ప్రాథమిక విద్య నిర్వీర్యం

– మూడో తరగతి వరకు అంగన్‌వాడీలకు ఇవ్వొద్దు : డీటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఒకటి నుంచి మూడో తరగతి వరకు ప్లేస్కూళ్ల తరహాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యాబోధన ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని డీటీఎఫ్‌ తెలిపింది. దానివల్ల ప్రాథమిక విద్య నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొంటాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు మూడో తరగతి వరకు విద్యాబోధన ఇవ్వడం వల్ల ప్రాథమిక విద్య ప్రయివేటుపరమయ్యే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీలను కలపాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిన నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు.