‘బంగ్లా’ జ్వాల!

'బంగ్లా' జ్వాల!పచ్చి నిరంకుశ, అవినీతికర పాలనకు బంగ్లాదేశ్‌ విద్యార్థులు చరమగీతం పాడారు. జనం ఎగురవేసిన తిరుగుబాటు బావుటా షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఒకప్పుడు లక్షలాది మంది ఆహ్వానంతో దేశంలో అడుగుపెట్టిన హసీనా..ప్రజాగ్రహానికి జడిసి… హడావిడిగా దేశం విడిచిపెట్టాల్సి రావడం స్వయంకృతం. సర్కారు అణచివేతలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విచారకరం.
పదహారేండ్లపాటు హసీనా ఏలుబడి అప్రతిహతంగా సాగింది. బంగ్లాదేశ్‌ జాతిపిత ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తెగా, తండ్రిని, తన కుటుంబాన్ని సైనిక కుట్రలో కోల్పోయిన ఆమె పచ్చి నిరంకుశవాదిగా తయారవడం విచిత్రం. బంగ్లా విమోచన సందర్భంలో పాక్‌ అనుకూల మత ఛాందసవాదులు, వారి మద్దతుదారుల మారణకాండలో దాదాపు 30 లక్షల మంది పౌరులు బలయ్యారు. 1975లో అప్పటి అధ్యక్షుడైన తన తండ్రి హత్య సమయంలో సమయంలో జర్మనీలో ఉండి, ప్రాణాలతో బయటపడిన హసీనా ఆరేండ్లపాటు భారతదేశంలో ఆశ్రయం పొందారు. 1981లో సొంత గడ్డపై అడుగుపెట్టిన ఆమె అనేక ఆటుపోట్లతోపాటు పందొమ్మిదిసార్లు హత్యాయత్నాలను సైతం ఎదుర్కొన్నారు. ఆమె హయాంలో ఆ దేశం ఆర్థికంగా ఎదిగింది. మనదేశానికి మిత్రదేశంగా ఉంటూ..పలు అభివృద్ధి పనులు చేపట్టారు. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) చీఫ్‌ ఖలీదా జియా అధికారంలో ఉన్నప్పుడు ఈశాన్య భారతంలో పాక్‌ అనుకూల గ్రూపులు విధ్వంసానికి పాల్పడగా, హసీనా వాటికి అడ్డుకట్ట వేశారు. మిలటరీ నియంత, ఖలీదా జియా భర్త జియావుర్‌ రహమాన్‌ ఏలుబడిలో ముస్లిం ఛాందస వాదులను ప్రోత్సహించి, ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు ప్రయత్నించగా, అందుకు భిన్నంగా హసీనా లౌకిక మార్గాన్ని ఎంచుకుని భారత్‌, చైనాలతో సత్సంబంధాలు కొనసాగించారు.
నయా ఉదారవాద విధానాల అమలుకు పోటీపడటంతో అవినీతి పెచ్చుమీరింది. బ్యాంకులకు ఎగవేతలు, కుంభకోణాలు సర్వసాధారణ మయ్యాయి. ఆర్థిక అసమానతలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం తీవ్రరూపం దాల్చింది. ద్రవ్యోల్బణం పదిశాతానికి ఎగబాకింది. సామాన్యుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను, మీడియాను, ప్రతిపక్షాలను అణచివేశారు. సర్వాధికారాలు గుప్పెట్లో పెట్టుకుని, కోర్టులు సైతం నోరుమెదపకుండా చేశారు. పోలీసులు, సైన్యంలో అవినీతి పెచ్చుమీరింది. కిందిస్థాయిలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు. ఈ పరిణామాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అవామీలీగ్‌ అధికార పగ్గాలు చేపట్టినా పోలింగ్‌ 41శాతమే నమోదైంది. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. పది వేల మంది వరకూ ప్రతిపక్ష కార్యకర్తలు జైలులోకి నెట్టబడ్డారు. ప్రతిపక్ష నేత ఖలీదా జియా 17 ఏండ్లుగా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బంగ్లా విమోచన యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో యూనివర్శిటీల్లో గత జూన్‌లో ఆందోళనలు పెల్లుబికాయి. సుప్రీంకోర్టు దాన్ని ఐదు శాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడుశాతానికి పరిమితం చేసినా..నిరసన జ్వాలలు చల్లారలేదు. చిట్టచివరికి.. హసీనా రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని, జాతినుద్ధేశించి టీవీలో మాట్లాడకూడదని సైన్యం ఆదేశించినట్లు వార్తలొచ్చాయి.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆమె భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. భారత విదేశాంగ మంత్రి చెప్పినట్లు బంగ్లాదేశ్‌లో ఉన్న పది వేల మంది భారత విద్యార్థుల భద్రత దృష్ట్యా అక్కడి సైన్యంతో సంప్రదింపులు జరిపి, భద్రంగా తీసుకురావడం కేంద్రం కర్తవ్యం. ప్రజల మనోభావాలను గుర్తించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తే.. ఎంతటి నేతలకైనా.. ఎలాంటి దురవస్థ పడుతుందనే దానికి గత మూడు రోజుల బంగ్లాదేశ్‌ పరిణామాలు నిదర్శనం. శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించేందుకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు కృషి చేయాలి. బాహ్య శక్తుల మద్దతుతో లబ్ధిపొందాలనుకునే మితవాద, ఛాందసవాద శక్తులకు అడుకట్ట వేయాలి. దేశం మళ్లీ సైన్యం గుప్పెట్లోకి పోకుండా ప్రజాతంత్ర శక్తులు తగు జాగ్రత్త వహించాలి. ఇది ఆ దేశ భవిష్యత్‌.. అక్కడి ప్రజలతోపాటు పొరుగున ఉన్న మన దేశానికి కూడా ప్రధానమే.