– ఆ నివేదిక వచ్చాకే తదుపరి చర్యలు
– మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై ఇప్పుడే నిర్ణయం తీసుకోం
– కాళేశ్వరంపై అపోహలు ఉన్నా…సరిచేసేందుకు ప్రయత్నిస్తాం
– ‘నీటిపారుదలరంగం- శ్వేతపత్రం’పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోదు. ఈ బ్యారేజ్‌లన్నింటినీ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)కి అప్పగిస్తాం. వారి నివేదిక వచ్చాకే, దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. కాళేశ్వరంపై మాకు ఎన్ని అపోహలు ఉన్నా, లోటుపాట్లను సరిచేసేందుకు ప్రయత్నిస్తాం” అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో ‘తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం-శ్వేతపత్రం’ అంశంపై జరిగిన లఘు చర్చ ముగింపు సందర్భంగా ఆయన ప్రభుత్వ విధానాన్ని వెల్లడించారు. ‘గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల వ్యయం భారీగా పెంచేశారు. డిజైన్లు మార్చేశారు. దానివల్ల చాలా నష్టం జరిగింది. కాళేశ్వరంపై గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది. కాగ్ రిపోర్టుల్ని ఆషామాషీగా తీసుకోవద్దు. కాళేశ్వరంపై ఆ సంస్థ పూర్తిస్థాయి విశ్లేషణ చేసింది. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటాం. రాష్ట్ర విద్యుత్ వినియోగం కంటే ప్రాజెక్ట్ విద్యుత్ వినియోగమే ఎక్కువని కాగ్ తేల్చిచెప్పింది” అని అన్నారు. ”గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం అడ్డగోలుగా రుణాలు తీసుకుంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువ వడ్డీలకు స్వల్పకాలిక రుణాలను తీసుకొచ్చారు. వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చాలని ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాం” అని చెప్పారు. ‘కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎమ్‌బీ)కి అప్పగించేది లేదు’ అని స్పష్టం చేశారు. ”పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలని కేంద్రమంత్రి షెకావత్‌ను కోరాం. గడచిన పదేండ్లలో ఏ ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయహౌదా ఇవ్వలేదని ఆయన తెలిపారు. అయితే ప్రాజెక్ట్ వ్యయంలో 60 శాతం నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు” అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో సభ్యులకు వివరించారు. ఇదే అంశంపై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు కూడా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించి ఉంటే, ప్రజలకు అర్థమయ్యేరీతిలో ప్రాజెక్టుల గురించి వివరించి ఉండేవాళ్లమని అన్నారు. రాష్ట్రానికి నష్టం జరగాలని మాజీ సీఎం కే చంద్రశేఖరరావు ఏనాడూ ఆలోచించలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులపై జరిగిన పలు చర్చల్లో తాను నిశ్శబ్ద శ్రోతగా ఉన్నాననీ, అందువల్ల తనకూ వాటిపై కొంత అవగాహన ఉన్నదని చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో 50 శాతం నీటి వాటా వస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ప్రాజెక్టుల వల్ల పెరిగిన పంట దిగుబడి కండ్లముందే ఉందనీ, అసలు ఏమీ కాలేదని మీరెలా చెప్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకొని, గడచిన 9 ఏండ్లలో రాష్ట్రవ్యాప్తంగా అధికవర్షపాతం నమోదైందనీ, దానివల్ల భూగర్భజలాలతో పాటు సాగు కూడా పెరిగిందని వివరించారు. మేడిగడ్డ పనికిరాదని ఏ నిపుణులూ రిపోర్టు ఇవ్వలేదనీ. అన్నారం, సుందిళ్ల కూడా కూలుతున్నాయని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు, పల్లారాజేశ్వరరెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఇదే అంశంపై ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్, పాయల్ శంకర్, మదన్‌మోహన్ రావు, బీ మధుసూదన్‌రెడ్డి, మందుల సామేల్, డాక్టర్ సంజీవరెడ్డి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఆది శ్రీనివాసులు, గండ్ర సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.
ఎన్డీఎస్‌ఏకు బ్యారేజ్‌లు
3:38 am