వరాల బేరమయా!

Gifts are bargains!మా పక్కింటి కమలక్కకి చీరలంటే మహాప్రాణాం!
ఉండబట్టలేక అడపాదడపా ఎవరైనా –
‘నీకు నీ ప్రాణం ముఖ్యమా చీరలు ముఖ్యమా ‘కమలక్కా ?’ అని అడిగితే ….
‘అదేం ప్రశ్న తల్లీ! ఇన్నేళ్ల సహవాసంలో నీకు నేనేం అర్ధమయ్యా’ నన్నట్టూ…
ఏ గ్రహాన్నుండో వచ్చిన వింత ఆకారాన్ని చూసినట్టూ.. వారినో చూపు చూస్తుంది!
మొన్నీ మధ్య తన పక్కింటి వాళ్ల పెళ్లి చీరల సెలక్షన్‌ కోసం కమలక్క వెళ్తూ… తనతో తన ఫ్రెండ్స్‌ని తీసుకెళ్లింది. కొత్తకోట, గద్వాల్‌కి వెళ్లి, షాప్‌ వాళ్లకీ, ఫ్రెండ్స్‌కీ నీరసం వచ్చి శోష వచ్చి పడేదాకా బేరమాడి వాళ్లకి బండెడు చీరలు సెలెక్ట్‌ చేసి పెట్టింది.
అదేం చిత్రమో గానీ, ఎక్కడికెళ్లినా.. ఆమెకీ ప్రతి షాప్‌లోనూ రాచమర్యాదలు జరుగుతుంటాయి.
కస్టమర్లలో చాలా మంది ఆమె సెలక్షన్‌ బావుంటుందని అనుకోవడం వాళ్లు వింటారు. కాబట్టి, తమ చీరలు బావుంటే తన వెంట ఓ పెద్ద గుంపుని వెంటేసుకుని తమ షాప్‌కి వస్తుందన్న ఆశాభావంతో ఆమెని ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటారు షాప్స్‌ వాళ్లు.
చీరల్లో ఏ ఒక్కటి బాలేకున్నా .. తనతో పాటు వచ్చిన వాళ్ళందర్నీ-
‘పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పక్క షాప్‌కీ!’ అని ఎక్కడ అంటుందోనని.. సేల్స్‌మెన్లందరూ వాళ్ల షాప్‌లోని చీరలన్నీ ఎంతో ఓపిగ్గా ఆమె ముందు పరిచి, చేతులు కట్టుకుని వినయంగా నించుంటారు.
అదేమిటో ఆమె దష్టి తన ముందు గుట్టలు గుట్టలుగా పడి వున్న చీరల మీద కాకుండా ఎక్కడో ర్యాక్‌లో మూలన పడి వున్న చీరల్లోంచి దీనాతి దీనంగా తొంగి చూస్తోన్న ఓ చీర మీద పడ్తుంది. ఆమె చూపుని చూసి ఆమె అంతర్యాన్ని గ్రహించినవాడై, ఆ చీరని ఎంతో పదిలంగా ఓ పువ్వులా తెచ్చి, ఆమె ముందు పరుస్తాడు ఆ సేల్స్‌ మాన్‌
‘చీర కలర్‌ బావుందని చూపించమన్నాను.. కానీ ..ఛ! బోర్డరేం బాలేదు ! క్వాలిటీ కూడా బాలేదు.. వద్దులెండి !’ అని చెప్తుంది నింపాదిగా.
అంతటితో కమలక్క ఆగదు. తన మొబైలు తీసి, దాన్ని సేల్స్‌ మాన్‌ కిచ్చి అందులో తను సేవ్‌ చేసిన మూడొందల రకాల చీరల్ని చూడమంటుంది.
ఆమె మొబైల్‌ని బ్రౌజ్‌ చేసీచేసీి అలసిపోయి ఠారెత్తే సేల్స్‌మాన్‌-
‘ఇంతకీ ఇందులో మీకు ఏం చీర కావాలో చెప్పండమ్మా! చెప్తే ఆ చీర మా షాప్‌లో వుందో లేదో చెప్తాను !’ అడుగుతాడు దీనంగా.
‘నూటా యాభై రెండో మెసేజ్‌ వుంది చూడూ!’ అంటుంది కమలక్క తీరిగ్గా తన ముందున్న చీరల కుప్పల్ని అటూ ఇటూ తిరగేస్తూ…
‘వార్నాయనో’ అనుకుంటూ అతడు మళ్లీ వెతకడం మొదలెడ్తాడు. ఒక చీర తర్వాత మరో చీర…. మొబైల్లో అన్నీ చీరలే కన్పిస్తాయిగానీ వాటి నంబర్‌ కన్పించక.. డస్సిపోతాడు.
‘అమ్మా! మీరు కావాలనుకుంటోన్న ఆ చీరేదో – మీరే చూసి చెప్పండమ్మా! వెతకడం నా వల్ల కావడంలేదు!’ అంటాడు ఆ మొబైల్‌ అమెకిస్తూ నీరసంగా.
‘నువ్వేం సేల్స్‌మాన్‌ వయ్యా ! సేల్స్‌ మాన్‌ అంటే ఎంత ఓపిక ఉండాలి! అలా నీరసపడిపోతే ఎలా? ఇదిగో నే చూపిస్తా చూడూ ఇదీ!’ అంటూ టక్కున తన మొబైల్లోని ఆ చీర చూపెడుతుంది కమలక్క. అది ఇదేనా? అదైతే వుందమ్మా ! తెచ్చిస్తాను’ అంటూ ఉన్న పళాన పరిగెత్తి, నిముషంలో ఆ చీర తెచ్చి, ఆమె చేతుల్లో పెట్టి, ఆమె కరుణాకటాక్ష వీక్షణాల కోసం మహారాణి ముందు నించున్న రాజ భటుడిలా నిరీక్షిస్తుంటాడు సేల్స్‌మాన్‌.
ఆ చీరని అటూ ఇటూ నింపాదిగా చూసి- ‘డిజైన్‌ ఇదే గానీ.. కలర్‌ అది కాదు, వద్దులే!’ అంటుంది మూతి మూడు వంకర్లు తిప్పుతూ.
సేల్స్‌ మాన్‌ మూర్ఛపోతాడు..
కమలక్కతో ఏ షాప్‌కి వెళ్లినా ఇంచు మించు ఇలాంటి సీన్లే ఉంటాయి లెండి.
లిలిలి
ఓసారి –
‘కమలక్కా ! మా ఇంటికే చీరలమ్మే అబ్బాయి వచ్చాడు! ఏది కొనాలో తెలీడం లేదు! నువ్వొచ్చి సెలెక్ట్‌ చేస్తావా?’ పక్కింటి పాపక్క కిటికీలోంచి పిలిచింది.
అప్పుడే పప్పు వండుదామని పొయ్యి మీద గిన్నె పెట్టిన కమలక్క –
‘అవునా! వస్తానుండు. ఇదిగో పాపక్కా, ఏదంటే అది కొనకు, మన్నికగా ఉండవు!! అంటూ.. పప్పుకు తాళింపు వేసి పరుగు పరుగున పాపక్క ఇంటికి బయల్దేరింది.
ముందు గదిలో అప్పటికే కుప్పలా వేసి వున్న చీరలకన్నీ వంకలు పెడుతూ.. చీరలన్నీ వీరలెవల్లో అటూ ఇటూ కదిపి, చివరికి పాములు పట్టేవాడు పాముల బుట్టలోంచి ఒక పాముని అతి లాఘవంగా పైకి తీసినట్టు.. విజయ హాసంతో ఓ చీర తీసి, పాపక్క చేతుల్లో పెడుతూ…
‘ఇది చూడూ చాలా బావుంది! దీన్ని తీసుకో!! అయ్యో ! ఏమిటా మాడు వాసన ? మీ వంటింట్లో పొయ్యి మీద ఏమైనా పెట్టి మరిచావేమో చూడు పాపక్కా!’ అని గుర్తు చేసింది కమలక్క.
‘అయ్యో! ఆ మాడు వానన మా ఇంట్లోంచి కాదు, మీ ఇంట్లోని పప్పుదై వుంటుంది కమలక్కా!’ అంటూ స్టౌ బంద్‌ చేయడానికి కమలక్క ఇంటికి పరిగెట్టింది పాపక్క.
‘పోతే పోనీలే పాడు పప్పు.. అదేమన్నా చీరెల కన్నా ఎక్కువా ? పప్పు మళ్ళీ వండుకోవచ్చు ! చీరలు మళ్లీ దొరుకుతాయేమిటీ’ అంటూ ఇంతింత కళ్లు చేసుకుని ఒక్కొక్క చీరని ఎంతో అప్యాయంగా తడుముకుంటూ .. ఆ పూట ఇల్లు మరిచి, పాపక్క ఇంట్లోని చీరల దగ్గరే నింపాదిగా సెటిలైంది కమలక్క.
సీన్‌ కట్‌ చేస్తే-
కమలక్క తన ఫ్రెండ్స్‌తో కలిసి చీరల షాపింగ్‌ బయల్దేరింది.
దూరాన్నుండి వస్తున్న అమ్మాయిని చూపిస్తూ-
అదిగో! ఆ అమ్మాయి కట్టకున్న ఆ కాపర్‌ సర్ఫేట్‌ కలర్‌ చీరకి మెజంతా కలర్‌ బోర్డర్‌.. ఎంత బావుందో చూడండి.. ఈ కాంబినేషన్‌ మా చెల్లికి చాలా ఇష్టం! ఈసారి తన బర్త్‌డే కి అలాంటి చీర ఆమెకి కొనిద్దామనుకుంటున్నాను. ఆ చీర ఆమె ఎక్కడ, ఎంతకు కొనుక్కుందో అడిగి వస్తాను !’ అంటూ ఫ్రెండ్స్‌ వద్దని వారిస్తున్నా వినకుండా రివ్వున ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లింది.
ఓ అయిదు నిమిషాల పాటు తాపీగా అదీ ఇదీ మాట్లాడి వెనక్కి తిరిగి వచ్చి-
దూరం నుంచి చూడానికి బావుంది గానీ, అబ్బే… క్వాలిటీ ఏం బాగాలేదు తెలుసా !’ అని జడ్జిమెంట్‌ ఇచ్చేసింది కమలక్క.
ఇంతలో-
నిర్విరామంగా టపీటపీమంటూ ఆమె ఫోన్లో మెసేజులు కుప్పలు కుప్పులుగా రావడం, అందరూ ఆమెకేసి చిత్రంగా చూడటం గమనించి-
‘ఆ.. ఏంలేదు .. కొత్తగా స్టాక్‌ వస్తే చెప్పాలని కొన్ని షాప్‌ల వారికి నా మొబైల్‌ నంబర్‌ ఇచ్చి వచ్చాను.. కొత్త చీరలు వచ్చినప్పుడల్లా వాళ్ల నుంచి ఇలా గుట్టల కొద్దీ మెసేజులు వస్తుంటాయిలే !’ చెప్పింది ఎంతో క్యాజువల్‌గా.
‘మరీ ఇన్ని మెసేజులేమిటే… !’ అని ఓ ఫ్రెండ్‌ అడిగితే-
‘ఆమె దగ్గర కనీసం ఎంత లేదన్నా మూడొండల మంది వీవర్స్‌ సెల్‌ ఫోన్‌ నంబర్లూ షాప్‌ మానేజర్ల తాలూకు మొబైల్‌ నంబర్లూ ఉంటాయి తెలుసా ?’ బదులిచ్చింది పాపక్క.. కమలక్క గొప్పతనాన్ని తలుచుకుంటా గర్వంగా.
‘అంటే మూడొందల మొబైల్స్‌ నుంచి మూడొందల చీరల చొప్పున మొత్తం నెలకి తొంభైవేల చీరల ఫొటోలొస్తాయన్నమాట! ఎంత అదష్టం ! ఎంత అదష్టం !! షాప్స్‌ చుట్టూ తిరిగే పనిలేకుండా .. ఎంచక్కా చీరలన్నీ ఆమె ఇంటికే వస్తాయన్న మాట !’ చప్పట్లు కొట్టింది చివరింటి చిట్టక్క.
‘చీరలు రావడం సంగతి దేవుడెరుగు? స్టోరేజ్‌ అయిపోయిందంటూ ప్రతిరోజూ ఫోన్లో ఇండికేషన్‌ రావడం చూసి- ‘ఉత్తినే కూర్చుంటారెందుకూ? నాకు నచ్చినవి స్టార్‌ గుర్తుతో సేవ్‌ చేశాను.. మిగిలినవన్నీ తీసేయండి’ అంటూ నాకో పని లేని పని పురమాయిస్తుంది మీ కమలక్క! నా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలంటావమ్మా !” వాపోయాడు కమలక్క ప్రాణవల్లభుడు.
‘ఏముంది బావగారూ ! కమలక్కతో ఓ చీరల దుకాణం పెట్టించండి, పనికి పనీ డబ్బుకి డబ్బూ వస్తుంది కదా !” సలహా ఇచ్చింది చిట్టెక్క.
‘ఇదేదో బావుంది!’ అనుకుని ఆయన ఆ ప్రయత్నాల్లో మునిగిపోదామని అనుకునేంతలో..
మళ్ళీ తన దుకాణం వదిలి, తన భార్యామణి ఎక్కడ తన కుటుంబాన్ని నష్టాల పాల్జేసి, కష్టాలు తెచ్చి పెడుతుందోనని తటపటాయించడం గనునించి-
‘బావగారూ! సందేహించకండి! మీ ఆవిడ పరుల చీరల కోసం తన టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటోంది. అవిడని ముందు ఇంట్లోనే బిజినెస్‌ స్టార్ట్‌ చెయ్యమనండి! ఎదుటోళ్ళకి ఎన్ని చీరలున్నాయో. నాకు గుర్తుండదు గానీ కమలక్కకు ఎవరికి ఎలాంటి చీరలున్నాయో, వాటి రంగూ, అంచూ, ధరతో సహా అన్నీ ఆమెకు గుర్తుంటాయి కాబట్టి.. వారికి లేని చీరలే తెస్తుంది! ఆమె చీరల బిజినెస్‌ దివ్యంగా నడుస్తుంది. దానికి పూచీ నాది ! మీకు నమ్మకం కలిగించేందుకు నేను కూడా పార్ట్నర్‌గా ఉంటా! కావాలంటే మీకు ముందే అడ్వాన్స్‌ కూడా ఇస్తాను. ఆల్‌ ది బెస్ట్‌ బావగారూ!’ అంటూ మహదానందంగా చిందులువేస్తూ వెళ్లిపోయింది చిట్టెక్క.

డా. అమృతలత
9848868068