కుల, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా సాగిన ప్రతిఘటనా స్రవంతి – బసవ సిద్ధాంతం

– ఎస్వీకే వెబినార్‌లో డాక్టర్‌ మీనాక్షి బాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కుల, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా సాగిన ప్రతిఘటనా స్రవంతి బసవ సిద్ధాంతం అని రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, రచయిత, ఐద్వా కర్ణాటక అధ్యక్షురాలు డాక్టర్‌ మీనాక్షి బాలి తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయ కుమార్‌ అధ్యక్షతన బసవ సిద్ధాంతం, మహిళలు-కులం అనే అంశంపై వెబినార్‌లో ఆమె మాట్లాడారు. ఆర్థిక అసమానతలను బసవ సిద్ధాంతం ప్రశ్నించిందని తెలిపారు. బసవేశ్వరుని అనేక పద్యాలను ఉటంకిస్తూ, మాతృభాషల్లో మాండలికలంలో తొలిసారిగా వ్యాకరణం, ఛందస్సు వంటివి లేకుండా సాహిత్యాన్ని సష్టించారని తెలిపారు. తొలి కులాంతర వివాహాన్ని జరిపించారన్నారు. గుడిలో మట్టి, నీరు, అంటరానివాని ఇంటిలో మట్టి, నీరు ఒకటే అయినప్పుడు అక్కడ శుద్ధమైనవీ, ఇక్కడ అశుద్ధమైనవి ఎలా అవుతాయని బసవేశ్వరుడు ప్రశ్నించారని గుర్తుచేశారు. 12వ శతాబ్దంలోనే వైదికేతర సాహిత్యాన్ని తెచ్చారని కొనియాడారు. ప్రతిభ, సామర్థ్యాలది ఏ లింగమంటూ ప్రశ్నిస్తూ , స్త్రీ, పురుషులు సమానులనే భావన ముందుకు తెచ్చారని తెలిపారు. బసవేశ్వరుని సంస్కరణవాదాన్ని సనాతన ధర్మం మాదిరిగా మఠాలు, సాంప్రదాయాలమయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధిపత్య ఆర్‌ఎస్‌ఎస్‌ సంప్రదాయాన్ని ప్రతిఘటించడంలో బసవ సిద్ధాంతం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె హిందీలో చేసిన ప్రసంగాన్ని కొండూరు వీరయ్య తెలుగులోకి అనువదించారు.