రంగు రూపులెన్నయినా తన ఒడిలో చేరదీసింది బతుకమ్మ. అమ్మ ఆశగా ఎదురుచూస్తోంది.. బతుకమ్మకు బిడ్డలొస్తారని. బతుకమ్మ అనేది తెలంగాణ వారి రంగుల, ఉత్సాహభరితమైన పండుగ. ప్రతి ప్రాంతంలో ప్రకృతిలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకునేది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ప్రకృతిని ఆరాధించే పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఓ వైపు నవరాత్రుల ఉత్సవాలు మరోవైపు పువ్వుల జాతరే బతుకమ్మ పండుగ.
రంగు రంగుల పూలను అందంగా పేర్చి ప్రకృతి పరవశించి పోయే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. కులం, మతం, చిన్నా పెద్ద, ప్రాంతం అని తేడా లేకుండా అన్ని వర్గాల వారూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలు అందరూ బతుకమ్మ తయారు చేసి వాటి చుట్టూ చేరి జానపద గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. యాడ లేని విధంగా పూలను పూజించే ఏకైక పండుగ ఒక్క తెలంగాణలోనే జరగడం మనకు గర్వకారణం. భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున అంటే బతుకమ్మ వేడుకల్లో తొలి రోజున ఎంగిలిపూలతో వేడుకలు జరుపుకుంటారు. ఆడబిడ్డల ఈ పండగ వస్తుందంటా పువ్వులన్నీ మురిసిపోతున్నాయి.
మహిళల సంబరం
ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మగా సాగి చివరి రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ, అదే సమయంలో బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు.
పూల సేకరణ
నేడు.. బంగారు బతుకమ్మ వనంలో నుండి కాదు పూలన్ని మార్కెట్ లోంచే పుట్టుకొస్తుంది. వెనకటి రోజుల్లో బతుకమ్మ పండుగ కోసం ముందుగానే పువ్వుల సేకరణకు పట్టణాలు పల్లెల వైపు ప్రకృతి బాట పట్టేవారు. చేల వెంట, గుట్టల వెంట వెళ్లి పూలు సేకరించే వారు. కానీ నేడు మార్కెట్లలోనే బతుకమ్మకు కావల్సిన పూలన్నీ ఇట్టే దొరికేస్తున్నాయి. చివరకు గ్రామాల్లో కూడా పువ్వులను కొనుక్కోవల్సి వస్తుంది. కాలం మారితే మంచిదే, కానీ ఇలా కాదు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వయంగా పువ్వులను సేకరించడంలో ఉన్న ఆనందమే వేరు. అటువంటి ఆనందం ఇప్పుడు కనుమరుగయింది. గతంలో ఇంటికో జానపద కవయిత్రి వుండి జానపదాలు పాడుతూ చుట్టూ కాముడు వేస్తూ మన సంస్కృతిని కాపాడే సంస్కృతి వుండేది. కానీ ఇప్పుడు అందరూ గాయనీమణులే కానీ పాటలు మాత్రం డి. జె. లోనే రావాలి అనే ధోరణి వచ్చేసింది. ఈ పద్ధతికి చరమగీతం పాడాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.
– జాజుల దినేష్, 9666238266