బరోడా 403/4

Baroda 403/4నవతెలంగాణ-హైదరాబాద్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో రికార్డుల మోత మోగుతోంది. సోమవారం ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్‌-ఈ మ్యాచ్‌లో బరోడా 50 ఓవర్లలో 403 పరుగులు చేసింది. కేరళపై తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా..8.06 రన్‌రేట్‌తో దంచికొట్టింది. ఓపెనర్‌ నినాద్‌ రత్వ (136, 99 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కగా.. కృనాల్‌ పాండ్య (80 నాటౌట్‌, 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విష్ణు సోలంకి (46, 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), భాను పానియ (37 నాటౌట్‌, 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఛేదనలో కేరళ సైతం దుమ్మురేపింది. వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ (104, 58 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. రోహన్‌ (65), ఇమ్రాన్‌ (51) అర్థ సెంచరీలతో రాణించారు. బరోడా బౌలర్లు ఆకాశ్‌ సింగ్‌ (3/70), రాజ్‌ (2/73), రత్వ (2/81), కృనాల్‌ (2/44) క్రమం తప్పకుండా వికెట్లు కూల్చటంతో కేరళ 45.5 ఓవర్లలో 341 పరుగులకు ఆలౌటైంది. 62 పరుగుల తేడాతో బరోడా భారీ విజయం సాధించింది. ఇదిలా ఉండగా, జింఖానా గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై ఢిల్లీ 79 పరుగులతో విజయం సాధించింది. తొలుత ఢిల్లీ 211 పరుగులు చేయగా.. మధ్యప్రదేశ్‌ 132 పరుగులకే కుప్పకూలింది. జెన్‌నెక్ట్స్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో బిహార్‌పై త్రిపుర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. బిహార్‌ 226/8 పరుగులు చేయగా, త్రిపుర 48.2 ఓవర్లలోనే 228/5 పరుగులతో ఛేదించింది.