అనాగరికాఘోరము

Barbaricఎవరిపిచ్చి వారికానందము అని సమాధానపడటానికి లేదు. సభ్యసమాజంలో దాని ప్రభావం ఇతరుల మీద, సంఘం మీద పడుతు న్నపుడు, నాగరిక విలువలు, జీవనంపై సవాళ్లు విసురుతున్నపుడు కలుగజేసుకోవడం అత్యంతావశ్యకం. అనేక వేల సంవత్సరాల పరిణామ క్రమంలో మానవ నాగరికత ఈ దశకు చేరుకున్నది. సభ్యత, మర్యాద, ప్రజాస్వామిక విలువలు, శాస్త్రీయ ఆలోచన మొదలైనవన్నీ మానవుడు సమకూర్చుకున్న సామూహిక అభివృద్ధి. సమాజ పరిణామ క్రమంలో ఆరంభమైన మత ఆచారాలు కూడా పరిణామం చెందుతూ వస్తున్నాయి. శాస్త్రీయత అందించిన ఆలోచనలతో సమాజం ఒక్కొక్క అడుగు ముందుకువేస్తూ ప్రస్థానం సాగుతున్నది. రెండోవైపు విశ్వాసాల పేరుతో మూఢత్వమూ, అశాస్త్రీయతా కొనసాగుతున్నది. శాస్త్రీయ భావాలే మానవ పురోగతికి, అభివృద్ధికి సౌకర్యవంతమైన జీవనానికి దోహదం చేస్తున్నవి. సామాజిక అసమానతల కారణంగా పరిష్కరించు కోలేని సమస్యలు చుట్టుముట్టినపుడు పురుడుపోసుకునే విశ్వాసాలు, మూఢవిశ్వాసాలుగా పరిణామం చెందుతూ వస్తున్నాయి. అవి మరింత ఘోరంగా, అసభ్యంగానూ మన ముందుకు రావటం నేడు చూస్తున్నాము.
శివుని ఉపాసకులముగా చెప్పుకునే ఈ అఘోరీ ఘోర వ్యవహారం తెలుగు సోషల్‌మీడియాలో చాలా అశ్లీలంగా, భయంకరంగా చర్చలోకి వచ్చింది. అంతేకాదు ఆ అఘోరీతోని ఛానెళ్లు, యూట్యూబు ఛానెళ్లు, అనేకానేక కోణాల్లో ఇంటర్వ్యూలు చేసి ప్రజలకు ఇంతవరకు లేని జ్ఞానాన్ని పంచటానికి తెగ ఆతృతపడిపోతున్నాయి. మంచిర్యాలకు చెందిన లింగమార్పిడి చేసుకున్న ఒక అమ్మాయి తాను ఏడో ఏటనే అఘోరీగా మారానని చెప్పుకుంటున్నది. కాశీ నుండి ఇటీవల ముత్యా లమ్మ గుడి అలజడి జరుగుతున్న సందర్భంలోనే తెలంగాణ వీధుల్లోకి వచ్చింది. భయంకరంగా జడలు కట్టిన జుట్టుతో, ఒంటినిండా బూడిద పూసుకుని, దిగంబరంగా, కపాలాన్ని పట్టుకుని వీధులగుండా ఇష్టా రాజ్యాంగా తిరుగుతోంది. తాను నాగసాధు అఘోరీనని, శివవిష్ణు, బ్రహ్మనామం కల కాళీ ఉపాసకురాలుననీ ప్రకటిస్తోంది. అంతేకాదు, లోక కల్యాణం కోసం, సనాతధర్మ పరిరక్షణ కోసం, మరీ ముఖ్యంగా హిందూ ధర్మరక్షణ కోసం వచ్చానని చెప్పుకుంటోంది. హిందూ మతంలోగానీ, ధర్మంలోగానీ అఘోరీల అవతారాలున్నాయా? కపాలాలు పట్టుకుని దిగంబరంగా తిరగటాన్ని మన చట్టాలు, పోలీసు వ్యవస్థ ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు! నేను తెలంగాణకు వచ్చాక కూడా శ్మశానవాటికలో శవాలను తిన్నానని చెబుతుంటే ఎవ్వరూ ఒక్క ప్రశ్నా సంధించరు! ఏ చట్టమూ వీరికి వర్తించదా? దయ్యాలున్నాయని, క్షుద్ర శక్తులున్నాయని, తాంత్రికశక్తుల తోనే మేము అన్నీ తెలుసుకోగలమనీ, లక్షలాది మందిని అఘోరులుగా మార్చటమే మాపని అని బహిరంగంగా ప్రకటిస్తూ తిరుగుతున్న ఈ నగ అఘోరీ తెలంగాణ నేలపైన మూఢత్వాన్ని నింపుతుంటే దానికి మీడియా కూడా ప్రచారాన్ని కలిగించడం మన దౌర్భాగ్యంగా భావించాలి. పోలీసులు ఏమి చేస్తున్నట్టు!హిందూమతమూ దీనికి అనుమతిస్తే, సమ్మతిస్తే, ఇక అనాగరికులంగా మిగలక తప్పదు.
శివం, శవం ఒకటిగానే భావించే ఈ అఘోరీలు ప్రేమకు, ద్వేషానికీ అతీతులని చెబుతారు, కామక్రోధాలను దహనం చేసి శివతత్వాన్ని ప్రచారం చేస్తారని, ప్రకృతితత్వాన్ని బోధిస్తారని చెబుతుంటారు. నిరా డంబరంగా జీవిస్తారని అంటారు. కానీ మన అఘోరీకి విలాస వంతమైన కారు ప్రయాణం. అందులో ఎముకలు, పుర్రెలు. అంతేకాదు ఐఫోను సౌకర్యం, కెన్లే నీరు, సదుపాయాలను సమకూర్చే శిష్యగణం, సకల భోగాలు. కాశీ, ఉజ్జయిని మొదలైన ప్రాం తాలలో, హిమాల యాల్లో కుంభమేళాలు, పుష్కరాలు జరిగే సందర్భాలలో, శ్మశానాల వద్ద కనపడే అఘోరీలు, ఇప్పుడు జన జీవనంలోకి, ప్రచారాల కోసమూ వస్తున్నారు. నోటికి వచ్చినట్టు మట్లాడుతున్నాడు. ఇదొక మానసిక రుగ్మత. మానవాతీత శక్తులను, సాధన, తపస్సుతో సాధించవచ్చనే మూఢ విశ్వాసం. మూర్ఖవిశ్వాసం
జీవితలక్ష్య సాధనలో ఓడిపోయినవారు, అనేక ఒత్తిడులను భరించలేని, ఎదుర్కోలేని బలహీన మనస్కులు, అజ్ఞానం కొట్టుమిట్టాడే మూఢుల సమూహం ఇది. జీవితపు కర్తవ్యాల నుండి పారిపోయిన పిరికివారి చేష్టలివి. అయినా ఇప్పటికీ మన జనం వారికి అతీత శక్తులు న్నాయని, దైవ సమానులనీ దండాలు పెట్టడం చూస్తే, సాంస్కృ తికంగా ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. అందుకే, ‘ఎప్పుడైతే ఒక మనిషి భ్రాంతికి గురయ్యాడో అతన్ని పిచ్చివాడు అని అంటారు. అయితే అదే భ్రాంతికి అనేకమంది గురయితే, అదే మతం అవుతుంది’ అని ప్రసిద్ధ జీవశాస్త్రవేత్త రిచర్డ్‌ డాకిన్స్‌ అంటారు.