మూడు రోజుల పోలీస్ కస్టడీకి బ్యాంక్ మేనేజర్ 

Bank manager to three-day police custodyనవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఖాతాదారులతో పాటు బ్యాంకును మోసగించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్ ను 3 రోజులు పోలీసు కస్టడీకి జిల్లా కోర్టు అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు అజయ్ ను జైలు నుంచి తమ కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. పెద్దబజార్ బ్రాంచ్లో పనిచేస్తున్న సమయంలో మేనేజర్ అజయ్ పలువురు ఖాతాదారులను నమ్మించి నగదును తన వ్యక్తిగత అకౌంట్లోకి మళ్లించుకున్నాడు. బాధితులు ఇటీవల నాలుగో పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మేనేజర్ అజయ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తం 42 మంది బాధితుల నుంచి సుమారు రూ.4కోట్ల మేర తీసుకున్నట్లు తెలిసింది. మేనేజర్ పోస్టును అడ్డం పెట్టుకుని ఇటు ఖాతాదారులను, అటు బ్యాంకును మోసగించినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు. కాగా ఈ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోయినట్లు తేల్చారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 2న ఆయనను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. అనంతరం దర్యాప్తు కోసం కస్టడీ కోరుతూ పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అజయ్ ను విచారించనున్నారు.