శ్రీలంకపై బంగ్లా గెలుపు

Bangladesh win over Sri Lanka– ఛేదనలో నజ్ముల్‌, షకిబ్‌ దూకుడు
–  శ్రీలంక 279/10, బంగ్లాదేశ్‌ 282/7
న్యూఢిల్లీ : ఐసీసీ ప్రపంచ కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్‌ ఊరట విజయం సాధించింది. సెమీ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమిం చిన ఈ రెండు జట్లు ఐసీసీ 2025 చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించేందుకు పోటీపడుతున్నాయి. సోమ వారం న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొం దింది. 280 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ఏడు వికెట్లు కోల్పోయి 41.1 ఓవర్లలో ఛేదించింది. నజ్ముల్‌ హుసేన్‌ షాంటో (90, 101 బంతుల్లో 12 ఫోర్లు), షకిబ్‌ అల్‌ హసన్‌ (82, 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో బంగ్లాదేశ్‌ విజయాన్ని ఖరారు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. చరిత్‌ అసలంక (108, 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో శ్రీలంకకు మెరుగైన స్కోరు అందించాడు. ఛేదనలో బంగ్లాదేశ్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు హసన్‌ (9), లిటన్‌ దాస్‌ (23) 6.2 ఓవర్లకే పెవిలియన్‌కు చేరారు. ఈ స్థితిలో జతకట్టిన నజ్ముల్‌ (90), షకిబ్‌ (82) మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. నజ్ముల్‌ 58 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ సెంచరీ సాధించగా.. కెప్టెన్‌ షకిబ్‌ దూకుడు చూపించాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరినీ వెనక్కి పంపిన మాథ్యూస్‌ లంక శిబిరంలో ఆశలు రేపినా.. మహ్మదుల్లా (22), ముష్ఫీకర్‌ (10), హృదరు (15) లాంఛనం ముగించారు. మరో 53 బంతులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక బౌలర్లలో మధుశంక (3/69), తీక్షణ (2/44), మాథ్యూస్‌ (2/35) రాణించారు. గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌కు ఇది రెండో విజయం కాగా.. శ్రీలంకకు ఆరో ఓటమి.
Bangladesh win over Sri Lankaమాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్‌ ఎంజెలో మాథ్యూస్‌ ఊహించని రీతిలో అవుటయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 24.2 ఓవర్లో సదీర సమరవిక్రమ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. హెల్మెట్‌ను కాస్త బిగించి కట్టుకునే సమయంలో ఆ స్ట్రిప్‌ తెగిపోయింది. దీంతో మరో హెల్మెట్‌ కావాలని డ్రెస్సింగ్‌రూమ్‌కు సైగలు చేయగా.. చామిక కరుణరత్నె హెల్మెట్‌తో గ్రౌండ్లోకి వచ్చాడు. ఈ ప్రక్రియకు మూడు నిమిషాల 20 సెకండ్ల సమయం పట్టింది. దీంతో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌, ఆ ఓవర్‌ బౌలర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ టైమ్డ్‌ అవుట్‌ కోసం అంపైర్‌ మరియస్‌ ఎరాస్మస్‌కు అప్పీల్‌ చేశాడు. దీంతో మాథ్యూస్‌ను టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించిన ఎరాస్మస్‌.. శ్రీలంక శిబిరంలో, అభిమానుల్లో కలవరానికి తెరతీశాడు. తొలుత అంపైర్‌ నిర్ణయాన్ని నమ్మలేకపోయిన మాథ్యూస్‌ ఫీల్డ్‌ అంపైర్లతో, ఆ తర్వా బంగ్లా కెప్టెన్‌తో మాట్లాడాడు. హెల్మెట్‌ కారణంగా ఆలస్యమైందని, అప్పీల్‌ను వెనక్కి తీసుకోమని షకిబ్‌ను కోరాడు. కానీ షకిబ్‌ అల్‌ హసన్‌ అందుకు నిరాకరించాడు. దీంతో క్రికెట్‌ చరిత్రలో టైమ్డ్‌ అవుట్‌గా నిష్క్రమించిన తొలి ఆటగాడిగా మాథ్యూస్‌ నిలిచాడు.
ఐసీసీ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. రూల్‌ 40.1.1 ప్రకారం.. వికెట్‌ పడిన తర్వాత 120 సెకండ్ల లోపు నూతన బ్యాటర్‌ క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కొవాలి. లేదంటే టైమ్డ్‌ అవుట్‌గా కొత్త బ్యాటర్‌ నిష్క్రమించాల్సి ఉంటుంది’. షకిబ్‌ క్రీడా స్ఫూర్తిని సమాధి చేశాడంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా.. నిబంధనల ప్రకారమే నడుచుకున్నాడని బంగ్లా శిబిరం సమర్థిస్తోంది.