బాసుదేవ్‌ ఆచార్య మరణం తీరని లోటు

– ఏఐఆర్‌ బీఈఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఐటీయూ జాతీయ నేత బాసుదేవ్‌ ఆచార్య మరణం కార్మికోద్యమాలకు తీరని లోటని ఆల్‌ ఇండియా రిజర్వ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐఆర్‌బీఇఏ) విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సమీర్‌ ఘోష్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెస్ట్‌ బెంగాల్లో మారుమూల ప్రాంతంలో జన్మించిన ఆయన జీవితం ప్రజలతో మమేకమైందని గుర్తు చేశారు.
సీపీఐ (ఎం) అభ్యర్థిగా ఆయన్ను ప్రజలు 1980 నుంచి 2014 వరకు తొమ్మిది సార్లు పార్లమెంటుకు ఎన్నుకున్నారని తెలిపారు. ఉపాధ్యాయునిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆచార్య ఉపాధ్యాయ ఉద్యమంలో నాయకునిగా, కార్మికవర్గ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఉద్యోగాన్ని వదిలి బొగ్గు గని కార్మికులు, రైల్వే కార్మికుల హక్కుల పోరాటంలో భాగస్వాములయ్యారని తెలిపారు. 1974 లో జరిగిన చారిత్రక రైల్వే సమ్మెలో ముందు వరసలో నిలబడి అరెస్ట్‌ అయ్యారని గుర్తుచేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచార్య మరణం పట్ల తీవ్ర సంతాపాన్నీ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.