బంగ్లాదేశ్‌ విప్లవం: లౌకికవాదంలో ఒక ఆశ్చర్యకర పాఠం

The Bangladesh Revolution: A Surprising Lesson in Secularismబంగ్లాదేశ్‌లో వేల సంఖ్యలో హిందువులు రక్షణను డిమాండ్‌ చేస్తూ వివిధ పట్టణాలు, నగరాలలో నిరసన తెలియజేస్తున్నారు. వారి వెంట ముస్లింలు పెద్ద సంఖ్యలో నిలబడి ఉంటున్నారు. ఈ నిరసనలలో హిందువులు మతపరమైన నినాదాలు చేస్తున్నారు. వీరికి తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు మద్దతుగా ఉంటున్నారు. హిందువులు, బంగ్లాదేశ్‌ను అపకీర్తి పాల్జేయడానికి భారతదేశానికి, లేక అంతర్జాతీయ కుట్రలో సాధనాలుగా ఉంటున్నారని, సరిహద్దుకు అవతల్నుండి వారిని రెచ్చగొడుతున్నారనీ, వారు దేశ వ్యతిరేకులని పేర్కొనడం ద్వారా ఏ ఒక్కరూ ఈ నిరసనకారులపై దాడి చేయడం లేదు. ాము బంగ్లాదేశీయులమనీ, ఏ ఒక్కరూ తమను తరిమిమేయలేరని బంగ్లాదేశ్‌ హిందువులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. మైనార్టీ హక్కులకు సంబంధించి వారు ప్రత్యేకమైన సౌకర్యాలను డిమాండ్‌ చేస్తున్నారు. దుర్గాపూజ సందర్భంగా కోరుతున్న ఐదు రోజుల సెలవు వారి డిమాండ్లలో ఒకటిగా ఉంది. ఒకవేళ వారు వారి ప్రాణాలు, ఆస్తుల గురించి నిజంగా ఆందోళన చెందితే ఈ ఐదు రోజుల సెలవు డిమాండ్‌ అనేది వారి మనసులో ఉన్న డిమాండ్‌ కాదు. బంగ్లాదేశ్‌ తమ స్వంత ఇల్లు అనీ, తాము ఉత్సవాలు జరుపుకునే ప్రాంతమనే విషయం వారికి తెలుసు అని ఈ డిమాండ్‌ అర్థం.
ఏ ముస్లిం మత సంస్థ కూడా వీటికి వ్యతిరేకంగా ఎలాంటి సమీకరణలు చేయడం లేదు. పాలక పక్షానికి చెందిన ఏ నాయకుడు కూడా దేశద్రోహులను కాల్చి చంపాలని ప్రజల్ని కోరడం లేదు. అంతేకాక దీనికి విరుద్ధంగా విద్యార్థులు, ఇతర ముస్లింలు దేవాలయాలకు రక్షణగా ఉంటూ, హిందూ ప్రజల నివాస ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. మత విరోధుల హానికరమైన దుశ్చర్యలు, హింసకు వ్యతిరేకంగా అక్కడ అప్రమత్తత కనపడుతుంది.ముస్లిం మత పెద్దలు దేవాలయాలను సందర్శిస్తూ, వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. వారు హిందువులకు అండగా ఉంటున్నామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
ఢాకాలో విద్యార్థులు పార్లమెంటును శుభ్రం చేస్తున్నారు. వారే రోడ్ల కూడలిలో వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. ఆగస్ట్‌ 5న జరిగిన గందరగోళంలో లూటీ అయిన వస్తువులన్నీ నెమ్మదిగా తిరిగి వస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ అధినేత ఒక ప్రముఖ దేవాలయాన్ని సందర్శించి హిందువులకు తన సంఘీభావాన్ని ప్రకటించడాన్ని మేము చూశాం. వారి హోంశాఖ సలహాదారు హిందువులకు వ్యతిరేకంగా జరిగే హింసకు వ్యతిరేకంగా చాలా నిర్దిష్టమైన వైఖరిని తీసుకున్నాడు.
ప్రజాస్వామిక విప్లవం
ఈ పరిణామాల గురించి భారతదేశ ప్రజలకు తెలియజేసేందుకు ఎవ్వరికీ ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. తమ దేశంలో ప్రజాస్వామిక విప్లవానికి వ్యతిరేకంగా ద్వేషభావాన్ని వ్యాప్తి చేస్తున్న భారతదేశ అధికార పార్టీతో సంబంధాలున్న వ్య్తుల్ని చూసి బంగ్లాదేశ్‌ ప్రజలు నిరాశ చెందుతున్నారు. విప్లవం కారణంగా బంగ్లాదేశ్‌లో సష్టించబడిన గందరగోళం, హింసను వ్యతిరేకించే పేరుతో అలాంటి వ్యక్తులు వారి సొంతదేశంలోనే ముస్లింలపై దాడులు చేయడం, వారి పాకలను ధ్వంసం చేయడం, వారిని కొట్టడం లాంటి చర్యల్ని కూడా వారు చూస్తున్నారు. ఇది ప్రజాస్వామిక విప్లవం కాదు, ఇది భారతదేశ వ్యతిరేక, హిందూ మత వ్యతిరేక కుట్ర అని రుజువు చేయాలని భారతదేశ అధికార పార్టీ అనుకుంటున్నట్టు విద్యార్థులు, ఇతరులు గమనిస్తున్నారు. బంగ్లాదేశ్‌ ప్రజల ప్రజా స్వామిక ఆకాంక్షలను భారతదేశ ప్రభుత్వం స్వాగతించకపోవడం దురదష్టకరమని బంగ్లాదేశ్‌లో పండితులు అంటున్నారు. అయితే తనతో సన్నిహిత సంబంధాలు గల నిరంకుశ నాయకురాలి పతనం పట్ల భారత్‌ కలత చెందుతున్నట్లు కనపడుతుందని కూడా వారు చెబుతున్నారు.
బంగ్లాదేశ్‌లో జాతి సంహారానికి హిందువులు బాధితులు అవుతున్నారని భారతదేశంలో నకిలీ వీడియోలు చేస్తున్న ప్రచా రాన్ని కూడా బంగ్లాదేశ్‌ ప్రజలు గమనిస్తున్నారు. చాలా వీడియోలు నకిలీవి, అయినప్పటికీ వాటిని విచక్షణారహితంగా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామిక విప్లవాన్ని స్వాగతించడంకంటే కూడా బంగ్లాదేశ్‌లో హిందువుల, మైనారిటీల రక్షణ పైనే భారత మొదటి అధికారిక ప్రతిస్పందన ఎక్కువ దష్టిని కేంద్రీకరించినట్టు కనపించిందని బంగ్లాదేశ్‌ ప్రజలు గుర్తించారు. బంగ్లాదేశ్‌ లోని భారతీయుల, ముఖ్యంగా హిందూ భారతీయుల రక్షణను చూసేందుకు భారతదేశం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు బంగ్లాదేశ్‌ వార్తాపత్రికలు గుర్తించాయి. బంగ్లాదేశ్‌ హిందువుల రక్షణ కోసం పారామిలిటరీ బలగాలతో కమిటీని ఏర్పాటు చేయడమంటే పొరుగు దేశ అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నట్లు కనపడుతోంది. ఈ కమిటీ ఎలా పని చేస్తుందో ఎవరైనా వివరించగలరా?
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, ఇతరులు హిందువుల్ని, మైనారిటీలను రక్షిస్తున్నారని భారత విదేశాంగ మంత్రి కూడా పార్లమెంట్‌లో ప్రకటన చేశాడు. అలాంటప్పుడు భారతదేశంలో ప్రజాస్వామిక విప్లవానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారాన్ని ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు? బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దానిని సనాతన ధర్మంపై దాడిగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేర్కొన్నాడు. భారత ప్రభుత్వం చెప్పినట్లు, బంగ్లాదేశ్‌ ప్రజలు, మైనార్టీలకు, హిందువులకు అండగా ఉన్నప్పుడు, భారతదేశంలో ఈ గావుకేకలు ఎందుకు? బంగ్లాదేశ్‌ విప్లవంలో హిందువులకు వ్యతిరేకంగా హింస అనేది అత్యంత గుర్తించదగిన అంశమా? అదే విప్లవాన్ని నిర్వ చిస్తుందా? అనేది పరిశీలించాలి. అది కాకపోతే, ప్రతిస్పందనలను సరిచేయాల్సి ఉంటుంది. లేదా ఇది, వాస్తవంతో నిమిత్తం లేకుండ హిందువుల్లో అభద్రతను సష్టించడానికి కొన్ని వర్గాలవారు కపటోపాయాన్ని ఉపయోగించే హక్కును కలిగి ఉన్నారనే వాదనా?
మతపరమైన అంశాలు
షేక్‌ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన తరువాత బంగ్లాదేశ్‌లో అరాచకత్వాన్ని సష్టించిన మాట వాస్తవం. అనేక ప్రాంతాల్లో గూండాలు వీధుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచ్చలవిడిగా లూటీలు, దహనాలతో పాటు ప్రతిచోట హింసకు పాల్పడ్డారు. గత పాలక పార్టీ అయిన ఆవామీ లీగ్‌ కార్యకర్తలు, దాని అనుబంధ సంస్థల సభ్యులపైన దాడులతో పాటు దేవాలయాలపై కూడా దాడి చేశారు. హిందువుల ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు.
అయితే, విస్తరించబడిన ఆరెస్సెస్‌ శక్తుల వలె బంగ్లాదేశ్‌లో కూడా మతతత్వ శక్తులున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1947లో కొనసాగుతున్న గందరగోళాన్ని అవకాశంగా తీసుకొని ఆరెస్సెస్‌, భారతదేశంలో ముస్లింలు పారిపోయే పరిస్థితిని సష్టిం చే ప్రయత్నం చేసిన విషయాన్ని మర్చిపోకూడదు. స్థిరమైన మనసు, లౌకిక శక్తుల అప్రమత్తత కారణంగా అది పూర్తిగా విజయవంతం కాలేదు. అన్ని సమయాల్లో ప్రతి సమాజంలో, దేశంలో పెద్ద లక్ష్యంగా పిలువబడే ముసుగులో అల్పమైన, సంకుచితమైన ”జాతీయవాద” లక్ష్యాలను సాధించేందుకు కుట్రలుపన్నే శక్తులు ఉంటాయి. ఇది బంగ్లాదేశ్‌లో కూడా జరుగ వచ్చు. రాజ్యం అదశ్యమైనపుడు ఇస్లామిక్‌ వాదులు చురుకుగా మారవచ్చు, తీవ్రవాద శక్తులు రంగం పైకి రావచ్చు.
లౌకిక ప్రజల ఐక్యత అవసరం
అడగవలసిన అసలు ప్రశ్న ఏమంటే: ప్రభుత్వ వైఖరి ఏమిటి? ప్రజాస్వామిక విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ప్రజల వైఖరి ఏమిటి? బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు, అందరు మం్రులు, విద్యార్థి నాయకులు ఏకపక్ష హింసకు వ్యతిరేకంగా చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఈ విప్లవం ప్రతిఒక్కరి కోసం, దేశంలో ముస్లింలకు, హిందువులకు సమాన హక్కులుంటాయని వారు స్థిరంగా ధఢ నిశ్చయంతో చెపుతున్నారు. నిరసనలు తెలియజేస్తున్న హిందువులకు వ్యతిరేకంగా ద్వేషభావాన్ని వ్యాప్తి చేసే స్వరాలు, ప్రభావశీలురు ప్రభుత్వం నుండి ఎవరూ లేరు. ఈ సమయంలో నిరసనలు వ్యక్తం చేయడం ద్వారా వారు ప్రజాస్వామిక విప్ల వాన్ని బలహీనపరుస్తూ, దానిని అపకీర్తిపాలు చేస్తున్నారని ఏ ఒక్కరూ అంటుండగా మేము వినలేదు. వారిని ఎవరూ దేశ వ్యతిరేకులని పిలవడం లేదు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహమ్మద్‌ యూనస్‌ మాట్లాడిన విధంగా భారత్‌ పాలకపార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా మతతత్వ హింసకు వ్యతిరేకంగా ఇంతవరకు మాట్లాడలేదు. దారుణమైన విషయం ఏమంటే, భారతదేశంలోని ముస్లింలపై దాడి చేయడానికి ఇక్కడి మతతత్వ శక్తులు, బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలను నెపంగా ఉపయోగించుకుంటున్నాయి. బహిర్గత మవుతున్న జగడం ఒక విషయాన్ని రుజువు చేస్తే, దక్షిణ ఆసియాలో మొత్తంగా లౌకికవాదుల ఐక్యత అవసరమవుతుంది. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామిక విప్లవం ఒక అవకాశాన్ని సష్టిం చింది. మొత్తంగా ఈ ప్రాంతంలో ఒక నూతన ప్రజాస్వామిక పథక రూపకల్పనకు ఢాకాలోనే ఒక దక్షిణాసియా సదస్సును నిర్వహించడం ఉత్తమమైన పని. ఇందుకు ”దక్షిణాసియా ప్రజాస్వామిక, లౌకికవాదులారా ఐక్యం కండి” అనే నినాదం ఎంతో అవసరం.
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)
(వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్‌)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
– ఆపూర్వానంద్‌