మాటామంచి తెలియని ఆదిమ మానవుణ్ణి నాగరీకునిగా మార్చింది భాష. తన అవసరాలను, భావాలను ఇతరులతో చెప్పుకోవడానికి చేసిన సంజ్ఞలే మాటలయ్యాయి. ప్రకృతికి పరవశించిన మనిషి కూనిరాగాలు తీశాడు. అప్రయత్నంగానే తన పనిపాటల్లో, కష్టసుఖాల్లో తన భావాలను మాటల అల్లికగా చేర్చుకుంటూ పాటలుగా పాడుకున్నాడు. ప్రకృతమ్మ ఒడిలో పల్లెసీమల్లో జీవించిన జానపదులు కల్లాకపటమెరుగనివారు. తమ జీవితాలకు మూలమైన గట్టు, పుట్టా, గాలి, నీరు, చేను అన్నీ తమను నడిపిస్తున్న అతీత శక్తులని నమ్మారు. ఆ నమ్మకాన్నే తమ జీవితంలో అడుగడుగునా అనుసరించారు. ఆనందం కల్గినా, అవరోధాలు ఏర్పడినా అంతా భగవంతుని లీలగా భావించిన జానపదులు, తమను కాపాడమని వేడుకున్నారు. ఆటపాటలతో అలరింపజేశారు. అయితే జానపదులంటే ఎవరో చూద్దాం.
జానపదులనగా పల్లెటూరివారు. పల్లెలో నివసించినా, పట్టణాలలో జీవించినా పల్లె మనసున్న ప్రతి ఒక్కరూ జానపదులే అని ఇప్పుడు చెప్పుకోవచ్చు. కారణం నాగరిక విజ్ఞాన ప్రపంచంలో, జీవనం కోసం, చదువుల కోసం పల్లె పట్టణం చేరింది. అందుకే నేడు జానపద మనసున్న ఎవరైనా జానపదులనే చెప్పుకుంటున్నా జానపదుల నుండి వెలువడిన పలు అంశాలు జానపద సాహిత్యంగా, జానపద విజ్ఞానంగా చెబుతాం. జానపదులకు సంబంధించినది జానపద సాహిత్యం. తెలుగు సాహిత్యంలో జానపద సాహిత్యానికి ప్రత్యేకత వుంది. వచనం, కవిత్వం, కళలు ఇవి సాహిత్యానికి ఊపిరవుతాయి. జానపద సాహిత్యంలో వచన సాహిత్యం, కవిత్వం లేక గేయసాహిత్యంతో పాటు జానపద కళలున్నాయి. వాటిల్లో జానపద గేయసాహిత్యానికి విశిష్టత వుంది. జానపద గేయసాహిత్యంలో బతుకమ్మ పాటలకు పెద్దపీట వుంది. బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపుతూ, జానపదుల మనస్తత్వాన్ని స్పష్టం చేసేవి బతుకమ్మ పాటలు.
తెలంగాణా ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగ ఇక్కడి ప్రజల బతుకు పండుగ. ఈ ప్రాంతానికి మాత్రమే సొంతమైనది బతుకమ్మ.
ఆటపాటలు నిజంగా ఇక్కడి ప్రజల బాధలను ప్రతిబింబిస్తాయి. పనిపాటలు చేసేటప్పుడు కష్టం కనిపించకుండా పాడుకునే పాటల్లో కూడా బతుకమ్మ పాటలున్నాయి. ఉయ్యాల్లో, వలలో, కోలో, చందమామ అనే చరణాలతో సాగే ఈ పాటల్ని ఉయ్యాల పాటలని కూడా అంటాం. అంతే కాదు పండుగ వేళల్లో పాడుకునే పాటల్లో రామాయణ, భారత, భాగవత కథలకు సంబంధించిన పౌరాణిక గేయాలు; పల్నాటి వీరులు, సర్వారాయుడు, కాటమరాజుల వంటి వీరగాథలు; చారిత్రక కథలు; శైవ వైష్ణవ సంబంధిత కథలను తెలిపే మత సంబంధిత గేయాలు; భక్తి, వేదాంతం, కర్మ, వైరాగ్యం, జ్ఞానం, నమ్మకాలను తెలిపే పారమార్థిక గేయాలు; లాలిపాటలు; పెండ్లి పేరంటాల వంటి పలు వేడుకలు, ఆచారాలను తెలిపే స్త్రీల పాటలు; పలు శృంగార, అబ్బిత, కరుణరస, పిల్లల పాటలతో పాటు, తన గ్రామం కోసం, తమ ప్రజలకోసం బలైన పేరంటాళ్ల కథలు, ఉద్యమాల్లో ఊపిరి కోల్పోయిన వీరుల గాథలున్నాయి. వాస్తవ పరిస్థితులను చిత్రీకరించే వాస్తవ సంఘటనల గేయాలున్నాయి.
అయితే ఎంతో విశిష్టత కల్గిన బతుకమ్మ పండుగ గురించి ఒక్క మాట చెప్పుకుందాం. ఈ పండుగకు ఇదే మూలమని కచ్చితంగా చెప్పకున్నా, ఇవీ మూలమే అనుకోవచ్చనే కొన్ని అంశాలున్నాయి. బ్రతుకు+అమ్మ- బ్రతుకమ్మ; చల్లని బతుకునిచ్చే తల్లి గౌరమ్మగా; ఆ గౌరమ్మే బతుకమ్మగా; తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ కొలువబడుతుంది. శ్రీలక్ష్మి స్వరూపంగా కొలువబడడం కూడా మనం ఈ పాటల్లో చూడవచ్చు.
”శ్రీ లక్ష్మిదేవియు ఉయ్యాలోన/ సృష్టి బతుకమ్మాయె ఉయ్యాలో/ ఆనాటి కాలాన ఉయ్యాలో/ ధర్మాంగుడనురాజు ఉయ్యాలో/ ఆరాజు భార్యయు ఉయ్యాలో/అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో/ నూరునోములు నోమి ఉయ్యాలో/ నూరు మందిని గాంచె ఉయ్యాలో/ ———— ఉయ్యాలో/ వైరులచె ఏతులైరి ఉయ్యాలో/ తల్లిదండ్రుల వుండ్రు ఉయ్యాలో/ తరగనీ శోకమున ఉయ్యాలో/ ధనధాన్యముల బాసి ఉయ్యాలో/దాయాదులను బాసి ఉయ్యాలో/ వనితతో నారాజు ఉయ్యాలో/ వనమందు నివసించె ఉయ్యాలో/ కనికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో/ ఘనతపంబొనరించె ఉయ్యాలో”
అలా తపస్సు చేసిన ఆ దంపతులకు లక్ష్మిదేవి స్వయంగా పుత్రికగా జన్మించింది. ఆమె చిరకాలం బతకాలని మునులు, దేవతలు ‘బతుకమ్మ’ అని పిలిచారట. ఆమె బతుకమ్మగా పేరొంది భువిలో (బతుకునిచ్చే తల్లిగా) పూజలందుకుందని ఈ పాటద్వారా అర్థమవుతుంది.
జానపదులకు లక్ష్మి, పార్వతి, సరస్వతి – ముగ్గురు దేవతలు సమానమే. ముగ్గురి మధ్య బేధాన్ని పాటించక, శక్తి రూపంగా కొలవడం చూస్తాం.
”శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ/ చిత్రమై ఆచునమ్మ గౌరమ్మ/ భారతి సతివయ్యు బ్రహ్మకిల్లాలివై; పార్వతీదేవివై, పరమేశురాణివై/ పరగశ్రీలక్ష్మివయ్యు గౌరమ్మ; భార్యవైతివి హరికి”
ఇలా పాడుకునే ఈ గౌరమ్మ పాటల్లో బతుకమ్మను శ్రీశక్తి స్వరూపిణిగా చూస్తాం. పండుగ విశిష్టతతో పాటు, పండుగ జరుపుకునే విధానం, ఈ పండుగ జరుపుకోవడంలో కలిగే ఆనందాన్ని తెలుసుకుంటాం.
గేయాల్లో కాకుండా కొన్ని కథల ద్వారా బతుకమ్మ- ఒక పేరంటాలుగా, ఒక సాహస వనితగా; వాసవి శక్తి రూపిణిగా కూడా తెలుపబడింది. అయితే పండుగ జరుపుకునే పద్ధతిలో, పాడుకునే ప్రతి పాటలో జానపదస్త్రీల నమ్మకాలు, ఆచార వ్యవహారాల పట్ల, కుటుంబం పట్ల ఎంతో మమకారం వుంటుంది.
బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుండి విజయదశమి వరకు పదిరోజులు బతుకమ్మ రూపంలో గౌరమ్మను స్త్రీలు కొలుస్తారు. బతుకమ్మ ముఖ్యంగా స్త్రీల పండుగ. స్త్రీల మనస్తత్వాన్ని అద్దం పట్టే పండుగ. స్త్రీలకు ఎంతో ఇష్టమైన రంగురంగుల పూలతో బతుకమ్మ పేరుస్తారు. పూవుల ఎంపికలో, రంగులను అద్దడంలో, బతుకమ్మను పేర్చడంలో స్త్రీలల్లో సహజంగా వుండే కళాత్మకత స్పష్టమవుతుంది.
”బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి – మంగళం బంగ నిన్ను
మధ్యన నిల్పుయు | రంగు గుమ్మడి పువ్వులు గౌరమ్మ రాశిగా నర్పింతుమూ;
మహిషాసుర మర్ధిని అయిన మాతనం విజయదశమి సందర్భంలో పూలరూపంలో కొలుస్తారు. అంతేకాదు, బతుకమ్మను పేర్చే విధానంలో పండితులచే పూజింపబడిన స్త్రీ శక్తి స్వరూపం, పామర జనంచే పూజలందుకోవడానికి బతుకమ్మగా నిలిచిందా! అనిపిస్తుంది.
శ్రీ చక్రోపాసనం సర్వోత్కృష్టమైన శక్తి ఆరాధన విధానాల్లో ఒకటి. శ్రీచక్రం త్రిపుర సుందరికి ప్రతిరూపంగా భావించి పండితులు కొలుస్తుంటారు. శ్రీ చక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మను పోలి వుండడం, కుండలినీయోగ విశేషశక్తిగా బతుకమ్మ మధ్యలో గౌరిని నిల్పడం మొదలైన విధానాల వల్ల పండితులు కొలిచే శ్రీ చక్రమే పామరుల బతుకమ్మగా తెలంగాణలో కొలువబడుతుందని పెద్దల నమ్మకం.
అయితే పాడిపంటలతో విలసిల్లిన పల్లె సీమల్లో విరివిగా పూచే అన్ని రకాల పూలను సేకరించడం, తిరిగి బతుకమ్మను చెరువులోనే కలపడంలో కొంత భక్తి భావన ఉంటే మరింత శాస్త్రం కూడా దాగి వుంది. ప్రకృతిలోని పూలను తిరిగి ప్రకృతికే చేర్చడం, అంతే కాదు వర్షాకాలంలో నాచుతో నిండిన కాలువలు, బావులు పూల పరిమళాలతో శుద్ధి అవుతాయనే భావన కూడా దాగి వుంది. అయితే ఇలా చెబుతూ వుంటే బతుకమ్మ పండుగ పుట్టుపూర్వోత్తరాలు, పేర్చే విధానం, పండుగ జరుపుకోవడం, ఆట పాటలు… చాలా అంశాలున్నాయి. అంతే కాదు మహిళలు ప్రత్యేకంగా ఆడే ఆట బతుకమ్మ అయితే, ఈ పండుగ ప్రారంభానికి ముందు జరుపుకునే కన్నె పిల్లల, చిన్న పిల్లల పండుగ ‘బొడ్డెమ్మ’. ఈ రెండు పండుగలు జానపదుల మనస్తత్వాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చూపుతాయి.
”మాలుమర్తి మేడమీద చందమామ/ వెండియ్య వెనగరలు చందమామ/
వెండియ్యో వెనగరలకు చందమామ/ ఇత్తడియ్యా చేరలు చందమామ/
ఇత్తడియ్య చేరలకు చందమామ/ రాగియ్యా కడవలు చందమామ/
రాగియ్య కడవలకు చందమామ/ ముత్యాల ముగ్గులు చందమామ/ ముత్యాల ముగ్గులకు చందమామ/ వజ్రాల వాకిండ్లు చందమామ/
వజ్రాల వాకిండ్లకు చందమామ/ పవడాల పందిళ్లు చందమామ”
స్త్రీలు తమ ఇల్లు, కుటుంబం సరిసంపదలతో అలరారాలని కోరుకుంటారు. తమ ఇండ్లు వాకిళ్లను వజ్రాలు, పవడాలతో పోల్చడంలో, ముగ్గుల్లోని చుక్కల్ని ముత్యాలుగా భావించడంలో వారి మానసిక సంపద అర్థమవుతుంది.
మరో పాట చూద్దాం :
ఆడపిల్లలకు పుట్టినింటిపై మక్కువ ఎక్కువ. పుట్టింటివారు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు. ఇది ఎంతో సహజం.
”ఇద్దరక్క చెల్లెండ్ల ఉయ్యాలో ఒక్క ఊరికిస్తె ఉయ్యాలో/ ఒక్కడే అన్నయ్య ఉయ్యాలో/ వచ్చన్న పోడు ఉయ్యాలో”
అంటూనే అన్నకు ఎన్నో పనులున్నాయని, అవన్నీ అడ్డమయ్యాయని చెప్పుకుంటారు.
”ఎలబాద్రి చెట్టుకు ఉయ్యాలో/ ఏడే మొగ్గలు ఉయ్యాలో/ ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో/ తక్కేడు పత్తి ఉయ్యాలో/ ముసలమ్మ వడికింది ఉయ్యాలో/ ముత్యాల పత్తి ఉయ్యాలో/ వయసమ్మ వడికింది ఉయ్యాలో/ వజ్రాల పత్తి ఉయ్యాలో/ బాలెంత వడికింది ఉయ్యాలో/ బంగారు పత్తి ఉయ్యాలో/ ఈ పత్తి ఈ పత్తి ఉయ్యాలో/ సాలోనికిస్తె ఉయ్యాలో”
కులవృత్తులతో అలరారిన గ్రామాల్లో, కుటుంబంలోని సభ్యులందరు పనిలో పాల్గొనేవారని అర్థమవుతోంది.
”చిన్న చేతికి రెండు ఉయ్యాలో/ సన్నంపు గాజులు య్యాలో/ అవినా చేతికి ఉయ్యాలో/ చుక్కలయి మెరిసే ఉయ్యాలో/ పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో/ పసుపుకుంకుమ ఉయ్యాలో/ అవి నా నొష్టికి ఉయ్యాలో/ పద్మమయి మెరిసె ఉయ్యాలో/ సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో/ చుక్కలా మెట్టలు ఉయ్యాలో/ అవి నా కాళ్లకు ఉయ్యాలో/ చుక్కలయి మెరిసె ఉయ్యాలో”
నిత్య సౌభాగ్యం కోరుకునే స్త్రీలు తమ పసుపుకుంకుమ పరమాత్ముని దీవెనగా భావిస్తారు. తమ ముత్తైదుతనం నిలవాలని కోరుకుంటూ పూజలు చేస్తారు. పిల్లా పాపలతో విలసిల్లాలని కోరుకునే స్త్రీలు, బతుకమ్మలను రెండింటిని పేరుస్తారు. గౌరమ్మలను కూడా తల్లిగౌరమ్మ, పిల్ల గౌరమ్మ అంటూ రెండు చేయడం గమనిస్తాం.
సీతారాములు తమ కుటుంబంలోని సభ్యులుగా భావిస్తూ స్త్రీలు ప్రతి పనిలో, అన్ని సంఘటనల్లో వారిని చూపిస్తూ పాటలు పాడుకుంటారు.
”ఇల్లలికి ముగ్గులు ఉయ్యాలో/ పెట్టేటి వారెవరు ఉయ్యాలో/ ఇంతకు సిరసనగండ్ల ఉయ్యాలో/ ఏతేటి వారెవరు ఉయ్యాలో” అంటూ కడపలలికి ముగ్గులు పెట్టేది సీతమ్మది; సిరసనగండ్లను ఏతేది రామయ్యని చెబుతారు. ఈ పాటలో ఒక ప్రాంత విశిష్టతతో పాటు రాజైనా, రాణి అయినా అందరు పనిచేసే శ్రమ సంస్కృతి అర్థమవుతుంది.
”మూడామడాలు బోయి వలలో/ మూలకాలు గొట్టి వలలో/ నాలుగామడలు బోయి వలలో/ నాగళ్లు కొట్టి వలలో/ కొట్టినా సామాను వలలో/ బళ్లకెత్తారు వలలో”
వ్యవసాయం ముఖ్యవృత్తిగా సాగిన పల్లె ప్రజలు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను తామే కూర్చుకునేవారని అర్థమవుతుంది.
”ప్రేమ కొండకు బోయి ఉయ్యాలో/ రేపసూలలు తెచ్చి ఉయ్యాలో/ అల్లింతు రాబట్టి ఉయ్యాలో/ ఆంత్రవేగాన ఉయ్యాలో/ గిద్దెడు ముత్యాలు ఉయ్యాలో/ గిలిపి అల్లిన బుట్టి ఉయ్యాలో/ బుట్టొక్కటల్లరే ఉయ్యాలో/ భూమి ఎరుకతడ ఉయ్యాలో”
బుట్టలల్లడం, నాగళ్లు చేయడం, కుండలు తయారు చేయడం, బట్టలు నేయడం… ఇలా ప్రతి పని తమదిగా భావించిన జానపదులు తమ అనుభూతులను, పనులను, కష్టసుఖాలను పాటలుగా మార్చుకున్నారు. అందుకే బతుకు చిత్రాన్ని చూపే పాటలుగా బతుకమ్మ పాటలకు ఎంతో వైశిష్టత వుంది. వేలల్లో ఉన్న ఈ పాటలు స్త్రీల గుండెల్లోంచి పుట్టి మౌఖికంగా ప్రచారం నొందాయి. ఇవి ఆశువుగా చెప్పబడేవి. జానపద గేయ లక్షణాలన్నీ కూడా వీటికున్నాయి.
బతుకమ్మ ఆట ఆడేటప్పుడు గుండ్రంగా నిలబడి మహిళలు వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, లయబద్దంగా అడుగులు వేస్తారు. ఆటకు తగిన లయతో, త్రిశ, చతురస్ర, ఖండగతుల్లో ఉయ్యాలో, వలలో, కోలో, చందమామ అనే పల్లవుల ఆవృతంతో పాటలు పాడుతారు. ఒక స్త్రీ చెబుతుంటే మిగతావారు పాడుతుంటారు. ఈ ఆటలో కూడా వారి జీవనశైలి అర్థమవుతుంది. కష్టజీవులు బాగా వంగి, వేగంగా జరుగుతూ ఆడితే, మిగతా వారి నడతలో, ఆటలో నెమ్మది కనిపిస్తుంది. పాటలు కూడా జీవనశైలిని, వారి పరిసరాలను, ఆచారాలను వస్తువులుగా చేసి పాడినవే.
బతుకమ్మ ఆట ఆడిన తర్వాత కోలాటాలు వేస్తారు. కోలాటాలు వేసేటప్పుడు కూడా పాడే పాటలు కూడా ప్రత్యేక శైలిలో వుంటాయి. ఈ పాటలను చూద్దాం.
”చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దు గుమ్మ/ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన ||బంగారు|| ||చిత్తు||/ రాణి రాముడోడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన/ వజ్రాల బిందెదీస్క వనిత నీళ్లకు బోతె/ వెంటేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన”
”చేమతి వనములో భామలు/ చెంగువిడిచినారు భామలు/ చెలియకుంటలోన భామలు/ చెంగువిడిచిరమ్మ భామలు”
అంటూ పాడుకునే ఈ పాటలో కృష్ణుని, గొల్లభామల మధ్య సన్నివేశాన్ని సరసంగా వర్ణించబడింది.
అదేవిధంగా కోలాటాల తరువాత, బతుకమ్మ ఆటకు ముందు గౌరీపూజను చేస్తుంటారు. ఆ తరువాత గౌరమ్మను సాగదోలుతుంటారు. అలా గౌరమ్మను సాగనంపడంలో తమ ఆడబిడ్డను సాగనంపుతున్నట్టుగా భావిస్తారు.
వినవంతునింట్లో వెట్టి వినవంతునింట్లో బుట్టి … అంటూ సాగే పాటలో వడిబియ్యం బెట్టి, వరుసాతో సద్దులు గలిపి, ఆ శంభుని కప్పగించి, పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ పోయి నీ అత్తింటి బుద్దిగలుగుండు… అంటూ నీతులు చెబుతారు.
ఆ తరువాత నీటిలో వదిలేటప్పుడు ప్రకృతి, పురుషునిలో లీనమైనట్టుగా భావిస్తూ సాగనంపుతారు.
ఈ విధంగా తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేక మకుటాయమానంగా నిలిచిన బతుకమ్మ ఆట, పాట సంస్కృతి ఇక్కడి ప్రజల మనస్తత్వానికి అద్దం పడుతాయి.
– డా|| బండారు సుజాత శేఖర్