ఆడపిల్ల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. ఈ సృష్టికి మూలమైన మహిళను అగ్రభాగాన నిలిపే పండుగ. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ. సామాజిక అనుబంధాల సమాహారమీ పండుగ. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన పండుగ బతుకమ్మ అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. అన్నం పెట్టే మట్టిని గౌరవిస్తూ, పూలను పూజిస్తూ మహిళలంతా కలసి ఆడిపాడటం ఒక్క బతుకమ్మలోనే మనకు అగుపిస్తుంది. ఆడపిల్లను ‘బతుకమ్మా’ అని కోరుకునే పండుగ. అందుకే దీన్ని మహిళల పండుగంటారు.
పండుగంటే ఓ ఆనందం. పండుగంటే ఓ ఉత్సాహం. పండుగంటే ఓ చైతన్యం. అందునా బతుకమ్మంటే ఆడపిల్లల సంబురం. అయితే బంధాలన్నీ ఆధునికతలో కొట్టుకుపోతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఈ యాంత్రిక సమాజంలో ఆమె వేదన, బాధ, దు:ఖం, సుఖం, సంతోషం పంచుకునే వారే కరువయ్యారు. ఆ లోటును కాస్తయినా భర్తీ చేసేదే ఈ పండుగ. ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం… చదవనిద్దాం.. అంటూ జరుపుకునే పండుగ. ఇలా అమ్మాయిల సమానత్వాన్ని కోరుతూ బతుకమ్మను దశాబ్దాలుగా జరుపుకుంటున్నాం. ఏడాదికేడాది పండుగ ప్రధాన్యం పెరుగుతూనే ఉంది. పండుగలు వస్తున్నాయి, పోతున్నాయి. సమానత్వం మాత్రం కనుచూపుమేర అగుపించడం లేదు. ఆడపిల్ల మనుగడ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇది అత్యంత విషాదం.
దేశం గుండె జల్లుమనిపించిన కోలకత్తా డాక్టర్ ఘటన దీనికి ఓ నిదర్శనం. గుజరాత్ మారణహోమంలో తన వారిని పోగొట్టుకొని, సామూహిక లైంగిక దాడికి గురైన బిల్కిస్‌బానో మరో సజీవ సాక్ష్యం. తనకు జరిగిన అన్యా యానికి కుంగిపోకుండా పోరాటం చేసి నిందితులను జైలుకు పంపిన సాహస వనిత బిల్కిస్. అలాంటి నీచమైన వారిని బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. కాషాయ దళం వారిని పూలదండలతో ఊరంతా ఊరేగించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలదూ మహిళల పట్ల వారి గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవడానికి.
కోకొల్లలుగా జరుగుతున్న ఇలాంటి అమానుష ఘటనలు అమ్మాయిలకు బతుకు లేకుండా చేస్తుంటే.. ఆడపిల్లను భారంగా భావిస్తున్న వాళ్లను ఈనాటికీ చూస్తూనే ఉన్నాం. పుట్టక ముందే ఉసురు తీస్తున్న వారు కొందరైతే, పురిట్లోనే ఊపిరి తీసేసేవారు మరికొందరు. పుట్టాక పారేసే వారు ఇంకొందరు. ఇన్ని అవాంతరాలు దాటి కళ్లు తెరిచి భూమ్మీదకి వచ్చినా ఆడబిడ్డ అడుగడుగునా వివక్షకు గురవుతూనే ఉంది. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిసినా కొనసాగుతూనే ఉన్నది. కారణంగా స్త్రీ, పురుష నిష్పత్తిలో ఊహించని తేడా వస్తోంది. ఇప్పటికే వివాహానికి ఆడపిల్లలు దొరక్క ఇబ్బంది పడుతున్న వారిని మనం చూస్తున్నాం.
2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషులకు 940 మంది మాత్రమే మహిళలున్నట్టు తేలింది. ఇలా బాలికల సంఖ్య అతి వేగంగా తగ్గడానికి లింగ వివక్షే ప్రధాన కారణం. చట్టాలెన్ని వచ్చినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు విద్యావకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. పెండ్లి పేరుతో ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు. పోషకాహార లోపం కూడా వారి ఎదుగుదలకు మరో ప్రధాన సమస్య. కుటుంబ ఆర్థిక సమ్యలే ఇందుకు కారణం. పనికోసం వలసలు పోతున్న అమ్మాయిల సంఖ్య తక్కువేమీ లేదు. అక్కడ ఆదుకునేవారు లేక లైంగిక దాడులకు గురవుతున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే ప్రభుత్వాలు చెబుతున్న మహిళా సాధికారత కేవలం ఉపన్యాసాలకే పరిమితమని స్పష్టమవుతోంది.
బతుకమ్మ వచ్చిందంటే ఆడపచుకులకు చీరలు పంచిపెట్టి చేతులు దులుపుకోవడంలో ప్రభుత్వాలు తల మునకలవుతున్నాయి. మహిళలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు పండుగలను సైతం ఓ ఎరగా వాడు కుంటున్నాయి. ఈ సృష్టికి మూలమైన అమ్మాయిని కాపాడుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నా యి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బతికేది ఎట్టమ్మ ఉయ్యాలో’ అంటూ దశాబ్దాలుగా పాడుకుంటున్నా ఆ ప్రశ్నకు సమాధానం నేటికీ దొరకలేదు. ఇక ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నినాదాలు వింటూ మురిసిపోవడానికి తప్ప మరెందూ పనికి రావడం లేదు.
మహిళల రక్షణ ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉండాలి. పాఠశాల విద్య నుండే మహిళా సమానత్వంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. అమ్మాయి కూడా తనతోటి మనిషే అనే స్పృహ అబ్బాయిల్లో కల్పించాలి. అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినపుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం అన్న గాంధీజీ జయంతి కూడా ఈరోజే. గాంధీ కోరిన అలాంటి రోజు రావాలంటే లక్షలు ఖర్చుపెట్టి బతుకమ్మను ఘనంగా జరిపితే సరిపోదు. ఈ బతుకమ్మ పండుగ సాక్షిగా నిజమైన మహిళా సాధికారత దిశగా పాలకుల విధానాలు ఉండాలి. నడిచే బతుకమ్మలకు రక్షణ కల్పించాలి. అప్పుడే నిజమైన బతుకమ్మ సంబురం.