సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీ వాణీ టెక్నో స్కూల్ లో గురువారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించగా మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు పాల్గొన్నారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయినిలు కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి, కోలాటాలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలవైన బతుకమ్మ పండుగ పైన అవగాహన కల్పించేందుకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కెసిఆర్ నగర్ ఉన్నత పాఠశాలలో.. పట్టణంలోని రెండవ వార్డులోని కేసీఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి బతుకమ్మ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దారం ఉమాదేవి, ఉపాధ్యాయులు భాస్కర్, యాదగిరి, వంగ వెంకటరాంరెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, స్వరూప రాణి పాల్గొన్నారు. కాకతీయలో ముందస్తుగా ఘనంగా బతుకమ్మ వేడుకలు.. కాకతీయ టెక్నో హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గు మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్ననాటి నుండే సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే, మన తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం, అభినందనీయమని కొనియాడారు. అనంతరం కోమటి చెరువు వద్దకు ఉపాధ్యాయులతో విద్యార్థులతో వెళ్లి బతుకమ్మ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.