భారంగా బ్యాంక్‌ల వడ్డీ రేట్లు

Bank interest rates are heavy– తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి : ఎస్‌బీఐ కాన్‌క్లేవ్‌లో మంత్రి సీతారామన్‌
ముంబయి : ప్రస్తుతం బ్యాంక్‌ల వడ్డీ రేట్లు రుణ గ్రహీతలపై భారంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్న వేళ మరింత సరసమైన రేట్లు అవసరమని పేర్కొన్నారు. సోమవారం ముంబయిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బిజినెస్‌ అండ్‌ ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌లో మంత్రి మాట్లాడుతూ.. అధిక వడ్డీ రేట్లు ఎంత ఒత్తిడితో కూడుకున్నవని.. తగ్గించడానికి బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు అభివృద్థి, సామర్థ్యాలు పెంచుకోవాలని భావిస్తున్న వేళ వడ్డీ రేట్లు సరసమైనవిగా ఉండాలన్నారు. దేశీయ, ప్రపంచ సవాళ్ళను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. మితిమీరిన ఆందోళన పడాల్సిందేమీ లేదన్నారు. సరఫరా, డిమాండ్‌లో నెలకొన్న అస్థిరత వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు. బ్యాంక్‌లు తప్పుడు ఉత్పత్తులను విక్రయించరాదని.. వాటి కట్టడిపై దృష్టి సారించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అనైతిక పద్ధతులను ప్రోత్సహించకుండా ఉండటానికి సిబ్బంది ప్రోత్సాహకాలను జాగ్రత్తగా రూపొందించాలన్నారు.
ఎస్‌బీఐ నుంచి మరో 500 శాఖలు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వచ్చే మార్చి ముగింపు నాటికి మరో 500 శాఖలను ఏర్పాటు చేయనుందని మంత్రి సీతారామన్‌ అన్నారు. ఎస్‌బీఐ 100వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి .. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఐబీఐగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని 1955లో ఎస్‌బీఐ మార్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 22,500 శాఖలను కలిగి ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 23వేలుకు చేర్చనున్నట్లు తెలిపారు. 1921లో ఎస్‌బీఐ కేవలం 250 శాఖలను మాత్రమే కలిగి ఉంది. ప్రస్తుతం ఆ సంఖ్య 90 రెట్లు పెరిగింది. దేశంలో 65,000 పైగా ఎటీఎం కేంద్రాలను కలిగి ఉంది. 50 కోట్ల పైగా ఖాతాదారులు కలిగిన ఎస్‌బీఐ దేశ మొత్తం డిపాజిట్లలో 22.4 శాతం వాటాను కలిగి ఉంది.