ఎన్నికల బరిలో ‘బర్రెలక్క’

'Barrelakka' in the election ring– నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రతీక
– ప్రభుత్వంలో కదలిక రావడానికి పోటీ నిరుద్యోగ యువతి శిరీష ఆవేదన
– సోషల్‌ మీడియాలో ప్రశ్నించినందుకు కేసులు
నిరుద్యోగ యువకులు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అస్తవ్యస్తమైన పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ కార్యాలయం ముందు ముట్టడి నిర్వహించారు. అయినా ప్రభుత్వం ఎవరిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ నేను సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టినందుకు కేసులు పెట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి తప్ప ఈ ప్రభుత్వంపై నాకు ఎటువంటి కోపం లేదంటూ నిరుద్యోగ యువతి, ఎన్నికల్లో బరిలోకి దిగిన బర్రెలక్క తన ఆవేదన వ్యక్తం చేశారు.
నవ తెలంగాణ – మహబూబ్‌ నగర్‌
ప్రాంతీయ ప్రతినిధి
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దకొత్తపల్ల్లిలో నిరుద్యోగ యువతి శిరీష. బర్రెలక్కగా సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఈడి రెండో సంవత్సరం చదువుకుంటున్న శిరీష పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం కనబరుస్తోందంటూ.. ”ఉపాధి కోసం ఉద్యోగాలు ఇవ్వకుండా బర్రెలు, గొర్రెలు కొనుక్కొని జీవనోపాధి పొందాలని పాలకులు చెబుతున్నారు. నాకు ఉద్యోగం రాకపోవడంతో మా అమ్మ గేదెలను కొనిచ్చింది. ఉదయం, సాయంకాలం కలిపి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి.. దీనితో నేను జీవనం సాగిస్తాను..’ అని నాలుగు గేదెలను చూపుతూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వీడియో చూసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్క శిరీషపై పోలీస్‌ స్టేషన్లో కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ పడింది. నిరుద్యోగుల ఆవేదనను ప్రజలకు తెలియజేయడానికి కొల్లాపూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె బరిలో నిలిచారు బర్రెలక్క శిరీష.
పెద్దకొత్తపల్లి మండలం మర్రికళ్లు గ్రామానికి చెందిన బర్రెలక్కకు తల్లి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి రెండేండ్ల కిందట ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వారు పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో రేకుల ఇంట్లో జీవిస్తున్నారు. చిన్నపాటి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమకున్న రెండు గుంటల భూమిని సైతం తండ్రి ఇతరులకు అమ్ముకొని వెళ్లిపోయాడు. ఆ భూమి తమకే చెందాలని ఇతరులు కేసు పెట్టడంతో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తల్లి మీద భూమి కేసు, శిరీష మీద సోషల్‌ మీడియా కేసుతో నిత్యం పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయన్న పాలకుల మాటలు నీటి మూటలు అయ్యాయి. అందుకే పాలకుల కనులు తెరిపించడానికి కొల్లాపూర్‌ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తాను సైతం పోటీ చేస్తున్నానని శిరీష చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీషకు నియోజకవర్గమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. నిరుద్యోగులకు న్యాయం జరిగే దాకా తాను అలుపెరుగని పోరాటం చేస్తానని ఆమె చెప్తున్నారు. తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, నిరుద్యోగుల జీవన ప్రమాణాలను మార్చడానికే తన వంతు కృషి చేస్తున్నానన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రత్యేక ప్రయోగాత్మకంగా కొల్లాపూర్‌ శాసనసభకు నిలబడుతున్నానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ”వందల కోట్ల ఆస్తిపరులు పోటీ చేస్తుండగా.. నయా పైసా కూడా లేని నేను బరిలో నిలవడం కష్టమే. అయినా నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో వారి వాయిస్‌ వినిపించడానికి పోటీ తప్పదు” అని అన్నారు. దళిత, బీసీబంధులో, ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్లు అవినీతి జరిగినా స్పందించని పాలకులు చిన్న పోస్టును మీడియాలో పెడితే కేసులు పెట్టడం అప్రజాస్వామికంటున్నారు.
ప్రతి ఓటరు రూపాయి ఇచ్చి ఓటు వేయాలి
బర్రెలక్క శిరీష, ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లాపూర్‌అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివాను. ఉద్యోగం రాదని తెలిసి బాధపడ్డాను. అందుకే నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్‌ నియోజకవర్గ బరిలో నిలిచాను. నా గెలుపుతో పాలకవర్గాలకు కనువిప్పు కలగాలి. పారదర్శకంగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించని లేనియెడల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇలా ఇవ్వని పక్షంలో ఎన్నికలు ఏవైనా నిరుద్యోగులు బరిలో నిలుస్తారు.
బర్రెలక్క తమ్మునిపై దాడి
– ప్రచారంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తుల అరాచకం
–  పోలీసు రక్షణ కల్పించాలని శిరీష డిమాండ్‌
స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తమ్మునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని వెన్నచర్ల గ్రామంలో మంగళవారం జరిగింది. వెన్నచర్ల గ్రామంలో బర్రెలక్క (శిరీష) తన ప్రచారాన్ని ముగించుకొని వెళ్తుండగా ఆమె తమ్ముడు చింటూ అలియాస్‌ భరత్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాంతో శిరీష పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజు తెలిపారు. అనంతరం ఆమె తన మద్దతుదారులతో కలిసి పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. దళిత బిడ్డను.. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం వల్లే బెదిరింపు కాల్స్‌, దాడులు చేసి తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తనకు ప్రాణభయం ఉందన్నారు. పోలీస్‌ ప్రొడక్షన్‌ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగనందున ఎన్నికల బరిలో నిలిచానని, అది జీర్ణించుకోని వారు తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.