
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మహిళా సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను నిర్ణీత వాయిదాల మేరకు సకాలంలో చెల్లించాలని ఐకెపి ఎపియం కుంట గంగాధర్, కోనా సమందర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని కోనసముందర్ లో నిర్వహించిన బ్యాంకు రికవరీ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కొన సముందర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలో ఇనాయత్ నగర్, నర్సాపూర్, కోనాసమందర్ గ్రామాల మహిళా సంఘాలు రుణాలు తీసుకొని సరైన రీతిలో చెల్లింపులు చేస్తున్నాయని, అయితే అక్కడక్కడ ఒకటి రెండు సంఘాలు బకాయి పాయడం విచారకరమని బ్యాంకు మేనేజర్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రికవరికి దేశవ్యాప్తంగా తెలంగాణ మహిళా సంఘాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అయితే ఒకటి రెండు సంఘాలు కూడా బకాయి ఉండరాదని, పార్టీ సంఘాలు కూడా సకాలంలో తమ బకాయిలను చెల్లించాలని కోరారు.అర్హత ఉన్న ఒక్క మహిళ సంఘానికి రూ.20 లక్షల వరకు రుణం అందించడం జరుగుతుందని, ఇంకా రుణం కావాల్సినవారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళా సంఘాలు, బ్యాంకు అధికారులకు ప్రతినెల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో సంఘాలకు రావాల్సిన రుణాలతోపాటు చెల్లింపులు తీరును కూడా పరిశీలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బ్యాంకు, మహిళా సమాఖ్య పాలకవర్గం సభ్యుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించిందన్నారు. అందులో భాగంగానే ఈనాటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీఎం పేర్కొన్నారు. బ్యాంకు పరిధిలో రెండు, మూడు సంఘాలు మాత్రమే బకాయిలో ఉన్నాయన్నారు. అయితే వీరిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరింత బకాయిలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మహిళా సంఘ పాలకవర్గంతో పాటు సిబ్బందిపై ఉందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీ, రుణ బీమా వంటి అన్ని రకాల సౌకర్యాలను అందుకోవాలని, అందుకు ఏ ఒక్కరు కూడా బకాయి లేకుండా సకాలంలో చెల్లించాలని ఏపీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో కొనసముందర్ క్లస్టర్ సిసి వర్ణం శ్రీనివాస్, గ్రామ సమాఖ్య పాలకవర్గ సభ్యులు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.