గత చరిత్రకు ఆనవాలు

నేరుగా ఆత్మకథలు, జీవిత చరిత్రలు రాయడం వేరు. తమ అనుభవాలు, జ్ఞాపకాలను జీవిత చరిత్రలుగా మార్చడం వేరు. ఈ కోవలో విజయ రంగనాథం గారు తమ 70 ఏళ్ల జీవిత విశేషాలను ”జ్ఞాపకాలు” గా మనకు అందజేస్తున్నారు. హైదరాబాద్‌ లోని సీతారాం బాగ్‌ అనే మార్వాడీల ఆధీనంలోని అగ్రహారం లాంటి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన జ్వాలాముఖి తిరుగుబాటుదారుగా, హేతువాదిగా మారడం ఆశ్చర్యం. అన్నగారి ప్రేరణ, ప్రోత్సాహంతో చెల్లెలు విజయ కూడా అలాగే తయారవుతుంది. ఆమె బాల్యం నుండి వద్ధాప్యం వరకు జరిగిన అనేకానేక సంఘటనలను, జీవిత విశేషాలను ఇందులో గ్రంథస్తం చేశారు. వాళ్ల నాన్నగారి బాల్యవివాహం కుండ మార్పిడి పద్ధతిలో ఎలా జరిగిందో చెబుతూ, అప్పటి విషయాలతో ప్రారంభించారు. ఆ పూజారి కుటుంబం ఎన్ని ఒడిదుడుకులకు గురైందో, ఎలా చాలీచాలని జీవితాన్ని గడిపిందో పూసగుచ్చినట్లుగా వివరించారు. ఆ దుర్భర దారిద్రం లోంచి కొనసాగిన విజరు గారి విద్యాభ్యాసం, ఆమె కష్టాలను అధిగమించడానికి ఉద్యోగం కోసం పడిన పాట్లు అన్నింటినీ వివరించారు.
రంగనాథంతో దండలపెళ్ళి మొదలుకొని ఆయనతో ఆమె జీవితం ఎలా పెనువేసుకుపోయిందో ఆయా విశేషాలన్నింటినీ విశదీకరించారు. నక్సల్బరీ విప్లవోద్యమానికి దేశంలోని తొలి బహిరంగ పత్రిక” పిలుపు” పక్షపత్రిక కు రంగనాథం సంపాదకులు. రంగనాథం సహచరిగా మాత్రమే కాక పిలుపు సంపాదకురాలిగా కూడా ఆ సాహసంలో ఆమె భాగం పంచుకున్నారు. పిలుపు సంపాదకుడిగానే కాకుండా రంగనాథం సికింద్రాబాద్‌ కుట్ర కేసు నిందితుడిగా, ఎమర్జెన్సీ డిటెన్యూగా కూడా జైలు జీవితం అనుభవించాడు. ఎమర్జెన్సీ తర్వాత కొన్ని సంవత్సరాలు పౌరహక్కుల సంఘంలో కొనసాగారు. విలువలతో, నిబద్ధతతో కొనసాగిన రంగనాథంకు అండదండగా నిలిచి విజరు గారు తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు.
ముఖ్యంగా తన అన్నగారైన జ్వాలాముఖి జీవితం- వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను ఇందులో తెలియజేశారు. ఆయన బాల్యం నుండే తిరుగుబాటుదారుడిగా, హేతువాదిగా మారడం – అన్యాయాలను సహించలేక తిరగబడే ధోరణిని, నిప్పులు కక్కే ఉపన్యాసాలు ఇస్తాడని పేరు పడిన మనిషి వాస్తవ జీవితంలో ఎంత మెత్తని మనిషో, కరుణాంతరంగుడో ఇక్కడ ఆయన చెల్లెలుగా విజయ అద్భుతంగా వివరిస్తుంది.
తన చుట్టుపక్కల వారే కాదు. తనకు ఎదురుపడిన వారి కష్టాలకు- బాధలకు చలించిపోయి ఉన్నంతలో వారి నాదుకోవడానికి ప్రయత్నించిన విజయ గారి సున్నితత్వాన్ని, వారి కరుణాంతరంగాన్ని ”జ్ఞాపకాలు” లో మనం చూడవచ్చు. ఆడవాళ్ళ పట్ల ఆంక్షలు, వివక్ష కొనసాగే ఆ కాలంలోనే ఆమె వాటన్నింటినీ కూలద్రోసి, నిర్భీతిగా తన మార్గంలో పయనించిన విధానం మనల్ని ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అప్పటి సాహిత్యకారులు, దిగంబరకవులు, విప్లవకారులను తమ జీవిత ప్రయాణంలో భాగంగానే వివరించారు తప్ప ప్రత్యేకంగా వారి గురించి పెద్దగా చెప్పినదేమీ లేకపోవడం విశేషం.
70 ఏళ్ల క్రిందట విషయాలను అందులోని ప్రతి చిన్న విషయాన్ని ఇప్పుడు పూసగుచ్చినట్లుగా యథాతథంగా వివరించడంలో ఆమె జ్ఞాపక శక్తిని చూసి మనం ఆశ్చర్యపోక తప్పదు. డైరీ కథనంలో ఉన్న చిక్కదనం, ఉన్న విషయాలని ఉన్నదున్నట్టుగానే తెలియజేయాలనే తపన ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. చివరగా చరమాంకం హడావుడిగా ముగించేసినట్లు అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు .
ఇవి కేవలం ”జ్ఞాపకాలు” కాదు 70 ఏళ్ల ముందటి హైదరాబాద్‌ నగర ఆర్థిక సామాజిక రాజకీయ చరిత్రకు నిదర్శనాలు.