దొంగిలించిన వేలిముద్రలతో… బ్యాంక్‌లో సొమ్ము ఖాళీ

దొంగిలించిన వేలిముద్రలతో... బ్యాంక్‌లో సొమ్ము ఖాళీన్యూఢిల్లీ : ఆధార్‌…ఇప్పుడు దేశంలో అన్నింటికీ అదే ఆధారమవుతోంది. అయితే ప్రజల బయోమెట్రిక్‌ వివరాలను దొంగిలించి, వాటిని దుర్వినియోగం చేస్తూ ఆధార్‌ చెల్లింపుల వ్యవస్థ ద్వారా సొమ్మును స్వాహా చేస్తున్న ఘనాపాటీలు చాలా మందే ఉన్నారు. ఆధార్‌ నెంబరు, బయోమెట్రిక్‌ సమాచారం తెలిస్తే చాలు… సంబంధిత వ్యక్తి బ్యాంక్‌ ఖాతాను క్షణాల్లో ఖాళీ చేయొచ్చు. ఒకవేళ బాధితుడు తన వివరాలు ఎవరితోనూ పంచుకోకపోయినప్పటికీ ఏ ఆస్తికి సంబంధించిన పత్రాల నుండి అయినా అతని వేలిముద్రలను హ్యాక్‌ చేయడం లేదా క్లోనింగ్‌ చేయడం ద్వారా మోసానికి పాల్పడవచ్చు. బ్యాంక్‌ ఖాతాల నుండి తమ ప్రమేయం లేకుండానే సొమ్ము మాయమవుతోందంటూ పలువురు ఖాతాదారులు బ్యాంక్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. దీంతో బ్యాంకులు తమ ఖాతాదారులకు హెచ్చరిక సందేశాలు పంపుతున్నాయి. ఆధార్‌ వెబ్‌సైట్‌లో బయోమెట్రిక్‌ను ‘లాక్‌’ చేసుకోవాలని సూచిస్తున్నాయి. క్లోనింగ్‌, మోసంతో సేకరించిన వేలిముద్రల ద్వారానే ఎక్కువ కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయి. దొంగిలించిన వేలిముద్రలను ముందుగా సిలికాన్‌ను ఉపయోగించి కాపీ చేస్తారు. ఆ తర్వాత ఆధార్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు వాటిని ఉపయోగిస్తారు. అంతే…బ్యాంక్‌ ఖాతాల నుండి నగదు దారి మళ్లుతుంది. ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో ల్యాండ్‌ రెవెన్యూ పత్రాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటిలో తప్పనిసరిగా భూ లావాదేవీలు జరిపే వారి వేలిముద్రలు కన్పిస్తాయి. మోసగాళ్లు ఆ పత్రాల నుండి వేలిముద్రలను దొంగిలిస్తారు. పత్రాల నుండి చర్మం రంగులో ఉండే వేలిముద్రలను క్లోన్‌ చేసేందుకు సిలికాన్‌ ఆధారిత జిగురును వాడతారు. ప్రైవేటు సంస్థల వద్ద ఉండే స్కానింగ్‌ పరికరాలు సున్నితమైనవి కావు. దీంతో మోసగాళ్లు వీటిని ఉపయోగించి నకిలీ వేలిముద్రలను రూపొందిస్తున్నారు. బయోమెట్రిక్‌ను లాక్‌ చేయడం కొంతవరకూ మాత్రమే రక్షణ కల్పిస్తుందని సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఆధార్‌ను బ్యాంక్‌ ఖాతాలు, పాన్‌కార్డులు, ఫోన్‌ నెంబర్లు, ఓటర్‌ ఐడీలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లనే అనేక సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలిపారు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి అవుతోంది. దీంతో ప్రజలు విధి లేని పరిస్థితుల్లో దీని పైనే ఆధారపడుతున్నారు.