అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించాలి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌళిక వసతులకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఆయన మున్సిపల్ కమిషనర్లు,   పంచాయతీరాజ్, ఆర్.అండ్.బి.,  ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, మండల విద్యా అధికారులు, ఏపీఎంలు, మెప్మా అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో త్రాగు నీటి పనులను ఆయన సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మేజర్ మైనర్ మరమ్మత్తులకు చేపట్టవలసిన పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలల్లో పనులు చేపట్టకముందు, చేపట్టిన తర్వాత ఫోటోలను తీయాలని తెలిపారు. పురోగతిలో వున్న పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రారంభం కాని పనులను వెంటనే చేపట్టాలని, పనులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నమోదు చేయాలని, పూర్తయి పనుల రిపోర్టులు సమర్పించి నిధులు పొందాలని, పనులలో వెనుకబడిన మండలాలు సకాలంలో లక్ష్యాలు సాధించేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ఎంపిడిఓలు, ఎంఇఓలు, ఎపిఎం లు, పంచాయితీరాజ్, ఆర్.అండ్.బి, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో గ్రామ స్థాయి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల తోడ్పాటుతో పనులు పూర్తి చేయాలని, పాఠశాలల్లో అన్ని వసతులతో రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్ధులకు స్వాగతం పలుకాలని సూచించారు.
విద్యార్ధినీ విద్యార్ధులకు డ్రెస్సుల కుట్టు పనులు స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని, ఏ సంఘంలోనైనా కెపాసిటీకి తగిన పనులు చేయలేకపోతే ఇతర సంఘాలకు అప్పగించాలని, సకాలంలో డ్రెస్సులు కుట్టేలా క్షేత్రస్థాయిలో ఎపిఎంలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా కార్యాచరణ ఉండాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామ స్థాయి, అర్బన్ స్థాయిలో రోజు వారి పర్యవేక్షణ ఉండాలని, పైపుల లీకేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, త్రాగునీటి వనరులను శుభ్రం చేయించడంతో పాటు ప్రతి నెలా 1, 11, 21 తేదీలలో ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, త్రాగునీటి అవసరాలకు ఎస్.డి.ఎఫ్. నిధులు, డిపార్టుమెంట్ నిధులు, గ్రామ పంచాయితీ నిధులను వినియోగించాలని, సమస్యలు తలెత్తకుండా, అవసరమైన చోట త్రాగునీటి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, ట్యాంకర్లను, ప్రయివేటు బోర్లను వినియోగించాలని, ప్రజలకు త్రాగునీరు అందించడమే మొదటి ప్ర్రాధాన్యతగా భావించి క్షేత్రసాయిలో ఇంజనీరింగ్ అధికారులు, ఎంపిడిఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే గంగాధర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్, జిల్లా విద్యా శాఖ అధికారి కే నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి సునంద పాల్గొన్నారు.