ఇంజినీరింగ్‌ కాలేజీల అడ్డదారులు!

Obstacles of engineering colleges!– నకిలీ అపాయింట్‌మెంట్‌లు సృష్టిస్తున్న వైనం
– న్యాక్‌, ఎన్‌బీఏ గ్రేడ్‌ కోసం తప్పుడు పద్ధతులు
– విద్యార్థులను మోసం చేస్తున్న యాజమాన్యాలు
– చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు విద్యార్థులు, తల్లిదండ్రులు మోసం చేస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలు, అర్హులైన అధ్యాపకులు, మెరుగైన వసతుల్లేకపోయినా అందమైన భవనాల ఫొటోలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ప్రభుత్వాలను, గుర్తింపు ఇచ్చే పలు సంస్థలనూ బోగస్‌ పత్రాలను సమర్పించి బోల్తా పడుతున్నాయి. ఇందుకోసం పలు కాలేజీ యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మెరుగైన నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌), నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గ్రేడ్‌ కోసం తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఎక్కువ ప్లేస్‌మెంట్లు ఉంటే మంచి గ్రేడ్‌ వస్తుందన్న ఆశతో నకిలీ అపాయింట్‌మెంట్లను సృష్టిస్తున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో విద్యార్థులకు నకిలీ ఆఫర్‌ లెటర్లను తయారు చేస్తున్నాయి. వాటిని న్యాక్‌, ఎన్‌బీఏకు సమర్పిస్తున్నాయి. అయితే ఇది విద్యార్థులకు తెలియకుండానే జరగడం గమనార్హం. ఆయా కాలేజీ యాజమాన్యాలు సాఫ్ట్‌ వేర్‌ సిబ్బందితో నకిలీ ఆఫర్‌ లెటర్లను తయారు చేస్తున్నాయి. విద్యార్థులకు మంచి ప్యాకేజీ ఇస్తు న్నట్టుగా అందులో ఉం టుంది. వాస్తవానికి ఆ విద్యా ర్థులకు మాత్రం ఆ ఆఫర్‌ లెటర్లను మాత్రం అందించరు. దొడ్డి దారిన కాలేజీకి మంచి గ్రేడ్‌ రావాలన్న దురుద్దేశంతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఇలా వ్యవహరిస్తున్నాయి. అంతే తప్ప కాలేజీల్లో ప్రమాణాలను పెంచి, వసతులను మెరుగుపర్చి సరి పోయినంత మంది అధ్యా పకులను నియమిం చడంపై అవి దృష్టిసారించ కపోవడం గమనార్హం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, అనుబంధ గుర్తింపు ప్రక టించిన విశ్వవిశ్వవిద్యాలయాలు ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
అధికార పార్టీ నేతల కాలేజీల్లోనూ…
రాష్ట్రంలో పలు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో న్యాక్‌, ఎన్‌బీఏ గ్రేడ్‌ కోసం నకిలీ పత్రాలను సమర్పిస్తున్నట్టు ఆరోపణలు వినిపి స్తున్నాయి. నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లను తయారు చేసిన వాటిలో అధికార పార్టీ నేతలకు చెందిన కాలేజీలూ ఉన్నట్టు తెలుస్తున్నది. దుండిగల్‌, ఇబ్రహీంపట్నం, ఇతర ప్రాంతాల్లో ఉన్న కాలేజీ యాజమాన్యాలే ఇలాంటి వాటికి పాల్పడుతు న్నాయి. పలువురు విద్యార్థుల పేర్లతో వాటిని తయారు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో బోగస్‌ పత్రాలను సమర్పించడంతో ఓ అధికార పార్టీ నేత కాలేజీని న్యాక్‌ బ్లాక్‌లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. ఆ కాలేజీకి 2018లో న్యాక్‌ బీప్లస్‌ప్లస్‌ గ్రేడ్‌ వస్తే మెరుగైన గ్రేడ్‌ కావాలంటూ 2019లో రీఅసెస్‌మెంట్‌ కోసం మళ్లీ దరఖాస్తు చేసింది. బీహెచ్‌ఈఎల్‌, ఎయిర్‌ టెల్‌, యాష్‌ టెక్నాలజీలకు చెందిన పత్రాలు, సంత కాలు, స్టాంపులు, లెటర్‌హెడ్‌లను డిజిటల్‌ పద్ధతిలో ఫోర్జరీ చేసి సమర్పిం చినట్టు తేలింది. న్యాక్‌ గ్రేడ్‌ కోసం ఆ కాలేజీ యాజమాన్యం సెల్ఫ్‌ స్టడీ రిపోర్టు (ఎస్‌ఎస్‌ఆర్‌)లో బోగస్‌ పత్రాలు సమర్పించినట్టు రుజు వైంది. న్యాక్‌కు సమర్పించిన ఎస్‌ఎస్‌ఆర్‌ నివేదిక ఫోర్జరీ చేసినట్టుగా తేలడంతో 2019, నవంబర్‌ 5న ఆ కాలేజీ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. యాజ మాన్యం స్పందించలేదు. దీంతో ఆ కాలేజీని ఐదేండ్ల పాటు బ్లాక్‌లిస్టులో చేర్చుతున్నట్టు న్యాక్‌ ప్రకటించింది. ఇలా పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు న్యాక్‌, ఎన్‌బీఏ గ్రేడ్‌ నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, ఇతర పత్రా లను తయారు చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి.
ఫిర్యాదుచేస్తాం అయినేని సంతోష్‌కుమార్‌
నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లను తయారు చేసిన కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలను న్యాక్‌, ఎన్‌బీఏకు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ స్కూల్‌ టెక్నికల్‌ కాలేజీల ఉద్యోగుల సంఘం (టీఎస్‌టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్‌ నవతెలంగాణతో చెప్పారు. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్‌కూ ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీలు సమర్పించిన పత్రాలపై విచారణ జరిపి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.