటు డ్రగ్స్‌ కొనుగోలుదారున్ని నార్కోటెక్‌, బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 100గ్రాముల కొకైన్‌, 300గ్రాముల ఎండీఎంఏతో పాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోటి రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సీవీ ఆనంద్‌ వివరాలు తెలిపారు.
నైజీరియాకు చెందిన అగ్‌ బో మ్యాక్స్‌వెల్‌, చిగోలు 2011లో మెడికల్‌ వీసాపై ముంబయికి వచ్చారు. ఇకెం ఆస్టిన్‌ ఒబాక స్టూడెంట్‌ వీసాపై వచ్చాడు. అనంతరం తమిళనాడులో కొన్నాళ్లున్న ముగ్గురు నైజీరియన్లు డ్రగ్స్‌ సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే, పోలీసుల నిఘా అధికం కావడంతో బెంగళూరుకు మకాం మార్చారు. కాలేజీ, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాకు చెందిన సంజరు, భాను తేజా రెడ్డిని కొద్దిరోజుల కిందట నార్కోటెక్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించడంతో బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్టు పక్కా సమాచారం అందడంతో పోలీసులు నెల రోజులపాటు అక్కడే మకాం వేశారు. బెంగళూరులో నైజిరీయన్ల కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఆరు నెలల్లో దాదాపు రూ.4 కోట్ల లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ముగ్గురు నైజీరియన్లతోపాటు నగరానికి చెందిన డ్రగ్స్‌ వినియోగదారులు సాయి అకేష్‌ను అరెస్టు చేశారు. మరో నైజిరీయన్‌ పరారీలో ఉన్నాడు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, డీసీపీలు సునితారెడ్డి, ఏసీపీ, సీఐ, ఎస్‌ఐ తదితరులున్నారు.