– అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
– కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆచార్య
– బెంగాల్ నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన ఘనత
– సీపీఐ (ఎం), సీఐటీయూ సంతాపం…
– బెంగాల్‌కు భౌతికకాయం తరలింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శ్రామికవర్గ సీనియర్ నేత, ప్రముఖ పార్లమెంటేరియన్ బాసుదేవ ఆచార్య (82) ఇక లేరు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని డీఏవీ స్కూల్‌లో పనిచేసిన ఆయన భార్య ఇటీవల మరణించారు. ఆచార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణం పట్ల సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కే.హేమలత, తపన్‌సేన్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటియు అఖిల భారత నాయకులు ఎం సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, ఐద్వా హైదరాబాద్ కార్యదర్శి కె. నాగలక్ష్మి తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆచార్య భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్‌కు తరలించారు. బెంగాల్లోని బంకురా నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు (1980 నుంచి 2014 వరకూ) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన ఆచార్య… శ్రామికులు, పేదల పక్షాన పార్లమెంటులో గళమెత్తటం ద్వారా ఎంపీగా చిరస్మరణీయమైన పాత్రను పోషించారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా పని చేసిన ఆయన ఆ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నయా ఉదారవాద, ప్రయివేటు ఆధారిత చర్యలను వ్యతిరేకించటంలో కీలక పాత్రను పోషించారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా దశాబ్దాలపాటు సేవలందించిన ఆచార్య… ఆరేండ్ల నుంచి ఆ సంఘం జాతీయ సెక్రటేరియట్‌కు శాశ్వత ఆహ్వానితుడిగా వ్యవహరిస్తున్నారు.
శ్రామిక ప్రజలకు సంబంధించిన అన్ని సమస్య లపైనా ఆయన పోరాడారు. ఆయా సందర్భాల్లో పాలకులను పార్లమెంట్‌లో సూటిగా ప్రశ్నించేవారు. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని లెక్కచేయని ఆయన కార్మికవర్గ పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప సీఐటీయూ సంస్థాగత సమావేశాలకు ఆయన క్రమం తప్పక హాజరయ్యేవారు. ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఆచార్య దేశవ్యాప్తంగా వివిధ గనులను సందర్శించారు. నెల క్రితం కూడా లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా, అద్రా, పురూలియా, పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎఫ్‌సీఐ గోడౌన్ కార్మికుల ప్రదర్శనలో సైతం పాల్గొన్నారు. ఈ రకంగా కార్మికవర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తప్పించిన ఆచార్య… తన తుది శ్వాస వరకూ ఆయా పోరాటాల్లో పాల్గొన్నారు.
ముందు పీఠిన నిలబడ్డారు : డాక్టర్ హేమలత, తపన్‌సేన్
ఆచార్య మృతి పట్ల సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె. హేమలత, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తపన్‌సేన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘కామ్రేడ్ బాసుదేవ ఆచార్యది చురుకైన రాజకీయ జీవితమే కాదు.. చురుకైన కార్మికోద్యమం కూడా. ఆయన సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో ముందు పీఠిన నిలబడ్డారు. మరణించే వరకూ ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. బొగ్గు కార్మికుల పోరాటాలకు నాయకత్వం వహించారు. లోకో రన్నింగ్‌తోపాటు రైల్వేలోని వివిధ విభాగాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులను సమన్వయం చేయడంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. తాత్కాలిక, సాధారణ, కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత కార్మికులుగా క్రమబద్ధీకరించడం లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఎఫ్‌సీఐ కార్మికుల ఉద్యమంతోపాటు అనేక ఇతర పోరాటా ల్లోనూ పాల్గొన్నారు. ఆలిండియా యూనియన్ ఆఫ్ ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘానికి చివరి వరకూ ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు…’ అని హేమలత, తపన్‌సేన్ నివాళులర్పించారు.
నిబద్ధత గల నేత : సీఐటీయూ రాష్ట్ర కమిటీ
కార్మికవర్గ లక్ష్య సాధనకు తుది శ్వాస వరకూ నిబద్ధతతో పని చేసిన గొప్ప నేత ఆచార్య అని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతినబూనాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం, రైల్వే కాంట్రాక్టు వర్కర్స్‌్ యూనియన్ సంతాపం
ఆచార్య మరణం పట్ల సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం, రైల్వే కాంట్రాక్టు వర్కర్స్‌్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు సంతాపం తెలిపారు. రైల్వే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా, రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు కోసం, బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడారని నివాళులర్పించారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సంతాపం
బాసుదేవ్ ఆచార్య మృతికి పార్టీ పొలిట్‌బ్యూరో తీవ్ర సంతాపం తెలియచేసింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. విశిష్ట పార్లమెంటేరియన్‌గా ఆయన ఎల్లప్పుడూ ప్రజా సమస్యలనే ప్రస్తావించేవారని పేర్కొంది. 1980 నుండి 2009 వరకు లోక్‌సభకు 9సార్లు ఎన్నికయ్యారని తెలిపింది. కార్మికోద్యమంలో చురుకుగా పాల్గొన్న బాసుదేవ్ ఆచార్య ప్రధానంగా రైల్వే, బొగ్గు కార్మికుల నేతగా వున్నారు. కార్మిక వర్గ సిద్ధాంతాల పట్ల ధృఢమైన విశ్వాసాన్ని కలిగివుంటూ దోపిడీ వ్యవస్థ మార్పు కోసం జరిగే పోరాటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని పేర్కొంది.
తీరని లోటు : తమ్మినేని
బాసుదేవ ఆచార్య మృతి ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి, పార్టీకి తీరని లోటని పేర్కొంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై పార్లమెంట్‌లో తనదైనశైలిలో ఆయన గళం విప్పేవారని గుర్తు చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో క్రియాశీలక పోషించారని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా సుధీర్ఘకాలం పని చేసినా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబర జీవితం గడిపారని కొనియాడారు. ఆచార్య కుటుంబ సభ్యులకు తమ్మినేని ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.