– లోక్‌సభలో తీర్మానం ఆమోదం
– మహువాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని స్పీకర్
– ప్రతిపక్షాల వాకౌట్ గాంధీ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే (క్యాష్ ఫర్ క్వారీ) ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయి త్రాపై బహిష్కరణ వేటు పడింది. లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకో వాలన్న తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ ముందుకు శుక్రవారం తెచ్చారు. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ 500 పేజీల నివేదకను ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు.
నివేదికను లోక్‌సభ ఆమోదించడంతో ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ‘ఎంపీ మహువా మెయిత్రా ప్రవర్తన అనైతికంగా, ఎంపీగా అసభ్యకరంగా ఉందని కమిటీ చేసిన తీర్మానాలను ఈ సభ అంగీకరించింది. కాబట్టి, ఆమె ఎంపీగా కొనసాగడం సరికాదు’ అన్నారు. నివేదికపై చర్చ సందర్భంగా.. మాట్లాడేందుకు మహువా మెయిత్రీకి అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తదితరులు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ అందుకు నిరాకరించారు. దీంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంట్ ముఖద్వారం వద్ద నిరసన తెలిపి, అక్కడ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.
ఇది మీ పతనానికి నాంది: మెయిత్రా
లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడంపై మహువా మెయిత్రా పార్లమెంటు వెలుపల నిప్పులు చెరిగారు. సభలో చెప్పాలను కున్నదంతా పార్లమెంట్ ఆవర ణంలో మీడియాకు మెయిత్రా వివరిం చారు. తనను బహిష్కరించే హక్కు ఎథిక్స్ కమిటీకి లేదని అన్నారు. ఇది మీ (బీజేపీ) ముగింపునకు ఆరంభమంటూ ఘాటుగా విమర్శించారు. ‘దుర్గా మాత వచ్చింది. ఇక చూసుకుందాం. వినాశనం సంభవించినప్పుడు మొదట కనుమరుగయ్యేది వివేకమే, వస్త్రాపహరణను వాళ్లు మొదలుపెట్టారు. ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు’ అంటూ బీజేపీ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. ‘నాకు 49 సంవత్సరాలు, నేను వచ్చే 30 సంవత్సరాలు పార్లమెంటు లోపల, వెలుపల మీతో పోరాడతాను’ అని అన్నారు.
‘ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎథిక్స్ కమిటీ నన్ను బహిష్కరిం చాలని నిర్ణయించింది. ఎక్కడా నగదు, లేదా బహుమతులకు సంబంధించిన ఆధారాలు లేవు. పార్లమెంటరీ లాగిన్ షేరింగ్‌ను నియంత్రించడానికి ఎటు వంటి నియమాలు లేవు’ అని అన్నారు. ఎథిక్స్ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని, తమను అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి తనను దోషిగా నిర్ధారించారని విమర్శించారు. రేపు మా ఇంటికి సీబీఐని పంపి నన్ను వేధిస్తారేమోనని మండిపడ్డారు.
టీఎంసీ లోక్‌సభ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ మాట్లాడుతూ మహువా మెయిత్రాకు న్యాయం నిరాకరించబడిందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ‘ఇది నిరాధారమైన వాస్తవాల ఆధారంగా, ప్రతీకార భావనతో జరిగింది’ అని విమర్శించారు.
లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన… సభ వాయిదాల పర్వం
తొలిత ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై ఎథిక్స్ కమిటీ రూపొందించిన రిపోర్టుపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ హౌరెత్తింది. దీంతో సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి నెలకొంది. దీంతో సభ ప్రారంభమైన ఏడు నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే 500 పేజీలతో కూడిన నివేదికను బీజేపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మెన్ విజరు సోన్కర్ ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ నివేదిక కాపీ తమకు ఇవ్వాలని, ఓటింగ్‌కు ముందు చర్చ జరుపాలనీ, టీఎంసీ ఎంపీ మెయిత్రీ తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను ప్రతిపక్ష ఎంపీలు కోరారు. అయితే అందుకు స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. 2005లో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొన్న 10 మంది ఎంపీలకు సభలో మాట్లాడేందుకు అప్పటి స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ అనుమతి నిరాకరించారని అన్నారు. నాటి స్పీకర్లు పాటించిన సంప్రదాయాన్నే తాను అనుసరిస్తున్నట్టు ఓం బిర్లా చెప్పారు. అయితే చర్చ సందర్భంగా వివిధ పార్టీల నేతలు ఆమెపై బహిష్కరణ వేటు వేయడాన్ని తప్పు పట్టారు. చర్చ ముగిసిన తరువాత ఓటింగ్‌కు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహువా మెయిత్రాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభను వాకౌట్ చేశారు.